Viveka Murder Case :వివేకా హత్య కేసులో మరో మలుపు.. కుమార్తె సునీతా, సీబీఐ ఎస్పీపై ఛార్జిషీట్‌ దాఖలు-local police charge sheet filed against cbi official and vivekananda daughter sunitha in viveka murder case ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Viveka Murder Case :వివేకా హత్య కేసులో మరో మలుపు.. కుమార్తె సునీతా, సీబీఐ ఎస్పీపై ఛార్జిషీట్‌ దాఖలు

Viveka Murder Case :వివేకా హత్య కేసులో మరో మలుపు.. కుమార్తె సునీతా, సీబీఐ ఎస్పీపై ఛార్జిషీట్‌ దాఖలు

Maheshwaram Mahendra Chary HT Telugu
Dec 30, 2023 07:42 AM IST

Viveka Murder Case Updates: మాజీ మంత్రి వైఎస్‌ వివేకాహత్య కేసులో మరో మలుపు చోటు చేసుకుంది. వివేకా కుమార్తె సునీతా రెడ్డి, అల్లుడు రాజశేఖరరెడ్డితో పాటు సీబీఐ ఎస్పీ రామ్‌సింగ్‌పై పులివెందుల కోర్టులో స్థానిక పోలీసులు ఛార్జిషీట్ దాఖలు చేశారు.

వివేకా హత్య కేసు
వివేకా హత్య కేసు

Viveka Murder Case : వైఎస్ వివేకా హత్య కేసులో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. వివేకా కుమార్తె సునీతారెడ్డి, ఆమె భర్త నర్రెడి రాజశేఖర్ రెడ్డితో పాటు సీబీఐ ఎస్పీపై ఛార్జీషీట్ దాఖలైంది. ఈ మేరకు శుక్రవారం పులివెందుల కోర్టులో పులివెందుల అర్బన్‌ పోలీసులు ఛార్జిషీట్ దాఖలు చేశారు. వివేకా పీఏ కృష్ణారెడ్డి ఇచ్చిన ఫిర్యాదుపై విచారణ జరిపిన పోలీసులు… ఈ ఛార్జీషీట్ ను కోర్టులో సమర్పించారు.

ఫిర్యాదు ఏంటంటే…?

ఈ ఫిర్యాదును వైఎస్ వివేకా పీఏ కృష్ణారెడ్డి ఇచ్చారు. వైఎస్ వివేకా హత్య కేసులో కొంత మంది పేర్లు చెప్పాలని బెదిరించారని, కొంత మంది పేర్లు చెప్పాలని ఒత్తిడి తీసుకొచ్చారంటూ సీబీఐ ఎస్పీ రామ్‌సింగ్‌ పై ఫిర్యాదు చేశారు. విచారణకు పిలిచి సీబీఐ క్యాంపు కార్యాలయంలో, తన కుమారుల ముందే తీవ్రంగా కొట్టారని ఆయన అభియోగాలు మోపారు. అంతేకాకుండా.. ఈ కేసులో తనను తప్పుడు సాక్ష్యం చెప్పమంటూ వివేకా కుమార్తె, అల్లుడుతో పాటు సీబీఐ ఎస్పీ రామ్ సింగ్ తీవ్రస్థాయిలో ఒత్తిడి తీసుకొచ్చారని పేర్కొన్నారు. 2021 నవంబర్‌లో పులివెందుల పోలీసులకు ఈ ఫిర్యాదును ఇచ్చారు.

ఇక తన ఫిర్యాదుపై పోలీసులు చర్యలు తీసుకోకపోవటంతో పులివెందుల కోర్టును ఆశ్రయించారు కృష్ణారెడ్డి. ఆయన పిటిషన్ పై విచారించిన కోర్టు… కేసు నమోదుకు ఆదేశాలిచ్చింది. కోర్టు ఆదేశాలతో సీబీఐ ఎస్పీ రామ్‌సింగ్‌, సునీత, రాజశేఖర్‌రెడ్డిపై పోలీసులు కేసులు నమోదు చేశారు. ఇందుకు సంబంధించిన వివరాలతో తాజాగా పులివెందుల పోలీసులు… కోర్టులో ఛార్జీషీట్ ను దాఖలు చేశారు.

బెయిల్ పై విచారణ

మరోవైపు వివేకా హత్య కేసులో నిందితుడైన డి.శివశంకర్‌రెడ్డి దాఖలు చేసిన బెయిలు పిటిషన్‌పై తెలంగాణ హైకోర్టు విచారణ జరిపింది.ఎలాంటి ఆధారాలు లేకుండా ఈ హత్య కేసులో పిటిషనర్‌ను ఇరికించారని ఆయన తరపు న్యాయవాది వాదనలు వినిపించారు.కేవలం కక్షతో ఇందులో ఇరికించారన్నారు. వెంటనే బెయిల్ ఇవ్వాలని కోర్టును కోరారు. అయితే ఇరువైపు వాదనలు విన్న కోర్టు…. ఈ కేసును జనవరి 5కి వాయిదా వేసింది.

IPL_Entry_Point