AP Jawans Martyred : లద్దాఖ్ ప్రమాదంలో ముగ్గురు ఏపీ సైనికులు మృతి, మంత్రి నారా లోకేశ్ దిగ్భ్రాంతి-ladakh army tank washed away accident three ap jawans martyred nara lokesh condolences ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Ap Jawans Martyred : లద్దాఖ్ ప్రమాదంలో ముగ్గురు ఏపీ సైనికులు మృతి, మంత్రి నారా లోకేశ్ దిగ్భ్రాంతి

AP Jawans Martyred : లద్దాఖ్ ప్రమాదంలో ముగ్గురు ఏపీ సైనికులు మృతి, మంత్రి నారా లోకేశ్ దిగ్భ్రాంతి

Bandaru Satyaprasad HT Telugu
Jul 01, 2024 06:55 PM IST

AP Jawans Martyred : తూర్పు లద్దాఖ్ లో జరిగిన దుర్ఘటనలో ఏపీకి చెందిన ముగ్గురు సైనికులు ప్రాణాలు విడిచారు. ముగ్గురు సైనికులు మృతదేహాలను ఏపీకి తీసుకొచ్చారు. గన్నవరం ఎయిర్ పోర్టులు ఆర్మీ సైనికులు గౌరవ వందనం సమర్పించారు.

లద్దాఖ్ ప్రమాదంలో ముగ్గురు ఏపీ సైనికులు మృతి
లద్దాఖ్ ప్రమాదంలో ముగ్గురు ఏపీ సైనికులు మృతి

AP Jawans Martyred : తూర్పు లద్దాఖ్ వద్ద నది దాటే ప్రయత్నంలో మృతి చెందిన ఐదుగురు సైనికుల్లో ముగ్గురు ఏపీకి చెందిన వారు ఉన్నారు. ఈ ముగ్గురు సైనికుల మృతదేహాలు గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్నాయి. ఆర్మీ సైనికులు గౌరవ వందనం సమర్పించారు. వాస్తవాధీన రేఖ సమీపంలో టి-72 యుద్ధ ట్యాంకులో వెళుతున్నప్పుడు లేహ్ కు 148 కి.మీ. దూరంలో ఈ ప్రమాదం జరిగింది. మంచు కరిగి శ్యోక్ నదికి వరదలు వచ్చి ట్యాంకు కొట్టుకుపోయిన విషయం తెలిసిందే.

ఏపీకి చెందిన ముగ్గురు సైనికులు

ఈ దుర్ఘటనలో ప్రకాశం జిల్లా రాచర్ల మండలం కాల్వపల్లె గ్రామానికి చెందిన జూనియర్ కమిషన్డ్ అధికారి (జేసీవో) ముత్తుముల రామకృష్ణారెడ్డి మృతిచెందారు. ఈ ప్రమాదంలోనే కృష్ణా జిల్లా పెడన మండలం చేవేండ్ర గ్రామానికి చెందిన సైనికుడు సాదరబోయిన నాగరాజు (32) మరణించారు. ధనలక్ష్మి, వెంకన్నల కుమారుడైన నాగరాజుకు ఐదేళ్ల కిందట మంగాదేవితో పెళ్లైంది. వారికి ఏడాది పాప ఉంది. నాగరాజు సోదరుడు శివయ్య కూడా సైనికుడిగా సేవలందిస్తున్నారు. బాపట్ల జిల్లా రేపల్లే మండలం ఇస్లాంపూర్ కు చెందిన సుభాన్ ఖాన్ కూడా ఈ ప్రమాదంలో మరణించారు. ఇతను 17 ఏండ్ల క్రితం సైనికుడిగా చేరి అంచెలంచెలుగా హవాల్దార్ స్థాయికి ఎదిగారు. ప్రస్తుతం ఈఎంఈ మెకానికల్ విభాగంలో పనిచేస్తున్నారు. ఇస్లాంపూర్ లో సుమారు 100 ఇళ్లు ఉండగా దాదాపు ప్రతి ఇంటి నుంచి ఇద్దరు సైనికులు దేశానికి సేవలు అందించారు. వీరిలో కొందరు రిటైర్డ్ అయ్యారు.

గవర్నర్ తరఫున నివాళి

తూర్పు లద్దాఖ్‌లోని వాస్తవ నియంత్రణ రేఖ వెంబడి విధి నిర్వహణలో తమ ప్రాణాలను అర్పించిన 52 ఆర్మర్డ్ రెజిమెంట్‌కు చెందిన వీర జవాన్లు రిసల్దార్ ముత్తుముల్ల ఆర్. కృష్ణా రెడ్డి, హవల్దార్ సుభాన్ ఖాన్, సిపాయి నాగరాజులకు ఏపీ గవర్నర్ ఎస్. అబ్దుల్ నజీర్ తరపున గవర్నర్ ఏడీసీ

మేజర్ దీపక్ శర్మ సోమవారం గన్నవరం విమానాశ్రయంలో పుష్పగుచ్ఛం సమర్పించి నివాళులు అర్పించారు.

మంత్రి నారా లోకేశ్ దిగ్భ్రాంతి

ఏపీకి చెందిన ముగ్గురు జవాన్లు మృతి పట్ల మంత్రి నారా లోకేశ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆయన ఎక్స్ లో పోస్టు పెట్టారు. లద్దాఖ్‌ ప్రమాదంలో సాదరబోయిన నాగరాజు, సుభాన్ ఖాన్, ఎం. ఆర్కే రెడ్డి మృతి చెందటం బాధాకరం అన్నారు. వారి ఆత్మకు శాంతిని చేకూరాలని, వారి కుటుబ సభ్యులకు మనోధైర్యాన్ని ప్రసాదించాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నానన్నారు. వారి కుటుంబ సభ్యులకు ప్రభుత్వం అన్నివిధాలా అండగా ఉంటుందని తెలిపారు.

రూ.1 కోటి చొప్పు ఆర్థిక సాయం చేసి ఆదుకోవాలి

"లద్దాఖ్‌లో యుద్ధ ట్యాంకు కొట్టుకుపోయిన ప్రమాదంలో జవాన్లు వీరమరణం పొందడం తీవ్రంగా కలిచివేసింది. దేశ రక్షణ కోసం జవాన్ల త్యాగాలు మరువలేనివి. వీరమరణం పొందిన జవాన్లలో కృష్ణా జిల్లాకి చెందిన సాదరబోయిన నాగరాజు, ప్రకాశం జిల్లాకి చెందిన ముత్తుముల రామకృష్ణారెడ్డి, బాపట్ల జిల్లాకి చెందిన సుభాన్‌ ఖాన్ ఉండటం మరింత బాధాకరం. చనిపోయిన జవాన్లకి నా నివాళులు.. అలానే వారి కుటుంబాలకి నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను. అసువులు బాసిన తెలుగు జవాన్ల కుటుంబాలకి రూ.1 కోటి చొప్పున ఆర్థిక సహాయం అందించి రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాను"-మాజీ సీఎం జగన్

Whats_app_banner

సంబంధిత కథనం