Restrictions On TV Channels : ఏపీలో టీవీ ఛానెళ్లపై నియంత్రణ, ట్రాయ్‌కి వైసీపీ ఎంపీ ఫిర్యాదు!
Restrictions On TV Channels : ఏపీలో కొన్ని టీవీ ఛానళ్లపై ఆంక్షలు విధిస్తున్నారని, ప్రసారాలను నియంత్రిస్తున్నారని వైసీపీ ఎంపీ నిరంజన్ రెడ్డి ట్రాయ్ కి ఫిర్యాదు చేశారు.

Restrictions On TV Channels : రాష్ట్రంలో కొన్ని టీవీ ఛానెళ్లపై ఆంక్షలు విధించారని వైసీపీ ఎంపీ నిరంజన్ రెడ్డి ట్రాయ్‌కి ఫిర్యాదు చేశారు. ఇటీవలి ఎన్నికల్లో గెలిచిన టీడీపీ కూటమి రాష్ట్రంలో మీడియాపై అణచివేత చర్యలకు పూనుకుందని ఫిర్యాదులో పేర్కొన్నారు. టీవీ ఛానెళ్ల నియంత్రణపై జోక్యం చేసుకోవాలని, ఆయా ఛానెళ్ల ప్రసారాలకు అంతరాయం కాకుండా చూడాలని విజ్ఞప్తి చేశారు. ఇటీవలి రాష్ట్రంలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ ఘోర ఓటమి చవి చూసింది. టీడీపీ కూటమి ఘన విజయం సాధించింది. మే 13న ఎన్నికలకు సంబంధించిన పోలింగ్ జరగగా, జూన్ 4న ఫలితాలు వెలువడ్డాయి. 175 స్థానాల్లో 164 స్థానాలను టీడీపీ కూటమి సొంతం చేసుకుంది. వైసీపీకి కేవలం 11 స్థానాలు మాత్రమే వచ్చాయి. ఈ ఎన్నికల్లో గెలిచిన టీడీపీ, ఆ పార్టీకి వ్యతిరేకంగా ప్రసారాలు చేసిన టీవీ ఛానెళ్లపై ఆంక్షలు విధించిందని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు.
ప్రసారాలు నిలుపుదల చేశారని ఆరోపణలు
ఏపీలో సాక్షి టీవీ, టీవీ 9 తెలుగు, ఎన్‌టీవీ తెలుగు, 10 టీవీ ఛానెల్స్ నెంబర్స్‌ను మార్చారు. ఆయా ఛానెళ్ల ప్రసారాలను నిలుపుదల చేసేలా కేబుల్ ఆపరేటర్లపై టీడీపీ ప్రభుత్వం ఒత్తిడి తెచ్చిందని వైసీపీ ఎంపీ తన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఆయా ఛానెళ్లపై ఆంక్షలతో ప్రస్తుతం డీస్ టీవీ, టాటా స్కై, ఎయిర్‌టెల్ వంటి వాటిల్లోనే వస్తున్నాయన్నారు. కేబుల్ ఆధారిత టీవీల్లో ఛానెళ్లు నిలుపుదల చేశారని పేర్కొన్నారు.
ప్రభుత్వ ఒత్తిడి మేరకు ఆంక్షలు
రాష్ట్రంలో మీడియాపై టీడీపీ ప్రభుత్వం ఆంక్షలు విధిస్తుందని ట్రాయ్ ఛైర్మన్‌కి వైసీపీ ఎంపీ ఎస్.నిరంజన్ రెడ్డి ఫిర్యాదు చేశారు. ఈ మేరకు ట్రాయ్ ఛైర్మన్‌కు లేఖ రాశారు. ఛానెళ్ల ప్రసారాలను నిలుపుదల చేసేలా కేబుల్ ఆపరేటర్లపై కొత్త ప్రభుత్వం ఒత్తిడి తెచ్చిందని లేఖలో పేర్కొన్నారు. సమాచారాన్ని తెలుసుకునే ప్రజల హక్కులను ప్రభుత్వం కాలరాస్తోందని ఆరోపించారు. కొత్తగా ఎన్నికైన టీడీపీ ప్రభుత్వం ఒత్తిడి మేరకు సాక్షి టీవీ, ఎన్‌టీవీ, టీవీ 9, 10 టీవీ ఛానెళ్లను నియంత్రించాలని కేబుల్ టీవీ ఆపరేటర్ల అసోసియేషన్ తీర్మానం చేసిందని లేఖలో తెలిపారు. ఈ ఛానెళ్లపై ఎటువంటి ఫిర్యాదులు, న్యాయపరమైన అంశాలు లేకపోయినప్పటికీ ఇలాంటి చర్యలకు పూనుకున్నారని పేర్కొన్నారు. ఎటువంటి కారణాలు లేకుండా స్వతంత్ర ఛానెల్స్‌పై నిషేధం విధించడం సుప్రీంకోర్టు తీర్పును ఉల్లంఘించినట్లేనని లేఖలో పేర్కొన్నారు. ఈ విషయంలో ట్రాయ్ జోక్యం చేసుకోవాలని, ప్రసారాలకు అంతరాయం కలగకుండా చూడాలని విజ్ఞప్తి చేశారు.
జగదీశ్వరరావు జరజాపు, హిందూస్థాన్ టైమ్స్ తెలుగు
సంబంధిత కథనం