Kodali Nani: నిజం గెలిస్తే చంద్రబాబు జీవితాంతం జైల్లోనే అంటున్న కొడాలి నాని-kodali nani says if the truth wins chandrababu should stay in jail for the rest of his life ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Kodali Nani: నిజం గెలిస్తే చంద్రబాబు జీవితాంతం జైల్లోనే అంటున్న కొడాలి నాని

Kodali Nani: నిజం గెలిస్తే చంద్రబాబు జీవితాంతం జైల్లోనే అంటున్న కొడాలి నాని

Sarath chandra.B HT Telugu
Oct 25, 2023 12:09 PM IST

Kodali Nani: నారా భువనేశ్వరి నిజం గెలవాలి యాత్రపై కొడాలి నాని ఆగ్రహం వ్యక్తం చేశారు. నిజం గెలిస్తే చంద్రబాబు జీవితాంతం జైల్లోనే ఉండాల్సి వస్తుందన్నారు. నిజం గెలిచింది కాబట్టే చంద్రబాబు జైల్లో ఉన్నారని,బాబు జీవితం అంతా అవినీతితోనే ఉందన్నారు.

కొడాలి నాని
కొడాలి నాని

Kodali Nani: నారా భువనేశ్వరి నిజం గెలవాలనుకుంటే చంద్రబాబు జీవితంలో జైలు నుంచి బయటకు రారని కొడాలి నాని ఎద్దేవా చేశారు. బాబు కుటుంబమంతా అవినీతి సొమ్ముతో మునిగి పోయిందన్నారు. ఎన్టీఆర్ కుటుంబ సభ్యులు ఏ స్థితిలో ఉన్నారు, భువనేశ్వరి ఏ స్థాయిలో ఉన్నారని ప్రశ్నించారు.

రెండు ఎకరాలతో ప్రారంభమైన బాబు ప్రస్థానం నేడు రూ.2 వేల కోట్లు దాటిందన్నారు. 40 రోజుల్లో ఢిల్లీ లాయర్లకు ఏ విధంగా రూ.35 కోట్లు చెల్లించారని ప్రశ్నించారు? కష్టపడి పొలం దున్నితే వచ్చిన డబ్బుతోనే రూ.7 కోట్లతో రూపొందించిన బస్సులో యాత్ర చేస్తున్నారా అన్నారు.

నిజం గెలవాలనుకుంటే జీవితంలో బయటకు రారని చెప్పారు. బాబు జైల్లో ఉన్న 45రోజుల్లో ఢిల్లీ లాయర్లకు 35కోట్లు ఫీజుగా చెల్లించారన్నారు. వెయ్యి గొడ్లను తిన్న రాబందు గాలివానకు కొట్టుకు పోయిందని ఎద్దేవా చేశారు. బాబు దగ్గర రెండు లక్షల కోట్ల రుపాయలు ఉన్నాయని, అవినీతి సొమ్ముతో హెరిటేజ్‌ను స్థాపించి భువనేశ్వరికి అప్పగించారన్నారు.

భువనేశ్వరి యాత్ర కోసం 7కోట్ల రుపాయలతో బాంబే నుంచి బస్సు తయారు చేయించారని, నిజం గెలుస్తుందని టీడీపీ అంటోందని,నిజం గెలవబట్టే చీటర్ బాబు జైల్లో ఊచలు లెక్క బెడుతున్నారని ఎద్దేవా చేశారు.

పవన్ పార్టీ పెట్టిందే బాబు కోసం…

2014ఎన్నికల్లో కూడా చంద్రబాబు కోసమే పవన్ పార్టీని స్థాపించారని కొడాలి నాని ఆరోపించారు. టీడీపీ వ్యతిరేక ఓటును చీల్చడానికి 2019లో కూడా పవన్ కళ్యాణ్ ప్రయత్నించాడని ఆరోపించారు.

పవన్ మంచి నటుడని, జనసున్నా పార్టీతో ఏపీలో ఏమవుతుందన్నారు. లోకేష్ అసమర్ధుడు కావడంతోనే లోకేష్ తల్లి, యాత్రపేరుతో తిరగడానికి రోడ్లపైకి వచ్చారన్నారు. చంద్రబాబు వ్యతిరేక ఓట్లను చీల్చడానికి సిపిఎం,సిపిఐలతో కలిసి పవన్ పోటీ చేశాడని ఆరోపించారు.