Pawan Kalyan : సీఎం పదవికి సుముఖంగానే ఉన్నా - పవన్ కల్యాణ్
Janasena Chief Pawan Kalyan : ప్రభుత్వం మారిన తర్వాత వైసీపీ కుంభకోణాలపై దృష్టి పెడుతామని తెలిపారు జనసేన అధినేత పవన్ కల్యాణ్. అవినీతితో సంబంధం ఉన్న ప్రతి ఒక్కర్నీ జైలుకి పంపుతామని స్పష్టం చేశారు. ఐబీ సిలబస్ అమలు వెనుక పెద్ద కుంభకోణం ఉందని ఆరోపించారు.
Janasena Chief Pawan Kalyan : విద్యాశాఖలో చోటు చేసుకున్నా అవినీతి, చేసిన కుంభకోణాలపై దృష్టిపెడతామన్నారు పవన్ కల్యాణ్. విద్యా శాఖలో ప్రస్తుతం జరుగుతున్న అవినీతి పనుల్లో సంబంధం ఉన్న ప్రతి ఒక్కరినీ జైలుకి పంపుతామని హెచ్చరించారు. పతనావస్థలో ఉన్న కంపెనీలకు కాంట్రాక్టులు ఇచ్చి విద్యా వ్యవస్థను దుర్వినియోగం చేశారన్నారు. మంత్రి బొత్స సత్యనారాయణ జనసేన పార్టీ గురించి మాట్లాడినా, కించపర్చే విధంగా మాట్లాడినా పట్టించుకునేది లేదని స్పష్టం చేశారు.
శుక్రవారం సాయంత్రం మంగళగిరిలోని జనసేన పార్టీ కేంద్ర కార్యాలయంలో పార్టీ పీఏసీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ తో కలసి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ ... వైసీపీ ప్రభుత్వం అధికారం చేపట్టినప్పటి నుంచి విద్యా వ్యవస్థలో చాలా అవకతవకలు జరుగుతున్నాయన్నారు. విద్యార్ధులను అయోమయానికి గురి చేస్తోందన్న ఆయన... ఇంగ్లీష్ మీడియం అంశం మీద సలహాలు ఇచ్చే ప్రయత్నం చేస్తే మేమేదో ఇంగ్లీష్ మీడియంకి వ్యతిరేకం అని అవాకులుచవాకులు మాట్లాడారని ఆగ్రహం వ్యక్తం చేశారు. విదేశాల్లో ముఖ్యంగా అమెరికాలో యూనివర్సిటీలకు వెళ్లే విద్యార్ధులకు టోఫెల్ టెస్ట్ అవసరమని... కానీ 3వ తరగతి, 5వ తరగతి పిల్లలకు టోఫెల్ టెస్ట్ పెట్టడం వెనుక లాజిక్ అర్ధం కావడం లేదన్నారు.
మంత్రి బొత్స, ముఖ్యమంత్రి విదేశీ యాక్సెంట్ తో మాట్లాడకున్నా పదవులు వచ్చేశాయని ఎద్దేవా చేశారు పవన్ కల్యాణ్. పిల్లలకు ఆలోచనా శక్తితో కూడిన సృజనాత్మకతతో బోధన అవసరమని... భాష కేవలం ఒక ఉపకరణం లాంటిది మాత్రమే అని అన్నారు. ఇంగ్లీష్ నేర్చుకుంటేనే అద్భుతాలు జరుగుతాయంటే అమెరికా, బ్రిటన్ వంటి దేశాల్లో పేదరికం ఉండకూడదని... ఎవరూ రోడ్ల మీద పడుకోకూడదని చెప్పారు. న్యూయార్క్ లో ఇంగ్లీష్ మాట్లాడే వారంతా అద్భుతాలు సాధిస్తున్నారనుకుంటే పొరపాటే అని హితవు పలికారు.
"ఐబీ సిలబస్ కావాలంటే ప్రతి స్కూలు రూ. 10 నుంచి రూ.12 లక్షలు చెల్లించాలి. ప్రభుత్వంలో ఉన్నవారు అవగాహన లేమితో చేస్తున్నారో, స్కామ్ చేయాలన్న ఉద్దేశంతో చేస్తున్నారో తెలియడం లేదు. విదేశీ కంపెనీలతో ఒప్పందం పెట్టుకున్న తర్వాత ఉల్లంఘన జరిగితే ఆర్బిటిరేషన్ చాలా చిక్కులతో కూడుకుని ఉంటుంది. వొడాఫోన్ ఒప్పందం ఉల్లంఘన జరిగితే పారిస్ లో ఉన్న భారత దౌత్యవేత్తల కార్యాలయాలు సీజ్ చేయమన్నారు. ఇది చాలా ప్రమాదం. జెనీవాలో ఆర్బిటిరేషన్ సాధ్యమయ్యే పని కాదు. దేశం మొత్తం మీద 210 స్కూల్స్ కి ఐబీ సిలబస్ ఉంది. ఇప్పుడు రాష్ట్రంలోని అన్నీ పాఠశాలల్లో దీన్ని అమలు చేయాలంటే.. కేవలం టీచర్ల శిక్షణ కోసమే ఏడాదికి రూ. 1200 కోట్ల ఖర్చు అవుతుంది. ఇందులో స్కామ్ జరుగుతోందన్న బలమైన అనుమానాలు ఉన్నాయి. దీనిపై వైసీపీ ప్రభుత్వం కచ్చితంగా సమాధానం చెప్పాలి. మంత్రి బొత్స మేము చెప్పినదాన్ని సదుద్దేశంతో తీసుకుని వివరణ ఇవ్వాలని" అని డిమాండ్ చేశారు.
సీఎం పదవికి సుముఖమే - పవన్ కల్యాణ్
వైసీపీ విముక్త ఆంధ్రప్రదేశ్ కోసం సమష్టి పోరాటం చేద్దామని పిలుపునిచ్చారు పవన్ కల్యాణ్. ముఖ్యమంత్రి పదవికి సుముఖంగానే ఉన్నానని... చిన్న చిన్న ఇబ్బందులను అధిగమించి పని చేద్దామని పిలుపునిచ్చారు. సమష్టిగా ముందుకు వెళ్లి విజయకేతనం ఎగురవేద్దామని అన్నారు. శుక్రవారం మంగళగిరి పార్టీ కేంద్ర కార్యాలయంలో నూతన రాష్ట్ర కార్యవర్గ సభ్యులకు నియామక పత్రాలను అందజేసిన అనంతరం పవన్ కల్యాణ్ ఈ వ్యాఖ్యలు చేశారు. ముఖ్యమంత్రి పదవి తీసుకునే అవకాశం వస్తే కచ్చితంగా స్వీకరిస్తామని స్పష్టం చేశారు. టీడీపీ - జనసేన ప్రభుత్వం ఏర్పడేలా ప్రతి జనసేన కార్యకర్త పని చేయాలని దిశానిర్దేశం చేశారు.