AP Fake Votes : ఏపీలో 27 లక్షల దొంగ ఓట్లు, ఈసీ సంచలన ప్రకటన
AP Fake Votes : ఏపీలో 27 లక్షల దొంగ ఓట్లు ఉన్నాయని ఈసీ సంచలన ప్రకటన చేసింది. జీరో నెంబర్, బోగస్ ఇంటి నెంబర్లతో 2,51,767 ఓట్లు ఉన్నట్లు కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించింది.
AP Fake Votes : ఏపీలో మరోసారి దొంగ ఓట్ల కలకలం రేగింది. ఒకే ఇంటి నెంబర్ , జీరో ఇంటి నెంబర్ పై పెద్ద సంఖ్యలో ఓట్లు నమోదు అయ్యాయని కేంద్ర ఎన్నికల సంఘం తెలిపింది. వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణరాజు ఏపీలో భారీగా దొంగ ఓట్లు ఉన్నాయని జూన్ లో ఎన్నికల సంఘానికి లేఖ రాశారు. ఈ నేపథ్యంలో ఎన్నికల సంఘం ఎంపీ రఘురామ లేఖకు బదులిచ్చింది. దొంగ ఓట్ల తొలగింపునకు చర్యలు చేపట్టామని ఈసీ తెలిపింది. ఏపీలో 27,13,443 దొంగ ఓట్లు ఉన్నట్లు గుర్తించామని ఎన్నికల సంఘం వెల్లడించింది. జీరో ఇంటి నెంబర్ తో 2,51,767 ఓట్లు ఉన్నాయని, ఒకే డోర్ నెంబరుపై పది అంతకు మించి ఓట్లు ఉన్న ఇండ్లు 1,57,939 అని ఎన్నికల సంఘం తెలిపింది. ఒకే డోర్ నెంబరు కలిగిన ఓట్లు 24,61,676 ఉన్నట్టు గుర్తించినట్లు ఈసీ పేర్కొంది.
దొంగ ఓట్లపై ఫిర్యాదులు
రానున్న ఎన్నికల నేపథ్యంలో భారీ స్థాయిలో దొంగ ఓట్లు నమోదు చేయిస్తున్నారని టీడీపీ నేతలు ఆరోపించారు. అయితే దొంగ ఓట్లు టీడీపీ హయాంలోనే నమోదు చేశారని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. దొంగ ఓట్లు విషయంపై టీడీపీ, వైసీపీ దిల్లీ వెళ్లీ కేంద్ర ఎన్నికల సంఘం అధికారులు పోటాపోటీగా ఫిర్యాదులు చేశారు. బూత్ లెవల్ అధికారులతో ఓటర్ల జాబితాపై పరిశీలన చేపట్టింది ఎన్నికల సంఘం. దీంతో దొంగ ఓట్ల బాగోతం వెలుగుచూసింది. రాష్ట్రంలోని కొన్ని చోట్ల అధికారులపై ఎన్నికల సంఘం అధికారులు చర్యలు తీసుకున్నారు. ఉరవకొండ నియోజకవర్గంలో 6 వేల దొంగ ఓట్లు చేర్పించారని టీడీపీ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. ఈ విషయాన్ని పరిగణనలోకి తీసుకున్న ఎన్నికల సంఘం విచారణ చేపట్టి జిల్లా పరిషత్ సీఈవో భాస్కర్‌రెడ్డిని సస్పెండ్ చేసింది.
ఏపీ ఓటర్ల ముసాయిదా
ఆంధ్రప్రదేశ్‌లో ఓటర్ల సంఖ్యలో 2019తో పోలిస్తే 5 లక్షలు పెరిగారు. 2024 ఎన్నికల నాటికి ఈ సంఖ్య మరింత పెరగొచ్చు. ఏపీ ముసాయిదా ఓటర్ల జాబితాను గత ఏడాది నవంబర్‌లో మీనా ప్రకటించారు. నవంబరు 9వ తేదీ నాటికి రాష్ట్రంలో 3,98,54,093 మంది ఓటర్లు ఉన్నారని ఎన్నికల ప్రధాన అధికారి తెలిపారు. రాష్ట్రంలో 2,01,34,621 మంది మహిళా ఓటర్లు ఉండగా 1,97,15,614 మంది పురుష ఓటర్లు ఉన్నారు. సర్వీసు ఓటర్ల సంఖ్య 68,115గా నమోదైంది. ట్రాన్స్ జెండర్ ఓటర్ల సంఖ్య 3858 మందిగా ఉంది. 18-19 ఏళ్ల వయసున్న ఓటర్ల సంఖ్య 68,115గా ఉంది. రాష్ట్రవ్యాప్తంగా వివిధ కారణాలతో 10,52,326 మంది ఓటర్లను జాబితా నుంచి తొలగించినట్లు ఎన్నికల ప్రధానాధికారి తెలిపారు. చనిపోయిన వారి ఓట్లు 40,345 ఉండగా ఇతర ప్రాంతాలకు వెళ్లిన ఓట్లు 31,158గా ఉంది. అత్యధిక ఓటర్లతో మొదటి స్థానంలో 19,11,699 ఓట్లతో అనంతపురం నియోజకవర్గం ఉండగా, రెండో స్థానంలో 19,12,049 ఓట్లతో కర్నూలు నియోజకవర్గం, మూడో స్థానంలో 18,98,533 ఓట్లతో నెల్లూరు నియోజకవర్గంలో ఓటర్లు నమోదయ్యారు.