Pregnant Suicide: విజయవాడలో ఘోరం… కడుపులో ఆడబిడ్డని చంపుకోలేక ఐదు నెలల గర్భిణీ ఆత్మహత్య
Pregnant Suicide: రెండో కాన్పులో ఆడబిడ్డను కనడానికి వీల్లేదని భర్త ఒత్తిడి చేయడంతో కడుపులో బిడ్డను చంపుకోలేక ఐదు నెలల గర్భిణీ ఆత్మహత్యకు పాల్పడింది. విజయవాడ శివార్లలో ఈ ఘోరం వెలుగు చూసింది.
Pregnant Suicide: విజయవాడలో వార్డు సచివాలయ ఉద్యోగి కిరాతకానికి భార్య బలైపోయింది. ఆడబిడ్డ పుట్టబోతుందని తెలిసి అబార్షన్ చేసుకోవాలని వేధించడంతో భరించలేక ప్రాణాలు తీసుకుంది.
రెండో కాన్పులో కూడా ఆడపిల్ల పుట్టబోతుందని స్కానింగ్‌లో తెలుసుకున్న భర్త, అత్త మామలు అబార్షన్ చేయించుకోవాలని వేధించారు. ఐదు నెలలు దాటిన పిండానికి అబార్షన్ చేయడం తల్లి ప్రాణాలకు కూడా ప్రమాదమని వైద్యులు వారించినా భర్త వేధింపులు కొనసాగించడంతో ఆమె ప్రాణాలు తీసుకుంది.
విజయవాడ యనమలకుదురుకు చెందిన కావ్య శ్రీ ప్రస్తుతం ఐదు నెలల గర్భంతో ఉంది. ఆదివారం కావ్యశ్రీ పుట్టింట్లో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ఆమెకు మొదటి కాన్పులో ఆడపిల్లకు పుట్టింది. రెండోసారి కూడా గర్భంలో ఆడపిల్లగా నిర్ధారణ కావడంతో అబార్షన్ కోసం అత్తింటి వారు వేధించారు.
కొద్ది రోజుల క్రితం విజయవాడలో స్కానింగ్ చేయించిన భర్త శ్రీకాంత్.. ఆడపిల్లగా నిర్ధారణ కావడంతో అబార్షన్ చేయించు కోవాలని ఆమెపై ఒత్తిడి చేశాడు. కడుపులో పిండాన్ని చంపడం తనకు ఇష్టం లేదని కావ్యశ్రీ భర్తకు నచ్చచెప్పే ప్రయత్నం చేసింది. విజయవాడ పాతపాడు సచివాలయంలో ప్లానింగ్ సెక్రటరీగా విధులు నిర్వర్తించే భర్త శ్రీకాంత్ అతని తల్లిదండ్రులు రెండోసారి ఆడపిల్లకు ఒప్పుకునేది లేదని తేల్చి చెప్పారు.
శ్రీకాంత్‌కు పరిచయస్తుడైన శ్యామ్ అనే కానిస్టేబుల్ సాయంతో స్కానింగ్ సెంటర్‌కు తీసుకెళ్లి ఆడబిడ్డగా నిర్ధారణ చేసుకున్నారని కావ్యశ్రీ బంధువులు ఆరోపిస్తున్నారు. మూడు రోజుల క్రితం స్నేహితుడు సాయంతో విజయవాడలోని ఓ ఆసుపత్రికి తీసుకువెళ్లి స్కానింగ్ చేయించడంతో ఆడపిల్లని స్పష్టం కావడంతో అబార్షన్ కోసం ఒత్తిడి చేస్తున్నట్టు వివరించారు.
కడుపులో ఉన్నది ఆడపిల్లని తెలిసినప్పటి నుంచి భర్త, అత్తింటి వేధింపులు తీవ్రం అయ్యాయి. వారసుడి కోసం అబార్షన్ చేయించు కోవాలంటూ ఒత్తిడి చేశారని, రెండుసార్లు బలవంతంగా ఆసుపత్రికి తీసుకెళ్లినా తమ కుమార్తె అందుకు అంగీకరించలేదని చెబుతున్నారు. అత్తింటి వేధింపులు తాళలేక కావ్యశ్రీ యనమలకుదురులోని పుట్టింటికి వచ్చేసింది.
ఆదివారం అబార్షన్‌కు ఒప్పించేందుకు శ్రీకాంత్ యనమలకుదురు వెళ్లాడు. ఇరువురి మధ్య మరోసారి వాగ్వాదం జరిగింది. స్నానానికి వెళుతున్నానని చెప్పి బాత్‌రూమ్‌కు వెళ్లిన కావ్యశ్రీ ఉరి వేసుకుంది.
ఆమె ఎంత సేపటికి బయటకు రాకపోవడంతో శ్రీకాంత్, కావ్య తల్లిదండ్రులు బాత్రూమ్ తలుపులు పగల గొట్టి చూస్తే వెంటిలేటర్ రాడ్‌కు చున్నీతో ఉరేసుకొని వేలాడు కనిపించింది. వెంటనే విజయవాడ పటమటలోని ఓ ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ మృతి చెందింది.
అబార్షన్ కోసం భర్త, అత్తింటి వారు అబార్షన్ చేయించుకోవాలంటూ ఒత్తిడి చేయడంతోనే బలవన్మరణానికి పాల్పడినట్టు కావ్యశ్రీ తండ్రి రాజా ఫిర్యాదు చేశారు. భర్త శ్రీకాంత్, అత్త వెంకటేశ్వరమ్మ, మామ లక్ష్మణరావులపై పోలీసులు కేసు నమోదు చేశారు. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసినట్లు సీఐ టీవీవీ రామారావు తెలిపారు.
ఆత్మహత్యకు ముందు భర్త ఫోన్‌కు మెసేజ్ చేసిన కావ్య శ్రీ.. వారసుడిని ఇవ్వలేనంటూ మెసేజ్ చేసింది. తన కుమార్తెను కూడా తల్లిదండ్రులకే అప్పగించాలని అందులో పేర్కొంది. కేసు నమోదు చేసిన పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉయ్యూరు ప్రభుత్వ ఆసుపత్రులకు తరలించారు.