Sankranthi Special Trains 2024 : న్యూ ఇయర్, సంక్రాంతి రద్దీ- హైదరాబాద్ నుంచి తిరుపతి, కాకినాడకు ప్రత్యేక రైళ్లు
Sankranthi Special Trains 2024 : న్యూ ఇయర్, సంక్రాంతి రద్దీ దృష్ట్యా దక్షిణ మధ్య రైల్వే హైదరాబాద్ నుంచి తిరుపతి, కాకినాడకు ప్రత్యేక రైళ్లు నడుపుతుంది.
Sankranthi Special Trains 2024 : సంక్రాంతి అంటే తెలుగు రాష్ట్రాల్లో పెద్ద పండుగ. ఉపాధి, ఉద్యోగాల కోసం పట్టణాల బాట పట్టిన ప్రజలు... సంక్రాంతికి తమ స్వగ్రామాలకు వచ్చి పండుగ నాలుగు రోజులు ఆనందంగా గడుపుతారు. పండుగకి వారం ముందు నుంచే ఊర్లకు బయలుదేరతారు. ముఖ్యంగా హైదరాబాద్ నుంచి ఏపీలోని పలు ప్రాంతాలు జనం ఎక్కువగా ప్రయాణిస్తుంటారు. ఇందుకోసం ఆర్టీసీ ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేస్తే, దక్షిణ మధ్య రైల్వే ప్రత్యేక రైళ్లు నడుపుతుంటుంది. సంక్రాంతికి మూడు నెలల ముందు నుంచే ప్రయాణాలు ప్లాన్ చేసుకుని రిజర్వేషన్లు చేయించుకుంటారు. ప్రతీ ఏడాది లక్షల్లో ప్రయాణికులు హైదరాబాద్ ను ఇతర రాష్ట్రాలకు వెళ్తుంటారు.
తిరుపతి, కాకినాడకు ప్రత్యేక రైళ్లు
న్యూ ఇయర్, సంక్రాంతికి ప్రయాణికుల రద్దీ దృష్ట్యా పలు మార్గాల్లో దక్షిణ మధ్య రైల్వే ప్రత్యేక రైళ్లు నడుపుతుంది. హైదరాబాద్-తిరుపతి(07489, 07490) ప్రత్యేక రైలు ఈ నెల 29వ తేదీ సాయంత్రం 6.15 గంటలకు బయలుదేరి తర్వాత రోజు ఉదయం 7.50 గంటలకు తిరుపతి చేరుకుంటుంది. మళ్లీ తిరుగు ప్రయాణంలో ఈ నెల 30వ తేదీ రాత్రి 8.25 తిరుపతిలో బయలుదేరి తర్వాత రోజు ఉదయం 8.50కి హైదరాబాద్ చేరుకుంటుంది. హైదరాబాద్-తిరుపతి (07449,07450) మరో స్పెషల్ ట్రైన్ ఈ నెల 27న తేదీ సాయంత్రం 6.10కు బయలుదేరి తర్వాత రోజు ఉదయం 6.45కు తిరుపతి చేరుకోనుంది. తిరుగు ప్రయాణంలో 28వ తేదీ సాయంత్రం 5.15 గంటలకు బయలుదేరి తర్వాత రోజు ఉదయం 7.30 గంటలకు హైదరాబాద్ చేరుకుంటుంది. హైదరాబాద్-కాకినాడ (07451, 07452) ప్రత్యేక రైలు ఈ నెల 29వ తేదీ రాత్రి 8.30 గంటలకు హైదరాబాద్ లో బయలుదేరి తర్వాత రోజు ఉదయం 8 గంటలకు కాకినాడ చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో ఈ నెల 30న రాత్రి 9 గంటలకు కాకినాడలో బయలుదేరి తర్వాత రోజు ఉదయం 9.00 గంటలకు హైదరాబాద్ చేరుకుంటుంది.
మరిన్నీ అదనపు రైళ్ల కోసం ఎదురుచూపులు
ప్రస్తుతం రైళ్ల రిజర్వేషన్లు అన్ని ఫుల్ అయ్యాయి. దీంతో ప్రయాణికులు ప్రయాణం ఎలా అని ఆందోళన చెందుతున్నారు. ముఖ్యంగా దూర ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికులు... తమ జేబులకు చిల్లులు తప్పవంటూ ఆవేదన చెందుతున్నారు. సంక్రాంతికి ఊళ్లకు వెళ్లే వారు ముఖ్యంగా రైళ్ల పైనే ఆధారపడతారు. సికింద్రాబాద్ నుంచి ఏపీకి వెళ్లే రైళ్ల రిజర్వేషన్లు ఇప్పటికే ఫుల్ అయ్యాయి. ఇక ప్రత్యేక రైళ్ల కోసం ప్రయాణికులు ఎదురుచూస్తున్నారు. రైళ్ల సంఖ్య పెంచకపోతే ట్రావెల్స్ బస్సులను ఆశ్రయించాల్సిన పరిస్థితి ఉంటుంది. కానీ పండుగ సమయాల్లో ట్రావెల్స్ నిర్వాహకులు ఛార్జీలు విపరీతంగా పెంచేస్తుంటారు. దీంతో సొంతూరికి ఎలా వెళ్లాలని ఆందోళనలో ఉన్నారు. రద్దీ దృష్ట్యా దక్షిణ మధ్య రైల్వే మరిన్నీ అదనపు రైళ్లు వేయాలని కోరుతున్నారు. ఇటీవల ప్రకటించిన 20 ప్రత్యేక రైళ్ల రిజర్వేషన్లు సైతం హాట్ కేకుల్లా పూర్తయ్యాయి.