AP Assembly Budget Session: పేదరిక నిర్మూలన ధ్యేయంగా నవరత్నాలను అమలు చేస్తున్నామన్న గవర్నర్ అబ్దుల్ నజీర్..
AP Assembly Budget Session: ఆంధ్రప్రదేశ్‌లో పేదరికాన్ని సమూలంగా నిర్మూలించడమే లక్ష్యంగా నవరత్నాలను అమలు చేస్తున్నట్లు గవర్నర్ అబ్దుల్ నజీర్ పేర్కొన్నారు. ఏపీ అసెంబ్లీ సమావేశాల ప్రారంభోత్సవంలో ప్రభుత్వం సాధించిన విజయాలను గవర్నర్ సుదీర్ఘంగా వివరించారు.
AP Assembly Budget Session: రాష్ట్రంలో తిరుగులేని ప్రజాదరణతో అధికారంలోకి వచ్చిన వెంటనే పేదరిక నిర్మూలనే ధ్యేయంగా సంక్షేమ పథకాలను అమలు చేస్తూ పాలన సాగించినట్టు గవర్నర్ అబ్దుల్ నజీర్ తెలిపారు.
ఏపీ అసెంబ్లీ ఓటాన్ అకౌంట్ బడ్జెట్ సమావేశాల సందర‌్భంగా ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగించారు. రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజల అభివృద్ధి ధ్యేయంగా, పేదరిక నిర్మూలన కోసం నాలుగేళ్ల బడ్జెట్ కేటాయింపులు చేసినట్టు చెప్పారు.
సమాజంలో అన్ని వర్గాల ప్రజల అభ్యున్నతి, అభివృద్ధి కోసమే నవరత్నాలను అమలు చేస్తున్నట్లు చెప్పారు. రాష్ట్రంలో 8,9 తరగతుల విద్యార్థులకు 9, 52, 925 ట్యాబ్‌లు పంపిణీ చేసినట్టు గవర్నర్ తెలిపారు. వచ్చే ఏడాది జూన్ నుంచి 1వ తరగతి నుంచి ఐబీ విధానంలో విద్యా బోధనకు వెళుతున్నట్టు చెప్పారు.
ప్రతి ఏటా ఒక తరగతికి ఐబీ విధానం పెంచుకుంటూ వెళ్తామన్నారు, విదేశాల్లో చదువుకునే విద్యార్థుల కోసం విదేశీ విద్యాదీవెన పథకం అమలు చేస్తున్నట్టు చెప్పారు. అత్యున్నత విద్యాసంస్థల్లో గుర్తించిన 21 ఫ్యాక్టరీలలో ఏ విభాగంలోనేనా విదేశీ విద్యను అభ్యసించవచ్చని వివరించారు. విద్య ప్రాధాన్యత గుర్తించి అమ్మఒడి మొదలుకుని ఎన్నో పథకాలు అమలు చేస్తున్నామన్నారు.
విదేశాల్లో చదువుకునే వారికి రూ. 1.25 కోట్లు వరకు మొత్తం ఫీజులు రీయింబర్స్ చేస్తున్నట్లు చెప్పారు. ప్రభుత్వ కృషితో స్కూళ్లలో డ్రాప్‌ఔట్‌లు గణనీయంగా తగ్గాయన్నారు. రాష్ట్రంలో ఉన్నత విద్యకు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నామని, 26.98 లక్షల మంది విద్యార్థులకు రూ. 11,901 కోట్లు ఫీజు రీయింబర్స్ చేశామన్నారు.
1 నుంచి 10 తరగతి వరకు జగనన్న గోరుముద్ద అమలు చేస్తున్నామని, పిల్లలకు నాణ్యమైన పౌష్టికాహారం అందిస్తున్నామన్నారు. ఇప్పటివరకూ గోరుముద్దకు రూ. 4,417 కోట్లు ఖర్చు చేశామన్నారుర. జగనన్న గోరుముద్ద కోసం ఏటా రూ. 1, 910 కోట్లు ఖర్చు చేస్తున్నామని చెప్పారు.
జగనన్న విద్యాకానుక కోసం ఇప్పటివరకూ రూ. 3, 367 కోట్లు ఖర్చు చేశామని, విద్యాసంస్కరణల్లో డిజిటల్ లెర్నింగ్ కీలకమైనదని గవర్నర్ పేర్కొన్నారు. ప్రభుత్వం ఇప్పటివరకూ నాలుగు బడ్జెట్లు ప్రవేశపెట్టిందని సామాజిక న్యాయం, సమానత్వం కోసం ప్రభుత్వం పని చేస్తోందన్నారు.
సామాజిక సమానత్వం కోసం విజయవాడలో భారీ అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించామని చెప్పారు. నగరం నడిబొడ్డున అంబేద్కర్ విగ్రహం ఏర్పాటు అభినందనీయమని, బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి ప్రభుత్వం కట్టుబడి ఉందని చెప్పారు. తమది పేదల ప్రభుత్వమని, ప్రజల జీవన ప్రమాణాల మెరుగుకు కృషి చేస్తున్నామని చెప్పారు.
నవరత్నాల ద్వారా పేదరిక నిర్మూలనకు ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. నాణ్యమైన విద్య అందించేందుకు ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉందని, దేశంలోనే ఎక్కడా లేని విధంగా విద్యా సంస్కరణలు అమలు చేస్తున్ామని చెప్పారు. పేద పిల్లలకు గ్లోబల్ ఎడ్యుకేషన్ అందిస్తున్నామని, మనబడి నాడు-నేడు ద్వారా స్కూళ్ల రూపరేఖలు మార్చామని చెప్పారు. విద్యారంగంపై ఇప్పటి వరకు రూ. 73, 417 కోట్లు ఖర్చు చేశామని చెప్పారు.
టీడీపీ అభ్యంతరం…
గవర్నర్ ప్రసంగంపై టీడీపీ సభ్యులు అభ్యంతరం తెలిపారు. ప్రసంగిస్తున్నంత సేపు సభలో నినాదాలు చేశారు. నాడు, నేడు పథకం బూటకమన్నారు. విద్యాదీవెన కింద పూర్తి రీయింబర్స్‌మెంట్ ఇచ్చామనడంపై అభ్యంతరం తెలిపారు. మెగా డీఎస్సీ కాదు.. దగా డీఎస్సీ అంటూ టీడీపీ ఎమ్మెల్యేలు నినాదాలు చేశారు. నాడు-నేడు కాదు.. అంతా అధ్వానమే అంటూ కామెంట్స్ చేశారు.
ఏపీ అసెంబ్లీ దగ్గర ఉద్రిక్తత
అసెంబ్లీ సమావేశాల ప్రారంభం సందర్భంగా అసెంబ్లీ ఎదుట టీడీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు నిరసన తెలిపారు. జాబ్ క్యాలెండర్‍ను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ప్లకార్డ్స్ పట్టుకుని నిరసన తెలుపుతున్న టీడీపీ ఎమ్మెల్యేలను బారికేడ్స్ పెట్టి అడ్డుకున్నారు.
దీంతో పోలీసులు, టీడీపీ ఎమ్మెల్యేలకు మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. - పోలీసుల తీరుపైఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు, గోరంట్ల బుచ్చయ్యచౌదరి, నందమూరి బాలకృష్ణ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్టీఆర్ విగ్రహానికి నివాళులు అర్పించిన టీడీపీ నేతలు- ర్యాలీగా అసెంబ్లీకి వచ్చారు.