Michaung Cyclone Live news Updates: తీరం దాటిన తీవ్ర తుపాను, ఏపీలో వర్ష బీభత్సం-michaung cycole live news updates 5 december 2023 ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Michaung Cyclone Live News Updates: తీరం దాటిన తీవ్ర తుపాను, ఏపీలో వర్ష బీభత్సం

మిచౌంగ్ తుపాను

Michaung Cyclone Live news Updates: తీరం దాటిన తీవ్ర తుపాను, ఏపీలో వర్ష బీభత్సం

03:09 PM ISTDec 05, 2023 08:26 PM Sarath chandra.B
  • Share on Facebook
03:09 PM IST

  • Michaung Cyclone Live news Updates: మిచాంగ్ తుఫాను ప్రభావంతో 9 జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేశారు. బాపట్ల, ప్రకాశం, పల్నాడు, గుంటూరు, కృష్ణా, ఎన్టీఆర్ ,ప.గో., ఏలూరు, కోనసీమ జిల్లాలకు రెడ్ అలర్ట్ అమల్లో ఉంది. శ్రీకాకుళం నుంచి తిరుపతి వరకు భారీ వర‌్షాలు కురుస్తున్నాయి.

Tue, 05 Dec 202302:56 PM IST

పాలకొల్లులో సుడిగాలులు బీభత్సం

పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లు మండలం తెల్లపూడిలో సుడిగాలి బీభత్సం సృష్టించింది. సానివాడలో సుడిగాలితో కొబ్బరి చెట్లు నేలకూలాయి. సుడిగాలులు దాటికి ఇంటి పైకప్పులు కూలిపోయాయి.

Tue, 05 Dec 202312:11 PM IST

వెంకటగిరిలో నిన్న రాత్రి నుంచీ నిలిచిన విద్యుత్ సరఫరా

మిచౌంగ్ తుపాను ప్రభావంతో కురుస్తోన్న వర్షాలకు తిరుపతి జిల్లా వెంకటగిరిలో నిన్న రాత్రి నుంచి విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. విద్యుత్ లైన్లతో సాంకేతిక లోపంతో విద్యుత్ సరఫరా బంద్ అయినట్లు తెలుస్తోంది.

Tue, 05 Dec 202311:17 AM IST

ఎలా ఉన్నా ధాన్యాన్ని ప్రభుత్వమే కొంటుంది- మంత్రి కారుమూరి నాగేశ్వరరావు

మిచౌంగ్ తుపాను బాధిత రైతులను ప్రభుత్వం ఆదుకుంటుందని, ఎవరూ అధైర్యపడొద్దని మంత్రి కారుమూరి నాగేశ్వరరావు తెలిపారు. మంగళవారం తణుకు నియోజకవర్గంలోని దువ్వ, వరిగేడు గ్రామాల్లో పర్యటించిన మంత్రి కారుమూరి వరి చేలను పరిశీలించారు. రైతులతో మాట్లాడుతూ... ఎలాంటి పరిస్థితిలో ఉన్న ధాన్యాన్ని ప్రభుత్వమే కొంటుందని తెలిపారు. వీలైనంత త్వరగా రైతులు తమ ధాన్యాన్ని అందుబాటులో ఉన్న మిల్లులకు తరలించాలని సూచించారు. ఆఫ్‌లైన్, ఆన్‌లైన్ రెండు విధాలుగానూ ధాన్యాన్ని తరలించే అవకాశం కల్పించామని మంత్రి తెలిపారు. ఏ మిల్లర్లు అయినా రైతులను ఇబ్బంది పెడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.

Tue, 05 Dec 202310:45 AM IST

తీరం దాటిన తీవ్ర తుఫాను మిచౌంగ్

మిచౌంగ్ తుపాను బాపట్ల సమీపంలో తీరం దాటింది. మంగళవారం మధ్యాహ్నం 12:30 నుంచి 2:30 గంటల మధ్య బాపట్ల సమీపంలో తీరం దాటినట్లు వాతావరణ శాఖ తెలిపింది. అయితే తుపాను ప్రభావంతో తీరం వెంబడి గంటకు 90-100 కి.మీ వేగంతో బలమైన ఈదురుగాలులు వీస్తున్నాయి. రాగల రెండు గంటల్లో తీవ్ర తుపాను.... తుపానుగా బలహీనపడనుంది.

Tue, 05 Dec 202310:22 AM IST

ఏలూరు జిల్లాలో కంట్రోల్ రూమ్ లు ఏర్పాటు

నిన్నటి నుంచి ఏలూరు జిల్లా వ్యాప్తంగా ఎడతెరపి లేకుండా వర్షాలు పడుతున్నాయి. వర్షాల నేపథ్యంలో అధికారులు కంట్రోల్ రూమ్‌లు ఏర్పాటుచేశారు.

ఏలూరు జిల్లాలో కంట్రోల్ రూమ్ లు

ఏలూరు జిల్లా కలెక్టరేట్ - 18002331077

నూజివీడు సబ్ కలెక్టర్ కార్యాలయం - 08656-232717

జంగారెడ్డిగూడెం ఆర్డీఓ కార్యాలయం - 9553220254

ఏలూరు ఆర్డీఓ కార్యాలయం- 8500667696

Tue, 05 Dec 202310:12 AM IST

పశ్చిమగోదావరి జిల్లాలో తీవ్రంగా పంటనష్టం

మిచౌంగ్ తుపాను ప్రభావంతో ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు కురిశాయి. ఉండి , భీమవరం, కాళ్ల ప్రాంతాల్లో తుపాను ప్రభావంతో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. కోతలు కోసిన రైతులు కల్లాల్లో ధాన్యం తడిసిపోయాయని ఆవేదన చెందుతున్నారు. ధాన్యం నానిపోయిందని, కోసిన వరి పనలు నీట మునిగాయని కన్నీళ్లు పెట్టుకుంటున్నారు. వరి చేలు నేలకు ఒరిగి నీటి మునిగాయి. కలిదిండి, ఉండి, పెదపాడు, భీమవరం, పాలకొల్లు ప్రాంతాల్లో వరి చేలు నీట మునిగాయి.

Tue, 05 Dec 202309:50 AM IST

మరికాసేపట్లో బాపట్ల తీరం దాటనున్న తుపాను

మిచౌంగ్ తుపాను బాపట్ల తీరాన్ని తాకింది. కాసేపట్లో బాపట్ల తీరాన్ని పూర్తిగా దాటనుంది. తీరం దాటాక తుపాను బలహీనపడనుంది.

Tue, 05 Dec 202309:26 AM IST

రాజమండ్రి నుంచి పలు విమాన సర్వీసులు నిలిపివేత

తుపాను ప్రభావంతో రాజమండ్రి భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో రాజమండ్రి ఎయిర్ పోర్టు నుంచి పలు విమాన సర్వీసులను రద్దు చేశారు. రాజమండ్రి నుంచి వివిధ రాష్ట్రాలను వెళ్లాల్సిన 18 విమానాలను తాత్కాలికంగా నిలిపివేశారు.

Tue, 05 Dec 202309:13 AM IST

ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రి ప్రాంగణంలోకి వర్షపు నీరు

తుపాను ప్రభావంతో ఏలూరు జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రి ఆవరణలోనికి భారీగా వర్షపు నీరు చేసింది. మోటార్లుతో ఏలూరు నగర పాలక సంస్థ సిబ్బంది నీటిని బయటకు తోడుతున్నారు. ఆసుపత్రి ప్రాంగణాన్ని కలెక్టర్ ప్రసన్న వెంకటేష్ పరిశీలించారు.

Tue, 05 Dec 202308:59 AM IST

తిరుపతిలో నీట మునిగిన కాలనీలు

తుపాను ప్రభావంతో తిరుమలలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో తిరుమలలో జలాశయాలు పూర్తిస్థాయికి చేరాయి. కుమారధార, పసుపుధార, కల్యాణి జలాశయాలు పూర్తిస్థాయిలో నిండాయి. తిరు గిరుల నుంచి వస్తున్న వరదతో మల్వాడిగుండం పోటెత్తింది. వరద ఉద్ధృతితో తిరుపతిలోని పలు కాలనీలు నీట మునిగాయి. స్వావెంజర్ కాలనీ, గొల్లవానిగుంట, ఆటోనగర్ కాలనీలు నీట మునిగాయి.

Tue, 05 Dec 202308:39 AM IST

దక్షిణ మధ్య రైల్వే పరిధిలో 305 రైళ్లు రద్దు

నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన మిచౌంగ్ తుపాను సోమవారం తీవ్ర రూపం దాల్చింది. తుపాను ప్రభావంతో ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, తెలంగాణ రాష్ట్రాల్లో వర్షాలు కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే సౌత్ సెంట్రల్ రైల్వే అధికారులు అప్రత్తమయ్యారు. ప్రయాణికుల భద్రత దృష్ట్యా ఇప్పటికే 150 రైళ్లు రద్దు చేశారు. అయితే తాజాగా రైల్వే అధికారులు మరో కీలక ప్రకటన చేశారు.హైదరాబాద్ నుంచి దక్షణాది వైపు వెళ్లే రైళ్లు అన్నీ రద్దు చేస్తున్నట్లు సౌత్ సెంట్రల్ రైల్వే అధికారులు వెల్లడించారు. వాతావరణ పరిస్థితుల దృష్ట్యా మొత్తం 305 రైళ్లు తాత్కాలికంగా రద్దు చేసినట్లు తెలిపారు. రైళ్ల రద్దు ఈ నెల 2 నుంచి 8 వరకు ఉంటుందన్నారు. వాతావరణ పరిస్థితులు మెరుగుపడిన తర్వాత రైళ్లను పునరుద్ధరిస్తామని దక్షిణ మధ్య రైల్వే అధికారులు ప్రకటించారు.

Tue, 05 Dec 202308:29 AM IST

తుపాను సహాయ కార్యక్రమాలపై సీఎం జగన్ సమీక్ష

తుపాను బాధిత ప్రాంతాల్లో సహాయ కార్యక్రమాలపై అధికారులతో సీఎం జగన్ సమీక్షించారు. తుపాను వల్ల దెబ్బతిన్న ప్రాంతాల్లో కరెంటు సరఫరాను యుద్ధ ప్రాతిపదికన పునరుద్ధరించాలని, మనుషులు, పశువులు మరణించినట్టు సమాచారం అందితే 48 గంటల్లోగా పరిహారం అందించాలని సీఎం ఆదేశించారు.

Tue, 05 Dec 202308:25 AM IST

తీరాన్ని తాకిన తుపాను

మిచౌంగ్ తుపాను ఏపీలో అల్లకల్లోలం సృష్టిస్తోంది. తుపాను ప్రభావంతో అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో రాష్ట్రంలోని వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. భారీ వర్షాల ధాటికి వేల ఎకరాల్లో పంటలు నష్టపోయాయి. చేతికి వచ్చిన పంట నీటి పాలవ్వడంతో రైతన్నలు కన్నీరు పెడుతున్నారు. అతి తీవ్ర తుపాను మిచౌంగ్ బాపట్ల తీరాన్ని తాకింది. ల్యాండ్‌ఫాల్ ప్రక్రియ కొనసాగుతోందన్నారు. మరో గంటలో తుపాను పూర్తిగా తీరం దాటనుందన్నారు.

Tue, 05 Dec 202307:43 AM IST

తిరుమలలో పూర్తి స్థాయిలో నిండిన జలాశయాలు

తిరుమలలో పూర్తిస్థాయి నీటిమట్టానికి జలాశయాలు చేరాయి. పూర్తిగా నిండిన కుమారధార, పసుపుధార, కల్యాణి జలాశయాలు. తిరుమల గిరుల నుంచి వస్తున్న వరదతో మాల్వాడిగుండం పోటెత్తింది. మాల్వాడిగుండం జలపాతం ఉద్ధృతితో పలు కాలనీలు నీటమునుగుతున్నాయి. స్కావెంజర్ కాలనీ, గొల్లవానిగుంట, ఆటోనగర్ లో కాలనీలు నీట మునిగాయి. ఇళ్లలోకి నీరు చేరడంతో పునరావాస కేంద్రాలకు తరలిస్తున్నారు.

Tue, 05 Dec 202307:29 AM IST

తీవ్ర తుఫానుగా మిగ్‌జోమ్

పశ్చిమమధ్య బంగాళాఖాతంలో తీవ్రతుఫానుగా మిగ్‌జోమ్ మారింది. ఒంగోలుకు 25 కి.మీ, బాపట్లకు 60 కి.మీ, మచిలీపట్నానికి 130కి.మీ. దూరంలో తుఫాన్ కొనసాగుతోంది. మధ్యాహ్నంలోపు బాపట్ల దగ్గరలో తీవ్రతుఫానుగా తీరం దాటుతుందని అంచనా వేస్తుననారు. తీరం వెంబడి గంటకు 90-110 కి.మీ వేగంతో బలమైన ఈదురుగాలులు వీస్తున్నాయి. ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరిస్తున్నారు.

Tue, 05 Dec 202306:20 AM IST

కృష్ణాజిల్లాలో కల్లోలం

తుఫాను ప్రభావంతో కృష్ణా జిల్లా వ్యాప్తంగాభారీ వర్షం కురుస్తుంది. తీరం వెంబడి గంటకు 55నుంచి -75కిలోమీటర్ల వేగంతో హోరు గాలి వీస్తోంది.కృష్ణాజిల్లా కృత్తివెన్ను మండలం చిన్న గొల్లపాలెంలో మంగళవారం మధ్యాహ్నం తీరం దాటే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది. తుపాన్ విపత్కర పరిస్థితులను ఎదుర్కొనేందుకు జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది. తుపాను సహాయక చర్యలకు ఎన్డీఆర్ఎఫ్ బృందాలు అప్రమత్త మయ్యాయి, . సముద్రంలో అల్లకల్లోల పరిస్థితులు నెలకొన్నాయి. అలల ఉధృతి ఎక్కువగా కనిపిస్తోంది. సముద్రం కొన్ని ప్రాంతాల్లో ముందుకు వచ్చింది . కృష్ణాజిల్లా తీర ప్రాంతంలోపది మీటర్ల ఎత్తున సముద్ర పు అలలు ఎగిసిపడుతున్నాయి. ,దివిసీమలో కోడూరు, నాగాయలంక మండలాల్లో నిఉంటగుణం, రామకృష్ణ పురం, పాలకాయతిప్ప, బసన్నపాలెం ,ఇరాలి, చింతకోళ్ళ ,ఎదురు మెండి, ఎల్లిచెట్లదిబ్బ ,సోర్లగోంది, నాలి ,సంగమేశ్వరం , కృత్తివెన్ను మండలం చినగోల్లపాలెం, మచిలీపట్నం మండలం పెదపట్నం, మంగినపూడి, పోలాటి తిప్ప,గ్రామాల్లో ని తీర ప్రాంత ప్రజలుబిక్కు బిక్కు మంటున్నారు. జిల్లాలో 7 మండలాల్లోని 51 గ్రామాల్లో 57 పునరావాస కేంద్రాల ఏర్పాటు చేశారు.

Tue, 05 Dec 202306:13 AM IST

విమాన సర్వీసుల రద్దు

మిచాంగ్‌ తుఫాను ప్రభావంతో కురుస్తున్న వర్షాలకు తిరుపతి జిల్లా రేణిగుంట విమానాశ్రయంలోని రన్‌వే పైకి సోమవారం వరద నీరు చేరింది. దీంతో హైదరాబాద్‌, విజయవాడ, కలబురగి, బెంగళూరు నుంచి ఇక్కడకు రాకపోకలు సాగించే సర్వీసులు రద్దుచేశారు. మరికొన్ని దారి మళ్లించారు.

విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయంలో సోమవారం పలు సర్వీసులు రద్దయ్యాయి. ఉదయం చెన్నై, బెంగళూరు, హైదరాబాద్‌, మధ్యాహ్నం తిరుపతి, కడప, హైదరాబాద్‌, బెంగళూరు సహా రాత్రికి రావాల్సిన విమానాలను వాతావరణ మార్పుల కారణంగా సర్వీసులను రద్దు చేస్తున్నట్లు ఆయా విమానయాన సంస్థలు ప్రకటించాయి. మంగళవారం ఉదయం హైదరాబాద్‌, బెంగళూరు, దిల్లీ సర్వీసులతో పాటు రాత్రి 8.10 గంటలకు వెళ్లే ఎయిర్‌ ఇండియా సర్వీసులే నడుస్తాయని అధికారులు తెలిపారు.

విశాఖపట్నం అంతర్జాతీయ విమానాశ్రయంలో సోమవారం ఏడు విమానాల రాకపోకలు నిలిపివేసినట్లు విమానయాన సంస్థ, అథారిటీ వర్గాలు తెలిపాయి. విశాఖపట్నం నుంచి చెన్నై, హైదరాబాద్‌, గోవా, బెంగళూరు, దిలీ,్ల తిరుపతి, విజయవాడ విమానాల రాకపోకలను తాత్కాలికంగా రద్దుచేశారు. మంగళవారం కూడా 19 విమాన సర్వీసులను రద్దు చేసినట్లు అధికారులు చెప్పారు.

Tue, 05 Dec 202306:06 AM IST

ప్రకాశంలో పలు ప్రాంతాల్లో విద్యుత్ కోతలు

తుపాను కారణంగా ప్రకాశం జిల్లావ్యాప్తంగా వర్షాలు కురుస్తున్నాయి. తీరప్రాంత మండలాల్లో ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. కొత్తపట్నం, సింగరాయకొండ మండలాల్లో ఎడతెరిపిలేని వర్షం కురుస్తోంది. టంగుటూరు, నాగులుప్పల పాడు మండలాల్లో వర్షం కురుస్తోంది. తుపాను కారణంగా సముద్రం అల్లకల్లోలంగా ఉంది. కొత్తపట్నం ప్రాంతంలో కెరటాలు 20 మీటర్లు ముందుకొచ్చాయి. మార్కాపురం, ఎర్రగొండపాలెం మండలాల్లో రాత్రి నుంచి వర్షం - పొదిలిలో ఈదురుగాలులతో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది.

Tue, 05 Dec 202305:58 AM IST

నెల్లూరులో ఉధృతంగా ప్రవహిస్తున్న వాగులు

వరికుంటపాడు మండలం తుఫాను ప్రభావంతో కురుస్తున్న వర్షాలకు కనియంపాడు - రామదేవులపాడు మధ్యలో పిల్లాపేరు వాగు ఉధృతంగా ప్రవహిస్తుండటంతో రాక పోకలకు అంతరాయం కలిగింది. సీతారాంపురం మండలం శ్రీ గుటక సిద్దేశ్వర ఆలయం వద్ద వాగు పొంగి ప్రవహిస్తోంది. ఉదయగిరి మండలం అన్నంపల్లి వద్ద నడుము వాగు పొంగిపొర్లుతోంది. దీంతో రాకపోకలకు అంతరాయం కలిగింది. దుత్తలూరు మండలం బ్రహ్మేశ్వరం వద్ద కల్వర్టు తెగిపోవడంతో రాకపోకలకు అంతరాయం కలిగింది.

Tue, 05 Dec 202305:55 AM IST

శ్రీకాళహస్తిలో కూలిన భారీ వృక్షం

శ్రీకాళహస్తి పట్టణంలో బి.పి అగ్రహారంలో మునీశ్వర ఆలయంలో భారీ వృక్షం కుప్పకూలింది. 600 ఏళ్లనాటి పురాతన భారీ వృక్షం కుప్పకూలడంతో పలు ఇళ్లు ధ్వంసం అయ్యాయి. సంఘటన ప్రాంతానికి చేరుకున్న ఎమ్మెల్యే బియ్యపు మధు సూధన్ రెడ్డి, బాధితులను పరామర్శించారు.

Tue, 05 Dec 202305:54 AM IST

ప్రకాశం జిల్లాలో భారీగా వర్షాలు..

రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు ప్రకాశం జిల్లాలో పలుచోట్ల వాగులు వంకలు పొంగిపొర్లుతున్నాయి. మిచాంగ్ తుఫాను ఇవాళ మధ్యాహ్నం తర్వాత తీరం దాటుతున్న నేపథ్యంలో అధికార యంత్రాంగం మరింత అప్రమత్తమైంది. జిల్లా కలెక్టర్ దినేష్ కుమార్ నేతృత్వంలో జిల్లా అధికార యంత్రాంగం విపత్తు నిర్వహణలో నిమగ్నమైంది. ప్రధానంగా తుఫాను ప్రభావం ఉన్న ఐదు తీర ప్రాంతం మండలాలపై అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టారు. ఇప్పటికే సుమారు 500 మందిని పునరావాస కేంద్రాలకు తరలించారు..విపత్తు నిర్వహణ,పునరావాస కేంద్రాలలో ఉన్న వారికి ఆహారం కోసం ఐదు మండలాలలకు ఒక్కో మండలానికి 18 లక్షల చొప్పున కలెక్టర్ నిధులు కేటాయించారు.. జిల్లాలో తుఫాన్ ఎఫెక్ట్ తో పొగాకు, మినుము, మిర్చి పంటలు దెబ్బతిన్నాయి.. చెన్నైలో తుఫాను ప్రభావం భారీగా ఉండడంతో జిల్లా నుండి చెన్నై వెళ్లే పలు బస్ సర్వీసులను ఆర్టీసీ రద్దు చేసింది.

Tue, 05 Dec 202305:39 AM IST

దుర్గగుడి ఘాట్ మూసివేత

మిచౌంగ్ తుఫాన్ ఎఫెక్ట్ తో విజయవాడలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షం కారణంగా దుర్గగుడి ఘాట్ రోడ్డు మూసివేశారు. భక్తుల భద్రతా కారణాల దృష్ట్యా ఘాట్ రోడ్డు ద్వారా వాహనాల రాకపోకలు నిలిపివేశారు. వర్షాలు తగ్గేవరకూ ఘాట్ రోడ్డు మూసి ఉంచాలని నిర్ణయించారు. అమ్మవారి దర్శనానికి వచ్చే భక్తులు కనకదుర్గ నగర్ మార్గం ద్వారా రావాలని సూచించారు.

Tue, 05 Dec 202305:38 AM IST

తిరుమలలో భారీ వర్షాలు

పాంచజన్యం వద్ద మిచాంగ్ తుపాను ప్రభావం భారీగా చూపుతుంది. రెండు రోజుకుగా ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తుంది. ఉదయం నుండి వేగంగా ఈదురుగాలులు కూడిన వర్షం కురుస్తుంది. దీంతో అనేక ప్రాంతాలలో వృక్షాలు నేలకూలాయి. ఘాట్ రోడ్డు వసతి గృహాల వద్ద బారీ వృక్షాలు కూలిపోవడంతో భక్తులు వసతి గృహాలకే పరిమితం అయ్యారు. పాంచజన్యం అతిధి గృహం వద్ద మూడు బారీవృక్షాలు వాహనాలపై పడ్డాయి. దీంతో నాలుగు వాహనాలు ద్వంసం అయింది. సంఘటన సమయంలో వాహనాలలో భక్తులు లేకపోవడంతో తప్పిన ప్రమాదం. మరో రెండు రోజులు వర్ష ప్రభావం ఉండటంతో భక్తులు అప్రమత్తం గా ఉండాలని టిటిడి కోరుతుంది.

Tue, 05 Dec 202305:37 AM IST

జాతీయ రహదారిపై వరద ప్రవాహం

సూళ్లూరుపేట మండలం గోకుల్ కృష్ణ ఇంజనీరింగ్ కళాశాల వద్ద జాతీయ రహదారిపై 4 అడుగుల మేర వరదనీరు ప్రవహిస్తోంది. దీంతో తమినాడు,ఆంధ్రప్రదేశ్ కు నిలిచిపోయిన రాకపోకలు నిలిచిపోయాయి. ప్రజలు ప్రత్యామ్నాయ మార్గం చూసుకోవాలి లేదంటే ప్రయాణాన్ని వాయిదా వేసుకోవాలని జిల్లా ఎస్పీ పరమేశ్వర రెడ్డి సూచించారు. నదికి ఇరువైపులా జాతీయ రహదారిని బారికెడ్లతో మూసి వేశారు. నెల్లూరు -- చెన్నై నగరాల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి.

Tue, 05 Dec 202305:36 AM IST

అనకాపల్లిలో భారీ వర్షాలు

తుఫాను ప్రభావంతో అనకాపల్లి జిల్లా వ్యాప్తంగా పలు మండలల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. ప్రజలు కార్తిక మాసం సందర్భంగా సముద్రతీరం, వాగులు, నదులు వద్దకు స్నానాలకు వెళ్లినట్లయితే ప్రమాదాలు సంభవించవచ్చు అని జిల్లా ఎస్పీ హెచ్చరించారు.

ఈ సమయంలో ప్రజలు అత్యవసరమైతే తప్ప ఇంటి నుంచి బయటకు రావద్దని విజ్ఞప్తి చేశారు.

అత్యవసర పరిస్థితులలో తక్షణ సహాయం కొరకు డయల్ 100, 112 (లేదా) పోలీస్ కంట్రోల్ రూమ్ నెంబర్ 93469 12724 కు పోలీసు అధికారులకు సమాచారమివ్వాలని జిల్లా ఎస్పీ గారు ప్రజలకు సూచించారు.

Tue, 05 Dec 202305:35 AM IST

వ్యవసాయ శాఖ హెచ్చరిక

ఉమ్మడి నెల్లూరు, గుంటూరు, ప్రకాశం, కృష్ణా, పశ్చిమగోదావరి జిల్లాల పరిధిలోని రైతుల వ్యవసాయ మార్కెటింగ్ శాఖ సూచనలు చేసింది.

మిచౌంగ్ తుఫాన్ కారణంగా భారీ వర్షాలను దృష్టిలో పెట్టుకుని కోతకోసిన ధాన్యం నిల్వచేసుకునేందుకు సదుపాయం కల్పించారు.

ధాన్యం నిల్వచేసుకునే సౌకర్యం లేని వారు ఆయా ప్రాంతాల్లోని మార్కెట్ యార్డు గోదాముల్లో భద్రపరచుకోవచ్చని సూచించారు.

విజయవాడలోని వ్యవసాయ మార్కెటింగ్ శాఖ రీజనల్ జాయింట్ డైరెక్టర్ కార్యాలయంలో టోల్ ఫ్రీ నెంబర్ ఏర్పాటు చేశారు.

టోల్ ఫ్రీ నెంబర్ - 73311 54812 ( ఎ. సుకుమార్ )

Tue, 05 Dec 202305:34 AM IST

రేపు రెండు ప్రాంతాల్లో బస్సుయాత్ర రద్దు

చోడవరం, నందిగామ, రాయదుర్గం నియోజకవర్గాలలో జరగాల్సిన సామాజిక సాధికార యాత్ర రద్దు చేశారు. భారీ వర్షాల కారణంగా రెండు చోట్ల వాయిదా వేశారు. ఎన్టీఆర్ జిల్లా నందిగామ, అనకాపల్లి జిల్లా చోడవరంలో జరగాల్సిన యాత్ర వాయిదా పడింది. అనంతపురం జిల్లా రాయదుర్గంలో యథాతథంగా జరగనుంది. వర్షాలు తగ్గిన అనంతరం నందిగామ, చోడవరంలో నిర్వహించే అవకాశం

Tue, 05 Dec 202305:33 AM IST

రైల్వే టోల్‌ఫ్రీ నంబర్లు ఇవే

తీవ్రతుఫాన్ గా మారిన మిచౌంగ్ తుఫాన్‌తో దక్షిణమధ్య రైల్వే అప్రమత్తమైంది.

దక్షిమధ్య రైల్వే పరిధిలోని స్టేషన్లలో హెల్ప్ లైన్లు ఏర్పాటు చేశారు.

అనకాపల్లి : 08924 - 221698

తుని : 08854 – 252172

సామర్లకోట : 08842 - 327010

రాజమండ్రి : 08832 – 420541

తాడేపల్లిగూడెం : 08818 – 226162

ఏలూరు : 08812 – 232267

భీమవరం టౌన్ : 08816 – 230098; 7815909402

విజయవాడ : 08862 – 571244

తెనాలి : 08644 – 227600

బాపట్ల : 08643 – 222178

ఒంగోలు : 08592 – 280306

నెల్లూరు : 08612 – 345863

గూడూరు : 08624 – 250795; 7815909300

కాకినాడ టౌన్ : 08842 – 374227

గుంటూరు : 9701379072

రేపల్లె : 7093998699

కర్నూల్ సిటీ : 8518220110

తిరుపతి : 7815915571

రేణిగుంట : 9493548008

కమర్షియల్ కంట్రోల్ రూమ్స్

సికింద్రాబాద్ : 040 – 27786666, 040 – 27801112

హైదరాబాద్ : 9676904334

కాచిగూడ : 040 – 27784453

ఖాజీపేట్ : 0870 – 2576430

ఖమ్మం : 7815955306

Tue, 05 Dec 202305:20 AM IST

కలెక్టరేట్లలో కంట్రోల్ రూమ్‌ల ఏర్పాటు

తుఫాన్ నేపథ్యంలో ఏపీలో కంట్రోల్ రూమ్‍లు ఏర్పాటు చేశారు. కృష్ణా కలెక్టరేట్ నెంబర్లు : 08672-252572, 252000 - విజయవాడ కంట్రోల్ రూమ్ నెంబర్లు: 0866-2422515, టోల్ ఫ్రీ : 18004252000, వాట్సాప్ : 8181960909 - ప్రకాశం కలెక్టరేట్ టోల్ ఫ్రీ నెంబర్ 1077, కాకినాడ కలెక్టరేట్ టోల్‍ఫ్రీ నెంబర్ 1800-4253077 - కాకినాడ ఆర్డీవో కార్యాలయం నెంబర్ 9701579666 - పెద్దాపురం ఆర్డీవో కార్యాలయం నెంబర్ 9949393805

Tue, 05 Dec 202304:20 AM IST

తీవ్ర తుఫాన్‍తో అప్రమత్తమైన ఏపీ ప్రభుత్వం

తుఫాను నేపథ్యంలో ఏపీలోని ఎనిమిది జిల్లాల్లో 181 పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేశారు. రాష్ట్రవ్యాప్తంగా 308 పునరావాస శిబిరాలు ఏర్పాటు చేశారు. సహాయ చర్యల కోసం ఐదు NDRF, ఆరు SDRF బృందాలు సిద్ధంగా ఉంచారు. నెల్లూరు, బాపట్ల, కృష్ణా, తిరుపతి, ప్రకాశంలో సహాయక బృందాలను ప్రభుత్వం మొహరించారు. ఖరీఫ్ పంటల సంరక్షణకు ఏపీ ప్రభుత్వ ప్రత్యేక చర్యలు చేపట్టింది. ఇప్పటికే లక్ష టన్నుల బియ్యం సేకరించారు. అత్యవసర ఖర్చులకు జిల్లాకు రూ.2 కోట్లు కేటాయించారు. నష్టపోయిన కుటుంబానికి రూ.2 వేల ఆర్థిక సాయం అందించనున్నారు. తుఫాన్ ప్రభావిత ఎనిమిది జిల్లాలకు సీనియర్ IASల నియామించారు. భోజనం, వసతి, వైద్యంపై దృష్టి పెట్టాలని జగన్ ఆదేశించారు. శిబిరాల నుంచి ఇంటికి వెళ్లే వారికి 25 కిలోల బియ్యంతో పాటు వంట సామాగ్రి ఇవ్వాలని ఆదేశించారు. ఇల్లు కూలిన వారికి తక్షణ సాయంగా రూ.10 వేలు అందించనున్నారు. 192 పునరావాస కేంద్రాలకు 7,361 మంది తరలించారు.

Tue, 05 Dec 202304:08 AM IST

మధ్యాహ్నానికి తీరం దాటనున్న తుఫాను

పశ్చిమమధ్య బంగాళాఖాతంలో తీవ్రతుఫానుగా మిచౌంగ్ తీరం వైపు కదులుతోంది. ప్రస్తుతానికి నెల్లూరుకు 80 కి.మీ, బాపట్లకు 80 కి.మీ, మచిలీపట్నానికి 140కి.మీ. దూరంలో తుఫాన్ కేంద్రీకృతమై ఉంది. మధ్యాహ్నంలోపు బాపట్ల దగ్గరలో తీవ్రతుఫానుగా తీరం దాటుతుందని అంచనా వేస్తున్నారు. తీరం దాటే సమయంలో గంటకు 90-110 కి.మీ వేగంతో బలమైన ఈదురుగాలులు వీయనున్నాయి.

Tue, 05 Dec 202304:06 AM IST

ధాన్యం తడవకుండా చర్యలు

కల్లాల్లో ధాన్యం తడిసిపోకుండా ప్రత్యేక చర్యలు చేపట్టాలని ప్రభుత్వం ఆదేశించింది. తేమలాంటి సాంకేతిక అంశాలను పక్కనపెట్టి రైతుల వద్ద ధాన్యాన్ని సేకరించాలని కలెక్టర్లకు సీఎం వైఎస్ జగన్‌ ఆదేశించారు. ధాన్యంలో తేమ శాతాన్ని చూడకుండా రైతుల నుంచి ధాన్యం కొనుగోలు చేయాలని అధికారులను ఆదేశించారు. ధాన్యంలో తేమ శాతం పట్టించుకోవద్దని, ధాన్యం సేకరించి వెంటనే మిల్లుకు తరలించాలని ఆదేశించారు.

Tue, 05 Dec 202304:03 AM IST

ఏపీ ప్రభుత్వం అప్రమత్తం

మిచాంగ్ తుపాను ప్రభావంపై ఏపీ ప్రభుత్వం స్పందించింది. అప్రమత్తంగా వ్యవహరించాలని విశాఖ నుంచి నెల్లూరు జిల్లా వరకూ రెవెన్యూ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. బాపట్ల, కృష్ణా, ఏలూరు, భీమవరం, కాకినాడ జిల్లాల్లో పునరావాసం కోసం జిల్లాకు రూ.కోటి లు చొప్పున విడుదల చేసింది. ఆయా జిల్లాల్లో కంట్రోల్ రూమ్లు ఏర్పాటు చేయటమే కాదు, బాధితులను తుపాను పునరవాస కేంద్రాలకు తరలించే ఏర్సాట్లు చేసుకోవాలని ఆదేశించారు. సహాయక శిబిరాల్లో సౌకర్యాలు ఉండేలా జాగ్రత్తలు తీసుకోండిఆహారం,తాగునీరు, మందుల సరఫరా, పారిశుద్ధ్యంపై ప్రత్యేక దృష్టిపెట్టండితుపానుతో దెబ్బతినే వ్యవస్థలను యుద్ధప్రాతిపదికనపునరుద్ధరించాలని ఆదేశించారు.

Tue, 05 Dec 202304:02 AM IST

తెలంగాణలో తుఫాన్ ప్రభావం

మిచౌంగ్‌ తుఫాను అర్ధరాత్రి దాటిన తర్వాత నెల్లూరు దాటి, కావలి దగ్గర ఉంది. ప్రస్తుతం ఒంగోలులో, తరువాత ఖమ్మం, సూర్యాపేటలోకి మారుతుంది. దీని ప్రభావంతో ఖమ్మం, సూర్యాపేట, మహబూబాబాద్, భద్రాద్రి, వరంగల్, యాదాద్రి, జనగాంలలో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉంది. మిగిలిన తెలంగాణాలో ఓ మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది.

Tue, 05 Dec 202303:25 AM IST

చెన్నై జలదిగ్బంధం..

భారీ వర్షాలతో చెన్నై జలదిగ్బంధమైంది. వీధులు నదుల్లా మారిపోయాయి. - పదిమందికిపైగా దుర్మరణం పాలయ్యారు. వందలాది గృహాలు నీటమునిగాయి. కూలిన వృక్షాలతో విద్యుత్ వైర్లు తెగిపోయాయి. రవాణా, కమ్యూనికేషన్ వ్యవస్థలు స్తంభించిపోయాయి. తుఫాన్ ప్రభావంపై సీఎం స్టాలిన్‍కు అమిత్‍షా ఫోన్ చేశారు. అండగా ఉంటామని హామీ ఇచ్చారు.

Tue, 05 Dec 202302:45 AM IST

ఏపీలో కంట్రోల్ రూమ్‍లు ఏర్పాటు

తుఫాన్ నేపథ్యంలో ఏపీలో కంట్రోల్ రూమ్‍లు ఏర్పాటు చేశారు. కృష్ణా కలెక్టరేట్ నెంబర్లు : 08672-252572, 252000 - విజయవాడ కంట్రోల్ రూమ్ నెంబర్లు: 0866-2422515, టోల్ ఫ్రీ : 18004252000, వాట్సాప్ : 8181960909 - ప్రకాశం కలెక్టరేట్ టోల్ ఫ్రీ నెంబర్ 1077, కాకినాడ కలెక్టరేట్ టోల్‍ఫ్రీ నెంబర్ 1800-4253077 - కాకినాడ ఆర్డీవో కార్యాలయం నెంబర్ 9701579666 - పెద్దాపురం ఆర్డీవో కార్యాలయం నెంబర్ 9949393805

Tue, 05 Dec 202302:34 AM IST

బాపట్లలో భయం భయం

బాపట్ల జిల్లా బాపట్ల , రేపల్లె,చీరాలనిజాంపట్నం ప్రాంతాల్లో ఎస్టీఅర్ఎఫ్ బృందాలు అప్రమత్తమయ్యాయి.18 మంది ఎన్టీఆర్ఎఫ్ బృందాలు తీరప్రాంతానికి చేరుకున్నాయి. మరో 18 బృందాలు బాపట్లకు చేరుకుంటాయి. తీర ప్రాంతంలో ప్రజలను అప్రమత్తం చేస్తూ తుపాన్ పునరావాస కేంద్రాలకు రెవెన్యూ,పోలీస్ శాఖ అధికారులు తరలిస్తున్నారు. ప్రజలకు భోజన సదుపాయం కల్పిస్తున్నారు.బాపట్ల జిల్లాలోని బాపట్ల సూర్యలంక సముద్రతీరం తుఫాన్ షెల్టర్లలో తీర ప్రాంత ప్రజలకు వసతి కల్పించారు.తుపాన్ ప్రభావంతో సముద్రంలో వేట నిషేధించి నల్లమడ కాలవబోట్లు నిలిపివేశారు.

Tue, 05 Dec 202302:27 AM IST

తమిళనాడు గజగజ

మైచాంగ్ తుఫానుతో తమిళనాడు గజగజ వణుకుతోంది. వారం రోజుల కిందటే భారీ వర్షాలతో తల్లడిల్లింది. ప్రస్తుతం ఏపీలో కేంద్రీకృతమైన తుపాను ప్రభావాన్ని అంచనా వేసిన తమిళనాడు ప్రభుత్వం .. తమ పరిధిలో ప్రభుత్వ పాఠశాలలకు సోమవారం సెలవు ప్రకటించింది. పుదుచ్చేరీ కరైకల్ కలై సెల్వీ, కాంచీపురం, చెన్నై, చెంగల్పట్, తిరువల్లూరు ప్రాంతాల్లో పాఠశాలలను మూసివేశారు.

Tue, 05 Dec 202302:14 AM IST

ప్రకాశం జిల్లాలో భారీ వర్షాలు

తుపాను కారణంగా పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. నెల్లూరు, బాపట్ల, ప్రకాశం జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. తుపాను కారణంగా ఉద్ధృతంగా వీస్తున్న ఈదురుగాలులతో జనం వణికి పోతున్నారు. గంటకు 90 నుంచి 110 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తున్నాయి. ఉద్ధృతమైన గాలుల వల్ల పలుచోట్ల చెట్ల కొమ్మలు విరిగిపడ్డాయి. బాపట్ల జిల్లాలో పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. చినగంజాం మండలంలో 15 గంటలుగా విద్యుత్ సరఫరా నిలిచిపోయింది.

Tue, 05 Dec 202302:12 AM IST

తూర్పు గోదావరిలో భారీ వర్షాలు

తుపాను కారణంగా ఉమ్మడి తూ.గో జిల్లా వ్యాప్తంగా వర్షాలు కురుస్తున్నాయి. రాజమహేంద్రవరం, రాజానగరం, అనపర్తి, మండపేట, రామచంద్రపురం, రాజోలు, పి.గన్నవరం, కొత్తపేట, అమలాపురం మండలాల్లో భారీ వర్షాలు పడుతున్నాయి. ఈదురు గాలులతో పలు మండలాల్లో వరి పంట నేలకు ఒరిగింది. ఆరబెట్టిన ధాన్యం తడిసి ముద్దయింది.కాకినాడ, పిఠాపురం, పెద్దాపురం మండలాల్లో విస్తారంగా వర్షాలు పడుతున్నాయి. - జగ్గంపేట, ప్రత్తిపాడు, తుని మండలాల్లో ఈదురుగాలులతో వర్షం కురుస్తోంది.

Tue, 05 Dec 202302:11 AM IST

విశాఖ నుంచి ఫ్లైట్స్ క్యాన్సిల్

తుఫాను కారణంగా విశాఖపట్నంలో విమాన సర్వీసులను రద్దు చేశారు. విజయవాడ నుంచి మంగళవారం ఉదయం 9.00 గంటలకు విశాఖకు చేర్చాల్సిన ఇండిగో సర్వీస్ ను రద్దు చేశారు. విశాఖ నుంచి తిరుపతి వెళ్లాల్సిన సర్వీసును, చెన్నై నుంచి విశాఖకు చేరాల్సిన సర్వీసును, మధ్యాహ్నం హైదరాబాద్ నుంచి విశాఖ రావలసిన విమానం సర్వీసును రద్దు చేశారు.

Tue, 05 Dec 202302:10 AM IST

తిరుపతిలో భారీ వర్షం .. ఓ చిన్నారి మృతి

పెను తుపాన్‌గా ఆవిర్భవించిన మిచాంగ్ ప్రభావంతో తిరుపతి జిల్లాలో భారీ వర్షం కురుస్తోంది. పుణ్యక్షేత్రం తిరుపతిలో భక్తులు చలితో వణికిపోతున్నారు. ఏర్పాడు మండలం చిందేపల్లి ఎస్టీ కాలనీకి చెందిన నాలుగేళ్ల బాలుడు యశ్వంత్ మరణించినట్లు తెలుస్తోంది. ఇక నెల్లూరు, అన్నమయ్య రాయచోటి, చిత్తూరు జిల్లాల్లో అతి భారీ వర్షాలు పడుతున్నాయి. గత శనివారం నుంచీ ఏకధాటిగా ఈ చిత్తూరు జిల్లాల్లో వర్షాలు కురుస్తున్నాయి.

Tue, 05 Dec 202302:09 AM IST

కాకినాడలో ఆరెంజ్ అలర్ట్

కాకినాడ జిల్లాలో ఈదురుగాలులతో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఉప్పాడ వద్ధ సముద్రం అల్లకల్లోలంగా మారింది. కెరటాలు బీచ్ రోడ్డును తాకుతున్నాయి. సముద్రం లోపల అల్లకల్లోల పరిస్థితితో కాకినాడ పోర్టులో బియ్యం ఎగుమతులను అధికారులు నిలిపివేశారు. దాదాపు పదికి పైగా విదేశీ నౌకలు నిలిచిపోయాయి. మత్స్యకారులు ఎవరూ చేపల వేటకు వెళ్లరాదని, వేటకెళ్లిన వారిని తక్షణమే వెనక్కి రప్పించే ఏర్పాట్లు చేయాలని కాకినాడ ఆర్డీవో ఇట్ల కిషోర్‌ అధికారులను ఆదేశించారు

Tue, 05 Dec 202302:09 AM IST

ఏపీలో 9జిల్లాలకు రెడ్ అలర్ట్

తుఫాన్ ప్రభావంతో ఏపీలో 9 జిల్లాలకు ఏపీ ప్రభుత్వం రెడ్ అలర్ట్ విధించింది. బాపట్ల, ప్రకాశం, పల్నాడు, గుంటూరు, కృష్ణా, ఎన్టీఆర్ ,ప.గో., ఏలూరు, కోనసీమ జిల్లాలకు రెడ్ అలర్ట్ విధించారు. ఏపీలో మరో ఐదు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. నెల్లూరు, కడప, తూ.గో., కాకినాడ, అల్లూరి జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. ఏపీలో మరో 8 జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు. తిరుపతి, అన్నమయ్య, నంద్యాల, అనకాపల్లి, మన్యం,విశాఖ, విజయనగరం, శ్రీకాకుళానికి ఎల్లో అలర్ట్ అమల్లో ఉంది.