YCP vs TDP : అమరావతి రైతుల పాదయాత్రపై ఉత్తరాంధ్ర మంత్రుల ఆగ్రహం…
అమరావతిని ఏకైక రాజధానిగా చేయలంటూ అమరావతి రైతులు తలపెట్టిన అమరావతి నుంచి అరసవిల్లి పాదయాత్రపై ఉత్తరాంధ్ర మంత్రులు మండిపడ్డారు. ఏపీ మంత్రులు బొత్స, ధర్మాన, బూడి ముత్యాల నాయుడు, రాజన్నదొర, సీదిరి అప్పలరాజు, గుడివాడ అమర్నాథ్‌లు అమరావతి రైతుల యాత్రను తీవ్రంగా వ్యతిరేకించారు ఉత్తరాంధ్రపై దండయాత్ర చేస్తే ప్రజలు ఊరుకోరని హెచ్చరించారు.
రాజధాని వికేంద్రీకరణను వ్యతిరేకిస్తూ ఉత్తరాంధ్రపై చంద్రబాబు తలపెట్టిన దండయాత్రను ఉత్తరాంధ్ర ప్రజలు ఊరుకోరని ఆ ప్రాంత మంత్రులలు హెచ్చరించారు. ఉద్రిక్తతలను రెచ్చగొట్టడానికి యాత్ర చేపట్టారని, ప్రజలు తిరగబడితే జరిగే పరిణామాలకు బాధ్యత వహించాల్సి ఉంటుందని వార్నింగ్ ఇఛ్చారు. ప్రజలు తిరగబడితే.. రేపు జరగబోయే పరిణామాలకు బాబుదే బాధ్యత వహించాలంటున్నారు. అమరావతితో పాటు విశాఖను రాజధాని చేయాలని కోరుతున్నామని, విశాఖను ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ చేయాలన్నదే తమ విధానమన్నారు.
అమరావతి రాజధానికి సంబంధించి చంద్రబాబు అండ్ కో.. కు ఎందుకంత తాపత్రయం, ఆరాటం అంటే... ఆ ప్రాంతంలో రాజధాని నిర్మాణం పేరుతో ఆయన చేసిన రియల్ ఎస్టేట్ వ్యాపారమే అని రాష్ట్ర ప్రజలకు బాగా తెలుసని, అమరావతిపై బాబుకు ప్రేమ లేదు. అక్కడ ఆయన చేసిన రియల్ ఎస్టేట్ వ్యాపారంపైనే మమకారం అన్నారు.
స్వాతంత్య్రం వచ్చిన 75 ఏళ్ల తర్వాత ఉత్తరాంధ్ర ప్రాంతానికి మంచి జరుగుతుంటే, ఈ ప్రాంతానికి ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి గుర్తింపు తీసుకువస్తున్న తరుణంలో, తమ ప్రాంతానికి అన్యాయం చేసే విధంగా మాట్లాడుతున్న వారిని మీరు ఊరుకుంటారా..? అని మంత్రులు నిలదీశారు. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలను సమానంగా, సమ భావంతో చూడాల్సిన రాజకీయ పార్టీలు అమరావతికే లబ్ధి జరగాలనే విధంగా మాట్లాడటం భావ్యం కాదని, అభివృద్ధి అనేది ఒక ప్రాంతానికి, కొందరికి, కొన్ని వర్గాలకు మాత్రమే పరిమితం కాకూడదని డిమాండ్ చేశారు.
పాదయాత్రతో అమరావతిలో 29 గ్రామాలకు తప్ప, రాజధానికి, రాష్ట్రానికి ఎలాంటి సంబంధం లేదు.. అని చేస్తున్నయాత్ర అని మంత్రులు ఎద్దేవా చేశారు. అమరావతి రాజధానికి వ్యతిరేకం కాదని అమరావతి ఒక్కటే రాజధానిగా ఉండటానికి వ్యతిరేకం అని మంత్రలు స్పష్టం చేశారు. అమరావతితోపాటు రాయలసీమలోని కర్నూలు న్యాయ రాజధానిగా, ఉత్తరాంధ్రలోని విశాఖ ఎగ్జిక్యూటివ్ రాజధానిగా ఉండాలని మేము కోరుకుంటున్నాం అని ప్రకటించారు. పాదయాత్రల ద్వారా మీ ప్రాంతానికి చెందిన ప్రజలను ప్రేరేపించి, రెచ్చగొట్టి, మా ప్రాంత అభివృద్ధిని అడ్డుకోవాలని చూస్తే దానికి మా ప్రాంత ప్రజలు సహించరు, అంగీకరించరని ప్రకటించారు.
రూ1.10 లక్షల కోట్లు అమరావతిపై ఖర్చు పెట్టడం సాధ్యమా..?
అమరావతి రాజధానికి, 50 వేల ఎకరాల్లో రూ.లక్షా 10వేల కోట్లు ఖర్చు పెట్టాలని గతంలో చంద్రబాబు డీపీఆర్ ఇచ్చారు. దీన్నిబట్టి చూస్తే రాష్ట్రంలో ఆ 29 గ్రామాల అభివృద్ధి తప్ప, మిగతా ప్రాంతాల అభివృద్ధి అవసరం లేదా? అన్నది చంద్రబాబే చెప్పాలని మంత్రులు డిమాండ్ చేశారు.
రాష్ట్రంలో ఉన్న అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందాలి, అందరికీ మేలు జరగాలి, అన్ని ప్రాంతాలకూ గుర్తింపు రావాలన్నదే మా ప్రభుత్వ విధానం. అలాగే అన్ని ప్రాంతాలతో పాటు అమరావతిలోని ఆ 29 గ్రామాలు కూడా అభివృద్ధి చెందాలన్నదే ప్రభుత్వ అభిమతం అన్నారు. అమరావతి రాజధానిగా ఉండదని, ఉండకూడదని రాష్ట్ర ప్రభుత్వం గానీ, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ గానీ ఏనాడూ చెప్పలేదని, అమరావతి కూడా ఒక రాజధానిగా ఉంటుందనే చెప్పామన్నారు.
విశాఖను ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ గా చేసి తీరుతాం
దేశంలోని టాప్ టెన్ నగరాల్లో విశాఖపట్నం ఒకటని. ఉత్తరాంధ్రకు ముఖద్వారంగా ఉన్న విశాఖపట్నాన్ని ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్‌గా ఉండాలని ఈ ప్రాంత ప్రజలంతా ముక్తకంఠంతో కోరుకుంటున్నారు, స్వాగతిస్తున్నారని మంత్రులు స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రజలకు ఆమోదయోగ్యమైన మూడు రాజధానులపై కొత్త బిల్లును తీసుకువస్తాం. దీన్ని అడ్డుకునే శక్తి ఎవరికీ లేదని, ఉత్తరాంధ్ర ప్రాంత ప్రజల ఆకాంక్షలు నెరవేరబోతున్నాయనే ఆశతో ఇక్కడి ప్రజలు ఉన్నారని చెప్పారు.