Notices To Ysrcp office : మంగళగిరి టీడీపీ ఆఫీసుపై దాడి కేసు- వైసీపీ కేంద్ర కార్యాలయం, దేవినేని అవినాష్ కు నోటీసులు-mangalagiri police notice to ysrcp office devineni avinash in tdp office attack case ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Notices To Ysrcp Office : మంగళగిరి టీడీపీ ఆఫీసుపై దాడి కేసు- వైసీపీ కేంద్ర కార్యాలయం, దేవినేని అవినాష్ కు నోటీసులు

Notices To Ysrcp office : మంగళగిరి టీడీపీ ఆఫీసుపై దాడి కేసు- వైసీపీ కేంద్ర కార్యాలయం, దేవినేని అవినాష్ కు నోటీసులు

Bandaru Satyaprasad HT Telugu
Aug 21, 2024 06:02 PM IST

Notices To Ysrcp office : మంగళగిరి టీడీపీ కేంద్ర కార్యాలయంపై దాడి కేసులో పోలీసులు విచారణ ముమ్మరం చేశారు. తాజాగా వైసీపీ కేంద్ర కార్యాలయానికి నోటీసులు ఇచ్చారు. దాడి జరిగిన రోజు సీసీ ఫుటేజీ అందించాలని కోరారు.

మంగళగిరి టీడీపీ ఆఫీసుపై దాడి కేసు- వైసీపీ కేంద్ర కార్యాలయానికి నోటీసులు
మంగళగిరి టీడీపీ ఆఫీసుపై దాడి కేసు- వైసీపీ కేంద్ర కార్యాలయానికి నోటీసులు

Notices To Ysrcp office : మంగళగిరి టీడీపీ కేంద్ర కార్యాలయంపై దాడి కేసులో పోలీసులు దర్యాప్తును వేగవంతం చేశారు. తాజాగా తాడేపల్లి వైసీపీ కేంద్ర కార్యాలయానికి పోలీసులు నోటీసులు అంటించారు. టీడీపీ ఆఫీసుపై దాడి జరిగిన రోజు వైసీపీ కార్యాలయం నుంచి ఎవరెవరు బయల్దేరారనే విషయంపై పోలీసులు ఆరా తీస్తు్న్నారు. ఈ నేపథ్యంలో దాడి జరిగిన రోజు అంటే అక్టోబర్ 19, 2021 నాడు వైసీపీ ఆఫీసు వద్ద సీసీ కెమెరాల వీడియోలు సమర్పించాలని పోలీసులు నోటీసుల్లో పేర్కొన్నారు. ఈ కేసులో వైసీపీ నేత దేవినేని అవినాష్‌కు పోలీసులు నోటీసులు జారీ చేశారు. గుణదలలోని ఆయన ఇంటికి నోటీసులు అంటించారు. తాము చెప్పిన రోజు విచారణకు హాజరుకావాలని నోటీసుల్లో పేర్కొన్నారు. అయితే వారం క్రితమే పోలీసులు నోటీసులు ఇవ్వగా...ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

వైసీపీ హయాంలో టీడీపీ కేంద్ర కార్యాలయంపై ఆ పార్టీ నేతలు దాడికి పాల్పడ్డారు. విజయవాడ, గుంటూరు నుంచి పెద్ద సంఖ్యలో వైసీపీ నేతలు టీడీపీ ఆఫీసుపై దాడి చేశారు. కూటమి ప్రభుత్వం వచ్చాక ఈ కేసుపై దర్యాప్తు ముమ్మరం చేశారు పోలీసులు. ఈ దాడిలో పాల్గొన్న వైసీపీ నేతల ఆధారాలు సేకరించారు. ఆగస్టు 16న పోలీసులు వైసీపీ కేంద్ర కార్యాలయానికి నోటీసులు పంపింది. అయితే ఈ విషయంగా ఆలస్యంగా వెలుగుచూసింది. మంగళగిరిలోని టీడీపీ ఆఫీసుపై దాడి జరిగిన సమయంలో వైసీపీ కేంద్ర కార్యాలయంలో ఎవరు ఉన్నారు? ఏం జరిగిందో తెలుసుకునేందుకు సీసీ కెమెరా ఫుటేజీ ఇవ్వాలని మంగళగిరి పోలీసులు నోటీసులు జారీ చేశారు. వైసీపీ ఈ ఫుటేజీ వివరాలు అందిస్తుందా? లేదా? ఆసక్తిగా మారింది.

టీడీపీ కేంద్ర కార్యాలయంపై దాడికి సంబంధించి వైసీపీ కీలక నేతలు సజ్జల రామకృష్ణారెడ్డి, జోగి రమేశ్, దేవినేని అవినాష్ పై కేసు నమోదైంది. ఈ కేసులో ఇప్పటికే వీరు హైకోర్టుకు ఆశ్రయించి ముందస్తు బెయిల్ కోసం ప్రయత్నిస్తున్నారు. ఈ నేపథ్యంలో పోలీసులు మరిన్ని ఆధారాలు సేకరిస్తున్నారు.

విచారణకు జోగి రమేష్ గైర్హజరు

వైసీపీ నేత, మాజీ మంత్రి జోగి రమేశ్ మరోసారి సీఐడీ విచారణకు గైర్హజరయ్యారు. జోగి రమేశ్ తరఫున ఆయన న్యాయవాదులు మంగళగిరి పోలీస్ స్టేషన్‌కు వచ్చి, ఆయన విచారణకు రావట్లేదని చెప్పారు. వైసీపీ హయాంలో అప్పటి ప్రతిపక్ష నేత చంద్రబాబు ఇంటిపై జరిగిన దాడి కేసులో జోగి రమేశ్ పై కేసు నమోదైంది. అయితే విచారణకు హాజరవ్వాలని జోగి రమేష్ కు పోలీసులు నోటీసులు జారీ చేశారు. నిన్న మరోసారి విచారణకు రావాలని సీఐడీ నోటీసులు ఇచ్చింది. ఆయన విచారణకు గైర్హాజరయ్యారు. ఈ కేసులో గత శుక్రవారం జోగి రమేశ్ ను సీఐడీ ప్రశ్నించింది.

నిన్న మరోసారి విచారణకు హాజరవ్వాలని సీఐడీ పోలీసులు నోటీసులు ఇచ్చారు. అయితే జోగి తరఫున ఆయన న్యాయవాదులు పోలీస్ స్టేషన్ కు వచ్చి ఆయన విచారణకు రాలేరని తెలిపారు. ఎప్పుడు పిలిచినా దర్యాప్తునకు సహకరిస్తానని కోర్టులో ముందస్తు బెయిల్‌ పొందిన ఆయన విచారణకు హాజరుకాకపోవడంపై పోలీసులు ఇతర మార్గాలను అన్వేషిస్తున్నారు.

మంగళవారం విచారణకు రావాలని, చంద్రబాబు ఇంటిపై దాడి జరిగిన రోజు వాడిన సెల్‌ఫోన్‌తో పాటు, ప్రస్తుత ఫోన్, సిమ్‌ కార్డులను అప్పగించాలని సీఐడీ దర్యాప్తు అధికారి డీఎస్పీ మురళీకృష్ణ నోటీసుల్లో పేర్కొన్నారు. ముందుగా మధ్యాహ్నం 2 నుంచి 4 గంటల మధ్య వస్తానని చెప్పిన జోగి రమేష్‌, తన న్యాయవాదులను పంపించారు. అయితే 2021లో వాడిన ఫోన్‌ ఇప్పుడు లేదని, సిమ్‌కార్డు అప్పటిదేన్నారు.

ప్రస్తుతం ఫోన్, సిమ్‌ కార్డు తనకు అవసరం కాబట్టి వాటిని పోలీసులకు అప్పగించలేనని లాయర్ల ద్వారా సమాచారం పంపారు. పోలీసులు సెల్ ఫోన్, సిమ్ కార్డు ఎందుకు అడుగుతున్నారో చెప్పాలని జోగి రమేష్ లాయర్లు పోలీసులను అడిగామన్నారు. జోగి రమేష్ విచారణకు సహకరిస్తారని, నోటీసులు ఉపసంహరించుకోవాలని కోరారు.

Whats_app_banner

సంబంధిత కథనం