Sajjala Votes : సజ్జల కుటుంబానికి రెండు చోట్ల ఓట్లు, టీడీపీ ఆరోపణలకు వైసీపీ కౌంటర్
Sajjala Votes : ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డికి రెండు చోట్ల దొంగ ఓట్లు ఉన్నాయని టీడీపీ నేత ధూళిపాళ్ల నరేంద్ర ఆరోపించారు. సామాజిక మాధ్యమం ఎక్స్ లో ఆయన పెట్టిన పోస్టు వైరల్ అవుతుంది. ఈ ఆరోపణలపై సజ్జల కుమారుడు భార్గవ రెడ్డి కౌంటర్ ఇచ్చారు.
Sajjala Votes : ఏపీలో దొంగ ఓట్ల(Fake Votes) వ్యవహారం రోజుకో చోట కలకలం రేపుతుంది. లక్షల సంఖ్యలో దొంగ ఓట్లు ఉన్నాయని స్వయంగా ఎన్నికల సంఘమే ప్రకటించింది. రాజకీయ పార్టీల ఫిర్యాదుతో ఇలాంటి తరహా 5.6 లక్షల ఓట్లు తొలగించామని సీఈవో ప్రకటించారు. ఒకే డోర్ నెంబర్ తో వందల సంఖ్యలో ఓట్లు ఉన్నట్లు క్షేత్ర స్థాయిలో బయటపడుతున్నాయి. రాష్ట్ర ఎన్నికల సంఘం ఇటీవల తుది ఓటర్ జాబితాను(AP Voters List) సైతం విడుదల చేసింది. ఈ జాబితా కూడా తప్పుల తడకలా ఉందని ప్రతిపక్షాలు ఆరోపిస్తు్న్నాయి. తాజాగా దొంగ ఓట్లపై టీడీపీ నేత ధూళిపాళ్ల నరేంద్ర కుమార్(Dhulipalla Narendra) ఎక్స్ లో పెట్టిన పోస్టు వైరల్ అవుతుంది.
పొన్నూరు, మంగళగిరిలో రెండు చోట్ల ఓట్లు
వచ్చే ఎన్నికల్లో లబ్ధి పొందేందుకు వైసీపీ లక్షల సంఖ్యలో దొంగ ఓట్లను చేర్చిందని టీడీపీ ఆరోపిస్తుంది. అయితే టీడీపీ అధికారంలో ఉన్నప్పుడే నకిలీ ఓట్లు చేర్చిందని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. దొంగ ఓట్లపై ఆరోపణలు చేస్తూ టీడీపీ నేత ధూళిపాళ్ల నరేంద్ర కుమార్ ఎక్స్ లో పోస్ట్ పెట్టారు. ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి(Sajjala Ramakrishna Reddy)కి దొంగ ఓట్లు ఉన్నాయని ఆరోపిచారు. క్యాంప్ ఆఫీస్ క్లర్క్, రెడ్ హ్యాండెడ్ గా బుక్ అంటూ ధూళిపాళ్ల నరేంద్ర ట్వీట్ చేశారు. రెండు చోట్ల దొంగ ఓట్లతో సజ్జల అడ్డంగా దొరికిపోయారన్నారు. సజ్జలకు పొన్నూరు, మంగళగిరిలో రెండు చోట్ల ఓట్లు ఉన్నాయన్నారు. పొన్నూరు, మంగళగిరి(Mangalagiri) నియోజకవర్గాల్లో రెండు చోట్ల ఉన్న ఓట్ల వివరాలతో నరేంద్ర ట్వీట్ చేశారు. పొన్నూరు(Ponnuru) బూత్ నెం. 31, నంబూరు నెం.799, 800, 801, 802, మంగళగిరి బూత్ నెం.132, కాజా నెం. 1089, 1090, 1091, 1105...సజ్జలతో పాటు ఆయన సతీమణి, కొడుకు, కోడలికి రెండు చోట్ల ఓట్లు ఉన్నాయని ఆరోపించారు.
స్పందించిన సజ్జల కుమారుడు
టీడీపీ ఆరోపణలపై సజ్జల రామకృష్ణారెడ్డి కుమారుడు భార్గవ రెడ్డి(Sajjala bhargava Reddy) స్పందించారు. ఆయన ఎక్స్ లో స్పందిస్తూ... పొన్నూరు, మంగళగిరి రెండూ పక్క పక్క నియోజకవర్గాలు, తాము ప్రస్తుతం నివాసం ఉంటున్న ఇల్లు రెండు నియోజకవర్గాల బోర్డర్ లో ఉన్న గ్రామాల పరిధిలోకి వస్తుందన్నారు. సాంకేతిక లోపం వల్ల ఓటర్ల జాబితాలో తమ పేర్లు రెండు చోట్ల నమోదైన విషయం మా దృష్టికి వచ్చిన వెంటనే ఒకచోట తొలగింపునకు సంబంధించి చర్యలు తీసుకోమని జనవరి 31న అధికారులను కోరామన్నారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ప్రక్రియ జరుగుతోందన్నారు. అయితే ఈలోపే టీడీపీ దుష్ప్రచారం చేస్తుందన్నారు. టీడీపీలాగా దొంగ ఓట్లు నమోదు చేసుకుని గెలవాలని చూసే అలవాటు మాకు లేదని విమర్శించారు. చంద్రబాబు మాదిరి కుప్పంలో పక్క రాష్ట్రానికి చెందిన 30 వేల మందికి ఓటుహక్కు కల్పించి, ఎమ్మెల్యేగా గెలిచే బాపతు తాము కాదన్నారు.
సంబంధిత కథనం