Dwaraka Tirumala : నేటినుంచి ద్వారకా తిరుమలలో తిరుకల్యాణ ఉత్సవాలు.. 16న కోనసీమలో విజయబేతాళ మహోత్సవం
Dwaraka Tirumala : ద్వారకా తిరుమలలో వెంకటేశ్వరస్వామి ఆశ్వయుజమాస దివ్య తిరుకల్యాణ ఉత్సవాలను.. వైభవంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇవాళ్టి నుంచి నుంచి అక్టోబర్ 20 వరకు ఈ ఉత్సవాలు జరగనున్నాయి. భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లు చేసినట్లు ఆలయ అధికారులు చెప్పారు.
పశ్చిమగోదావరి జిల్లాలో చిన తిరుపతిగా పేరొందిన ద్వారకా తిరుమల విశిష్ట, పవిత్రమైన చారిత్రక పుణ్యక్షేత్రం. భక్తుల తాకిడి నిరంతరం ఉంటుంది. వేలాది మంది భక్తులు స్వామివారిని దర్శించుకుంటారు. కాలినడకన వచ్చి స్వామివారి అనుగ్రహం కోసం ప్రత్యేక పూజులు చేస్తారు. ఈ పుణ్యక్షేత్రంలో ఇవాళ్టి నుంచి 20 వరకు వెంకటేశ్వరస్వామి ఆశ్వయుజ మాస తిరుకల్యాణ ఉత్సవాలు జరగనున్నాయి. ద్వారకా తిరుమల చిన వెంకన్న ఆశ్వయుజమాస తిరు కల్యాణోత్సవాలకు శేషాచలం ముస్తాబైంది.
వైఖాన ఆగమాన్ని అనుసరించి పాంచాహ్నిక దీక్షతో ఉత్సవాలను నిర్వహిస్తారు. ఉత్సవాలు జరిగే రోజుల్లో శ్రీవారికి ఉదయం, సాయంత్రం వేళల్లో గ్రామోత్సవాలు జరుపుతారు. ఆశ్వయుజ మాస తిరుకల్యాణ ఉత్సవాలను పురస్కరించుకుని ఆయా రోజుల్లో ఆలయంలో స్వామివారి నిత్యార్జిత కల్యాణాలు, ఆర్జీత సేవలు రద్దు చేశారు. అక్టోబర్ 17న తిరుకల్యాణం, అక్టోబర్ 18న రథోత్సవం జరుగుతోంది.
ఆదివారం స్వామి, అమ్మవార్లను వధూవరులను చేయడంతో ఉత్సవాలు ప్రారంభమవుతాయి. రాత్రి ఏడు గంటలకు గజ వాహనంపై శ్రీవారి గ్రామోత్సవం ఉంటుంది. అక్టోబర్ 14న ధ్వజారోహణ చేస్తారు. అదే రోజు రాత్రి తొమ్మిది గంటలకు శేష వాహనంపై గ్రామోత్సవం ఉంటుంది. 16న ఉదయం ఏడు గంటలకు సూర్య ప్రభ వాహనంపై గ్రామోత్సవం, రాత్రి ఏడు గంటలకు ఎదుర్కోలు ఉత్సవం జరుగుతోంది.
అక్టోబర్ 17న రాత్రి ఎనిమిది గంటల నుంచి స్వామివారి తిరుకల్యాణ మహోత్సవం, అనంతరం వెండి గరుగ వాహనంపై గ్రామోత్సవం ఉంటుంది. అక్టోబర్ 18న రాత్రి ఏడు గంటలకు రథోత్సవం, అక్టోబర్ 19 ఉదయం ఏడు గంటలకు చక్రస్నానం, రాత్రి ఏడు గంటలకు శ్రీవారి ధ్వజావరోహణ జరుగుతాయి. అక్టోబర్ 20న ఉదయం తొమ్మిది గంటలకు చూర్ణోత్సవం, వసంతోత్సవం, రాత్రి ఏడు గంటలకు ద్వాదశ కోవెల ప్రదక్షిణలు, పవళింపు సేవ, శ్రీపుష్పయాగంతో ఉత్సవాలు ముగుస్తాయి.
కోనసీమలో..
కోనసీమ పచ్చదనానికి, ఆహ్లాదకరమైన వాతావరణానికి చిరునామా. అలాగే సంస్కృతి, సాంప్రదాయాలకు నిలయం. కోనసీమ జిల్లా అంబాజీపేట అనగానే వెంటనే గుర్తుకు వచ్చేది జగ్గన్నతోట సంక్రాంతి ప్రభల తీర్థం. అయితే ఇక్కడ దసరా ఉత్సవాల ముగింపు సందర్భంగా మరొక విశేషమైన ఉత్సవం కూడా నిర్వహిస్తారు. అంబాజీపేటలో విజయబేతాళస్వామి మహోత్సవం అంగరంగవైభవంగా జరుగుతుంది. 13 ప్రాతాల నుంచి వచ్చిన 13 వాహనాలను ఒకచోట కలిపే అపురూప దృశ్యం ఈనెల 16న అంబాజీపేటలో ఆవిష్కృతం కానుంది.
13 దేవుని ప్రతిరూపాలతో కూడిన వాహనాల ఊరేగింపు విజయదశమి తరువాత అంబాజీపేటలో కనువిందు చేయనుంది. దసరా పురస్కరించుకుని బేతాళస్వామి వాహన మహోత్సవాన్ని నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. ఇందులో భాగంగా అంబాజీపేటలో ఈనెల 16 (బుధవారం)న ఉత్సవం నిర్వహించనున్నారు. లక్ష్యాన్ని సాధించడానికి బేతాళుడిని పూజించటం అనేది అనాదిగా వస్తున్న సంప్రదాయం. రంగూన్, బర్మా (మయన్మార్)లో బేతాళుడి ఉత్సవాలు నిర్వహిస్తారు. ఆయా ప్రాంతాలకు వెళ్లిన కొందరు పూర్వీకులు ఇక్కడ 58 ఏళ్లుగా విజయబేతాళ వాహన మహోత్సవాలు నిర్వహిస్తున్నారు.
అంబాజీపేటలో 1967లో ఏర్పాటైన శెట్టిబలిజ అభ్యుదయ సంక్షేమ సంఘం, ఉత్సవ కమిటీల ఆధ్వర్యంలో ఐదు దశాబ్దాలకుపైగా వాహన మహోత్సవాలు నిర్వహిస్తున్నారు. విజయబేతాళస్వామి ఆలయాన్ని 30 ఏళ్ల కిందట నిర్మించారు. 13 ప్రాంతాల నుంచి సుందరంగా అలంకరించిన 13 ప్రత్యేక వాహనాలపై దేవుని విగ్రహాలను ఉంచి.. ఆయా ప్రాంతాలకు చెందిన ప్రజలు ఊరేగింపుగా అంబాజీపేట కూడలికి తీసుకొస్తారు.
విద్యుత్ దీపాలతో అత్యంత సుందరంగా అలంకరించిన దేవుళ్ల విగ్రహాలను వాహనాలపై అమర్చి ఆయా ప్రాతాల నుంచి బ్యాండు మేళాలు, డప్పులు, మంగళ వాయిద్యాలు, గరగ నృత్యాలు, చెడీ తాళింఖానా నడుమ వాహన మహోత్సవం సాగుతుంది. ఈ ఉత్సవంలో చెడీ తాళింఖానా ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. ఈ దృశ్యాలను తిలకించేందుకు వేలాది మంది ప్రజలు అర్ధరాత్రి వరకు వేచి చూస్తుంటారు.
అంబాజీపేటలోని శ్రీనివాస నగర్ నుంచి గరుత్మంతుడు, పెచ్చెట్టివారిపాలెం నుంచి గరుత్మంతుడు, మాచవరం శ్రీరామ నగర్ నుంచి విజయదుర్గమ్మ, దొమ్మేటివారిపాలెం పోస్టువీధి నుంచి కృష్ణుడు, దొమ్మేటివారి పాలెం మహిళల ఆసుపత్రి వీధి నుంచి ఆంజనేయ స్వామి, పోతాయిలంక నుంచి ఆంజనేయస్వామి, గంగలకుర్రు మలుపు నుంచి విజయగణపతి స్వామి, మాచవరం ఇటికాలమ్మ వారిపాలెం నుంచి రాజహంస, కొత్తపాలెం నుంచి హంస, చప్పిడివారి పాలెం నుంచి షిర్డీ సాయిబాబా, గుత్తులవారి పాలెం నుంచి సింహ వాహనం, నందంపూడి నుంచి రాజరాజేశ్వరీ అమ్మవారు, శ్రీనివాసనగర్ నుంచి ఏనుగు విగ్రహాలను ప్రత్యేకంగా అలంకరించి ఉత్సవం జరిగే ప్రాంతానికి తీసుకొస్తారు. 16వ తేదీ మధ్యాహ్నం నుంచి మరుసటి రోజు ఉదయం వరకు విజయబేతాళస్వామి వారి తీర్థం జరుగుతుంది.
పూర్వ కాలం నుంచి ఏనుగుల సంబరం..
ద్రాక్షారామ దసరా ఉత్సవాలకు ఏనుగుల సంబరం అనే పేరు కూడా ఉంది. సాక్షివారి వీధి, బుర్రావీధి, కర్రివారి వీధిల్లో బుధవారం జరగనున్న గజరాజ వాహన వేడుకలకు ఏర్పాట్లు ముమ్మరంగా జరుగుతున్నాయి. ఈ వాహనాలను విద్యుత్తు దీపాలతో సుందరంగా అలంకరిస్తున్నారు. వెలంపాలెం గోగులాంబ వీధిలో నిర్వహించే ఉత్సవాలను చిన్న ఏనుగుల సంబరంగా పిలుస్తారు. ద్రాక్షారామలో పూర్వం నుంచి కూడా ఈ ఏనుగుల సంబరం ఏటా నిర్వహించటం ఆనవాయితీగా వస్తోంది. ఇందుకు మూడు ఏనుగులను సిద్ధం చేయగా, ఒక్కో ఏనుగుకి సుమారు రూ.3 లక్షల వరకు ఖర్చు చేస్తారని నిర్వాహకులు తెలిపారు.
(రిపోర్టింగ్- జగదీశ్వరరావు జరజాపు, హిందుస్తాన్ టైమ్స్ తెలుగు)