Andhra Pradesh Rains: తీరాన్ని తాకక ముందే తీవ్ర ప్రభావం.. ఏపీలో వర్ష బీభత్సం-heavy rains are causing havoc in andhra pradesh ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Andhra Pradesh Rains: తీరాన్ని తాకక ముందే తీవ్ర ప్రభావం.. ఏపీలో వర్ష బీభత్సం

Andhra Pradesh Rains: తీరాన్ని తాకక ముందే తీవ్ర ప్రభావం.. ఏపీలో వర్ష బీభత్సం

Basani Shiva Kumar HT Telugu
Aug 31, 2024 03:14 PM IST

Andhra Pradesh Rains: తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. భారీ వర్షాల కారణంగా ప్రధాన నగరాల్లో జన జీవనం స్తంభించిపోయింది. ముఖ్యంగా ఏపీలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దక్షిణ కోస్తాకు భారీ వర్ష సూచన ఉందని అధికారులు చెబుతున్నారు.

వాగులో కొట్టుకుపోతున్న వాహనదారుడు
వాగులో కొట్టుకుపోతున్న వాహనదారుడు

బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం తీరాన్ని తాకక ముందే ఏపీపై తీవ్ర ప్రభావం చూపిస్తోంది. అల్పపీడనం ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు దంచికొడుతున్నాయి. రోడ్లన్నీ జలమయం అయ్యాయి. వాహనాలు కదల్లేని పరిస్థితి నెలకొంది. అత్యవసరం అయితే తప్ప.. బయటకు రావొద్దని అధికారులు సూచిస్తున్నారు. దీన్నిబట్టి అర్థం చేసుకోవచ్చు వర్షం తీవ్రత ఏ స్థాయిలో ఉందో. ఈ అర్ధరాత్రి విశాఖ- గోపాలపురం మధ్య అల్పపీడనం తీరం దాటే అవకాశం ఉంది. ఆ సమయంలో వర్షాలు ఇంకా భారీగా కురిసే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు.

ఈ జిల్లాలపై తీవ్ర ప్రభావం..

గుంటూరు, కృష్ణా జిల్లా, ఎన్టీఆర్‌ జిల్లా, విజయవాడ నగరంపై అల్పపీడనం ప్రభావం ఎక్కువగా ఉంది. ఇదే సమయంలో.. దక్షిణ కోస్తాకు భారీ వర్ష సూచన ఉందని అధికారులు వివరిస్తున్నారు. విజయవాడలో పదికిపైగా ప్రాంతాలను వరద నీరు ముంచెత్తింది. బెజవాడ రోడ్లన్నీ వాగుల్లా మారాయి. ఇబ్రహీంపట్నం దగ్గర జాతీయ రహదారి నీట మునిగింది. దీంతో వాహనాలు భారీగా నిలిచిపోయాయి. ఎటూ కదల్లేని పరిస్థితి నెలకొంది. పోలీసులు రంగంలోకి దిగి ట్రాఫిక్‌ను క్లియర్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. వాహనాలను దారి మళ్లిస్తున్నారు.

చెరువులా మారిన టోల్ ప్లాజా..

మంగళగిరి టోల్ ప్లాజా వద్ద రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. టోల్‍గేట్ వద్ద ప్రధాన రహదారికి భారీగా నీటి చేరికతో ట్రాఫిక్ ఇబ్బందులు ఏర్పడ్డాయి. వరద నీటితో మంగళగిరి టోల్‍ప్లాజా ప్రాంతం జలాశయాన్ని తలపిస్తుంది. గుంటూరు, విజయవాడ ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రయాణికులు జాగ్రత్తలు తీసుకోవాలని పోలీసులు విజ్ఞప్తి చేస్తున్నారు. గుంటూరు- విజయవాడ మధ్య హైవే ఎక్కొద్దని సూచిస్తున్నారు. మరోవైపు గుంటూరు ఆటోనగర్, పెద్దకాకాని పోలీస్ స్టేషన్ సమీపమంతా జలమయం అయ్యింది.

హెచ్చరికలను తేలిగ్గా తీసుకోవద్దు..

ప్రభుత్వ హెచ్చరికలను తేలికగా తీసుకున్న వారు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. తాజాగా.. ఎన్టీఆర్ జిల్లా చందర్లపాడు మండలం ముప్పాళ్ల వాగులో ఓ ద్విచక్ర వాహనదారుడు కొట్టుకుపోయాడు. స్థానికులు అతన్ని కాపాడే ప్రయత్నం చేసినా ఫలించలేదు. ఇప్పటివరకు అతని ఆచూకీ లభించలేదు. చాలా ప్రాంతాల్లో వాగులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. రోడ్లు కూడా జలమయం అయ్యాయి. అందుకే బయటకు రావొద్దని అధికారులు సూచిస్తున్నారు. అత్యవసర పని ఉంటేనే ఇంట్లో నుంచి బయటకు రావాలని స్పష్టం చేస్తున్నారు.

Whats_app_banner