Konaseema Crime : కోనసీమ జిల్లాలో దారుణం, ఉపాధి కోసం గల్ఫ్‌కెళ్లిన కొడుకు-కోడలిపై మామ లైంగిక దాడి
Konaseema Crime : కోనసీమ జిల్లాలో దారుణ ఘటన చోటుచేసుకుంది. కొడుకు గల్ఫ్ లో ఉపాధి వెళ్లగా...కోడలిపై కన్నేసిన మామ పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డాడు. మామ లైంగిక వేధింపులు తట్టుకోలేక కోడలు పోలీసులను ఆశ్రయించింది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Konaseema Crime : అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో దారుణ ఘటన చోటుచేసుకుంది. ఉపాధి కోసం కొడుకు గల్ఫ్‌కు వెళ్తే, కోడలిపై కన్నేసిన మామ అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ విషయం ఎవరికైన చెబితే చంపేస్తానని కోడలిని బెదిరించాడు. అయితే మామ లైంగిక వేధింపులు ఎక్కువ అవ్వడంతో భరించలేక కోడలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు మామపై కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు. ఈ నెల 20న జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
అంబేడ్కర్ కోనసీమ జిల్లా రాజోలు మండలంలోని ఓ గ్రామంలో ఈ ఘటన చోటు చేసుకుంది. వెంకటరమణ తన భార్య, ఇద్దరు పిల్లలను తన తండ్రి కుమారస్వామి వద్ద వదిలి ఉపాధి కోసం గల్ఫ్ వెళ్లాడు. వెంకటరమణ తల్లి కూడా కొడుకుతో పాటు గల్ఫ్‌కు వెళ్లడంతో కోడలు తన పిల్లలు ఇద్దరితో కలిసి మావయ్య ఇంటి వద్ద ఉంటోంది. దీంతో కోడలిపై మామ కన్నేసి లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు.
ఆమె మానసిక స్థితి గత కొంతకాలంగా బాగోకపోవడంతో చికిత్స పొందుతోంది. ఆమె ఆరోగ్యం, ఒంటరితనాన్ని అలుసుగా తీసుకున్న మావ కుమారస్వామి పలుమార్లు లైంగిక దాడికి పాల్పడ్డాడు. లైంగిక వేధింపుల విషయాన్ని ఎవరికైనా చెబితే చంపేస్తానని బెదిరించాడు. ఇటీవల ఆమె కోలుకున్న తరువాత కూడా కుమారస్వామి లైంగిక వేధింపులు ప్రారంభించాడు. ఇంకా మామ ఆగడాలను భరించలేని కోడలు ఈనెల 20న రాజోలు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. దీంతో కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్లు రాజోలు ఎస్ఐ రాజేష్ కుమార్ తెలిపారు.
మరణంలోనూ వీడని బంధం...గంటల వ్యవధిలోనే భార్యాభర్తలు మృతి
కోనసీమ జిల్లాలో తీవ్ర విషాదం నెలకొంది. మరణంలోనూ భార్యాభర్తలు బంధం వీడలేదు. గంటల వ్యవధిలోనే భార్యభర్తలు మృతి చెందారు. దీంతో ఆ గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరు అయ్యారు. జీవితాంతం తోడుంటానని పెళ్లి రోజున బాసలు చేసిన భర్త అర్ధాంతరంగా మృతి చెందడంతో తట్టుకోలేని భార్య గంటల వ్యవధిలోనే మృతి చెందింది.
ఈ విషాద ఘటన కోనసీమ జిల్లా ముమ్మిడివరం మండలం పళ్లవారిపాలెంలో శనివారం చోటు చేసుకుంది. ఆ గ్రామానికి చెందిన పోలిశెట్టి ఆదిచంద్రరావు (68) అనారోగ్యం కారణంగా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శనివారం మృతి చెందారు. భర్త మరణ వార్త తెలుసుకున్న భార్య నాగవేణి (58) తీవ్ర మనస్థాపానికి గురై గంటల వ్యవధిలోనే మృతి చెందారు. వీరికి కుమారుడు, కుమార్తె ఉన్నారు. భార్యాభర్తలిద్దరూ ఇలా మృతి చెందడంతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి. బంధువులు కన్నీరు మున్నీరు అయ్యారు.
జగదీశ్వరరావు జరజాపు, హిందుస్తాన్ టైమ్స్ తెలుగు