Hacks: ఇంట్లో పాలరాతి, కలపతో చేసిన దేవుని గుడి ఉందా? ఇలా శుభ్రం చేస్తే మెరిసిపోతుంది-how to deep clean marble or wooden pooja room ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Hacks: ఇంట్లో పాలరాతి, కలపతో చేసిన దేవుని గుడి ఉందా? ఇలా శుభ్రం చేస్తే మెరిసిపోతుంది

Hacks: ఇంట్లో పాలరాతి, కలపతో చేసిన దేవుని గుడి ఉందా? ఇలా శుభ్రం చేస్తే మెరిసిపోతుంది

Koutik Pranaya Sree HT Telugu
Sep 30, 2024 12:30 PM IST

Hacks: పండగలకు ముందు ఇంటి ఆలయాన్ని శుభ్రం చేయడం అవసరం. దుమ్ముతో పాటు దీపం పొగతో వచ్చే నల్లటి మరకలు జిడ్డుగా కనిపించేలా చేస్తాయి. మీ ఇంట్లో దేవుని ఆలయాన్ని కొత్తగా మార్చే కొన్ని చిట్కాలను తెలుసుకుందాం.

పూజగది మెరిపించే చిట్కాలు
పూజగది మెరిపించే చిట్కాలు (Shutterstock)

చాలా మంది ఇళ్లలో పాలరాతి లేదా కలపతో చేసిన దేవుడి గుడి ఉంటుంది. ఇవి దుమ్ము, ధూళి, దీపాల పొగ, నూనె కారణంగా మురికిగా మారతాయి. అందువల్ల రోజువారీ శుభ్రతతో పాటే పండుగల సమయంలో కాస్త ప్రత్యేక శుభ్రత అవసరం. మీ ఆలయాన్ని కొత్తగా , పాలిష్ చేసినట్లు మెరిసేలా చేసే చిట్కాలు తెల్సుకోండి.

yearly horoscope entry point

డిష్ వాష్:

పాలరాతితో చేసిన దేవుడి గుడి ఉంటే దాన్ని పాలిష్ చేయడానికి మీరు డిష్ వాష్ లిక్విడ్ వాడొచ్చు. ముందుగా గుడి మీద దుమ్మును పొడి వస్త్రం సాయంతో శుభ్రం చేయాలి. ఇప్పుడు డీప్ క్లీనింగ్ చేయాలి. దానికోసం ఒక పెద్ద గిన్నెలో కొద్దిగా డిష్ వాష్ లిక్విడ్ తీసుకుని అందులో సగం చెక్క నిమ్మరసం పిండాలి. ఇప్పుడు అందులో ఒక స్క్రబ్బర్ ను ముంచి ఆలయ పాలరాతిని రుద్ది శుభ్రం చేయాలి. మరకలన్నీ తొలగిపోయిన తర్వాత పాలరాతిని శుభ్రమైన గుడ్డతో బాగా తుడవాలి. మీ ఆలయం పూర్తిగా పరిశుభ్రంగా మారిపోతుంది చూడండి..

ఆలివ్ నూనె:

చెక్కతో చేసిన ఆలయాన్ని సరికొత్తగా, శుభ్రంగా చేయడానికి ఆలివ్ నూనెను ఉపయోగించవచ్చు. ఇందుకోసం ముందుగా కలపతో చేసిన గుడిపై పేరుకుపోయిన దుమ్ము, ధూళిని శుభ్రమైన గుడ్డతో తుడవాలి. దీని తరువాత, ఆలివ్ నూనెను ఆలయం వెలుపల, లోపలి భాగంలో అప్లై చేసి 5 నిమిషాలు అలాగే ఉంచండి. 5 నిమిషాల తర్వాత శుభ్రమైన కాటన్ వస్త్రంతో రుద్దుతూ తుడవండి. కొత్తగా పాలిషింగ్ చేసినట్లు మెరిసిపోతుంది.

హ్యాండ్ వాష్:

పాలరాతి ఆలయాన్ని పాలిష్ చేయడానికి హ్యాండ్ వాష్ లిక్విడ్ కూడా ఉపయోగించవచ్చు. దీని కోసం ఒక గిన్నెలో రెండు చెంచాల హ్యాండ్ వాష్ తీసుకోండి. ఆ తర్వాత ఒక చెక్క నిమ్మరసం, ఒక టీస్పూన్ బేకింగ్ సోడా వేసి చిక్కటి పేస్ట్ లా తయారుచేసుకోవాలి. ఆ తర్వాత ఈ పేస్ట్ ను ఆలయ పాలరాతిపై అప్లై చేయాలి. ఇప్పుడు పాలరాతిని స్క్రబ్బర్ సహాయంతో రుద్ది ఆ తర్వాత గోరువెచ్చని నీటితో బాగా కడగాలి. ఈ విధంగా పాలరాతి కొత్తగా మెరిసిపోతుంది.

స్యాండ్ పేపర్:

చెక్క ఆలయంపై ఉన్న దుమ్ము, జిడ్డును శుభ్రం చేయడానికి స్యాండ్ పేపర్ కూడా ఉపయోగించవచ్చు. స్యాండ్ పేపర్ ఒక వైపు రఫ్‌గా ఉంటుంది. అటువైపునే వాడి రుద్దినప్పుడు చెక్క ఫర్నిచర్ పై మురికి తొలిగిపోతుంది. అయితే ఆలయానికి పాలిషింగ్ ఏమైనా ఉంటే శ్యాండ్ పేపర్ వాడకండి. ఇది పాలిష్ తొలిగించి మరిన్ని గీతలు చేస్తుంది. లేదంటే జిడ్డును తొలగించడానికి మాత్రం ఇది పక్కగా పనిచేసే చిట్కా.

Whats_app_banner