Minister Dharmana : అమరావతిపై హైదరాబాద్ ఎగ్జాంపుల్ చెప్పిన మంత్రి ధర్మాన
Minister Dharmana On Chandrababu : ఏపీ విభజనపై మంత్రి ధర్మాన ప్రసాదరావు కీలక వ్యాఖ్యలు చేశారు. హైదరాబాద్ అభివృద్ధితోనే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విడిపోయిందని చెప్పారు. రాష్ట్రవ్యాప్తంగా అభివృద్ధి వికేంద్రీకరణ జరిగి ఉంటే ప్రత్యేక తెలంగాణ డిమాండ్ వచ్చేదే కాదని వ్యాఖ్యానించారు.
రాష్ట్ర ప్రజలను టీడీపీ మభ్యపెట్టాలని చూస్తోందని మంత్రి ధర్మాన ప్రసాదరావు అన్నారు. అమరావతినే మాత్రమే రాజధాని చేయాలనడం వెనక దురుద్దేశం ఉందని వ్యాఖ్యానించారు. 29 గ్రామాల ప్రజలు చంద్రబాబు మాయలో పడొద్దని అన్నారు. హైదరాబాద్ అభివృద్ధితోనే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విడిపోయిందని వ్యాఖ్యానించారు. అమరావతి రైతుల మహా పాదయాత్ర, మూడు రాజధానుల వంటి అంశాలపై శ్రీకాకుళంలో మాట్లాడారు.
65 ఏళ్లలో అందరం కలిస హైదరాబాద్‌ను అభివృద్ధి చేసుకున్నామని మంత్రి ధర్మాన అన్నారు. అప్పుడు అన్ని ప్రాంతాలను అభివృద్ధి చేసుకుంటే ఇలాంటి ప్రమాదం వచ్చేదికాదని చెప్పారు. ఉమ్మడి రాష్ట్రంలో అన్ని ప్రాంతాలను అభివృద్ధి చేసుంటే విభజన జరిగేది కాదని వ్యాఖ్యానించారు. ఒక్క అమరావతినే అభివృద్ధి చేస్తే మళ్లీ అలాంటి పరిస్థితి రాదా? అని అడిగారు. ఒక్క చోటనే అభివృద్ధి అనేది సరికాదని, శివరామకృష్ణన్ కమిటీ కూడా అదే విషయం చెప్పిందన్నారు.
'ఆరున్నర దశాబ్ధాలుగా అభివృద్ధి అంతా హైదరాబాద్‌లోనే జరిగింది. రాష్ట్రంలోని మిగిలిన చోట్ల అభివృద్ధి జరగకపోవడంతో తెలంగాణ ప్రజలు విభజన కోరుకున్నారు. రాష్ట్రవ్యాప్తంగా అభివృద్ధి వికేంద్రీకరణ జరిగివుంటే ప్రత్యేక తెలంగాణ డిమాండ్ వచ్చేదే కాదు. తెలంగాణలో మాదిరే మళ్లీ విభజన డిమాండ్ రాదని చెప్పగలరా?' అని ధర్మాన ప్రశ్నించారు.
అన్ని ప్రాంతాల అభివృద్ధిని ప్రతిపక్షం ఎందుకు అంగీకరించట్లేదని ఈ సందర్భంగా మంత్రి ధర్మాన ప్రశ్నించారు. అమరావతిలో క్యాపిటల్ వద్దని ప్రభుత్వం చెప్పడం లేదన్నారు. అన్ని ప్రాంతాల అభివృద్ధే తమ విధానమని స్పష్టం చేశారు. అమరావతి శాసన రాజధానిగా ఉంటుందని, ఒక్క అమరావతినే రాజధాని చేయాలనడం వెనక దురుద్దేశం ఉందన్నారు. ఒక ప్రదేశంలో అభివృద్ధి అనే విధానాన్ని ప్రపంచమే అంగీకరించట్లేదని వ్యాఖ్యానించారు.
'29 గ్రామాల ప్రజలు చంద్రబాబు మాయలో పడకూడదు. హైదరాబాద్‌లో జరిగిన అన్యాయం మళ్లీ జరగొద్దు. 4-5 లక్షల కోట్లతో అమరావతిలో రాజధానిని అభివృద్ధి చేయడం సాధ్యమా అవుతుందా? ఉత్తరాంధ్ర, రాయలసీమ ప్రాంతాలు అభివృద్ధి చెందకూడదా? ఒక్కచోటే అన్నీ పెట్టి మా పీక కోస్తామంటే ఉత్తరాంధ్ర, రాయలసీమ ప్రజలకు ఏం చెబుతారు? మా ప్రజలు ఎప్పటీకీ కూలీలుగానే ఉండాలా? మీరు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తుంటే.. మేం చప్పట్లు కొట్టాలా.' అని ధర్మాన ప్రశ్నించారు.