Chandrababu On CM Jagan : వివేకా హత్య కేసులో సీఎం జగనే ప్రధాన నిందితుడు, చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు-rajahmundry tdp cheif chandranabu alleged cm jagan prime accused in viveka murder case ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Chandrababu On Cm Jagan : వివేకా హత్య కేసులో సీఎం జగనే ప్రధాన నిందితుడు, చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు

Chandrababu On CM Jagan : వివేకా హత్య కేసులో సీఎం జగనే ప్రధాన నిందితుడు, చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు

Bandaru Satyaprasad HT Telugu
May 27, 2023 09:36 PM IST

Chandrababu On CM Jagan : వివేకా హత్య కేసులో సీఎం జగన్ ప్రధాన నిందితుడని చంద్రబాబు ఆరోపించారు. జగన్ కు తెలిసే అన్నీ జరిగాయన్నారు. సీబీఐ బయటపెట్టిన వాస్తవాలపై సీఎం జగన్ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.

చంద్రబాబు
చంద్రబాబు

Chandrababu On CM Jagan : వైఎస్‌ వివేకానందరెడ్డి హత్య కేసులో కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ) దాఖలు చేసిన అఫిడవిట్‌లో ముఖ్యమంత్రి జగన్‌ ప్రస్తావనపై టీడీపీ అధినేత చంద్రబాబు స్పందించారు. శనివారం రాజమహేంద్రవరంలో టీడీపీ మహానాడు నిర్వహించారు. ఈ మహానాడులో చంద్రబాబు మాట్లాడుతూ... అసలు నిందితుడు ఎవరో సీబీఐ స్పష్టంగా చెప్పిందని చంద్రబాబు నాయుడు అన్నారు. ఈ కేసులో జగన్ మోహన్ రెడ్డే ప్రధాన నిందితుడని ఆరోపించారు. వివేకా హత్యకు సంబంధించి సీబీఐ హైకోర్టులో దాఖలు చేసిన అఫిడవిట్‌లో అన్ని వాస్తవాలను వెల్లడించిందన్నారు. వివేకానంద రెడ్డిని హత్య చేసిన తర్వాత, అందులో పాల్గొన్న వ్యక్తులు చాలా అమాయకులుగా నటించారని విమర్శించారు. హత్యపై దాదాపు రోజుకొక డ్రామా ఆడారన్నారు.

సీఎం జగన్ సమాధానం చెప్పాలి

వివేకా హత్యకేసులో జగన్ ప్రధాన నిందితుడిగా ఉన్నారని, వివేకాను చంపిన తర్వాత నాపై నిందలు మోపారని చంద్రబాబు మండిపడ్డారు. ఆ తర్వాత జరిగిన ఎన్నికల్లో లబ్ధి పొందేందుకు ‘నారాసుర రక్త చరిత్ర’ పుస్తకాన్ని కూడా రాశారని చంద్రబాబు అన్నారు. ఈ హత్య గురించి ఇతరులకు తెలియక ముందే జగన్‌కు తెలిసిందని సీబీఐ స్పష్టం చేసిందన్నారు. హంతకుడిని లేదా హత్యల వెనుక ఉన్న వ్యక్తిని రాష్ట్ర ముఖ్యమంత్రిగా చేస్తే ఈ తరం భవిష్యత్తు ఏమిటని చంద్రబాబు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. బయటపడ్డ వాస్తవాలపై సీఎం జగన్‌ సమాధానం చెప్పాలని టీడీపీ అధిష్ఠానం డిమాండ్‌ చేసింది.

జగన్ కు తెలిసే హత్య జరిగింది

వివేకా హత్యకు ముందు, హత్య తర్వాత వైఎస్‌ఆర్‌సీపీ ఎంపీ అవినాష్‌రెడ్డి ఇంట్లో నిందితులు ఉన్నారని, జరిగిన పరిణామాలపై ప్రతి నిమిషం జగన్‌కు అవినాష్ వివరించారని చంద్రబాబు అభిప్రాయపడ్డారు. జగన్‌కు హత్య గురించి బాగా తెలుసని, వైఎస్ వివేకానంద రెడ్డి హత్యపై తలెత్తుతున్న అన్ని పరిణామాలు, సందేహాలపై జగన్ స్పందించాలని చంద్రబాబు డిమాండ్ చేశారు.

అఫిడవిట్ లో సీబీఐ ఏముందంటే?

వివేకా హత్య విషయం పీఏ కృష్ణారెడ్డి బాహ్య ప్రపంచానికి చెప్పడం కంటే ముందే జగన్ మోహన్ రెడ్డికి సమాచారం అందిందని హైకోర్టుకు దాఖలు చేసిన కౌంటర్ అఫిడవిట్ లో సీబీఐ పేర్కొంది. వైఎస్ అవినాశ్ రెడ్డి ఈ హత్య జరగడానికి ముందు, తర్వాత క్రియాశీలకంగా ఉన్నందున్న హత్య సమాచారం జగన్ కు చేరవేసిన విషయంపై ఇంకా విచారణ జరపాల్సి ఉందని కోర్టుకు తెలిపింది సీబీఐ. దీని వెనక ఉన్న ఇంకా భారీ కుట్ర ఏమైనా ఉందా అనే దానిపై సమగ్ర దర్యాప్తు చేయాల్సి ఉందని స్పష్టం చేసింది. ఇప్పటి వరకు జరిగిన విచారణలో అవినాశ్ రెడ్డి పొంతన లేని సమాధానాలు చెప్పారని సీబీఐ కోర్టుకు తెలిపింది. అవినాశ్ ముందస్తు బెయిల్ ఇవ్వొద్దని న్యాయస్థానాన్ని సీబీఐ కోరింది. అవినాశ్ రెడ్డిని కస్టడీలోకి తీసుకొని విచారించాల్సిన అవసరం ఉందని కౌంటర్ అఫిడవిట్ లో సీబీఐ నివేదించింది.

Whats_app_banner