Tirumala Brahmotsavam : తిరుమల శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాల ప్రారంభానికి ముందు అపశృతి.. ఖండించిన టీటీడీ-discord before the start of the annual brahmotsavam of tirumala lord venkateswara ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Tirumala Brahmotsavam : తిరుమల శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాల ప్రారంభానికి ముందు అపశృతి.. ఖండించిన టీటీడీ

Tirumala Brahmotsavam : తిరుమల శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాల ప్రారంభానికి ముందు అపశృతి.. ఖండించిన టీటీడీ

Basani Shiva Kumar HT Telugu
Oct 04, 2024 06:08 PM IST

Tirumala Brahmotsavam : తిరుమల శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాల ప్రారంభానికి ముందే అపశ్రుతి జరిగింది. ధ్వజస్తంభం ఇనుప కొక్కి విరిగిపోయింది. దీంతో ధ్వజస్తంభం మరమ్మతు పనులను చేపట్టారు టీటీడీ అధికారులు. ఇవాళ సీఎం చంద్రబాబు దంపతులు శ్రీవారికి పట్టువస్త్రాలు సమర్పించనున్నారు.

బ్రహ్మోత్సవాల ప్రారంభానికి ముందు అపశృతి
బ్రహ్మోత్సవాల ప్రారంభానికి ముందు అపశృతి

తిరుమల తిరుపతి దేవస్థానంలో శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాల ప్రారంభానికి ముందే.. అపశ్రుతి జరిగింది. శ్రీవారి ఆలయం ముందున్న ధ్వజస్తంభం ఇనుప కొక్కి విరిగిపోయింది. ఇవాళ సాయంత్రం తిరుమలలో బ్రహ్మోత్సవాల్లో భాగంగా ధ్వజారోహణం జరగనుంది. ఈ సమయంలో ఇనుప కొక్కి విరిగిపోయింది. గరుడపటాన్ని ఎగురవేయాల్సిన కొక్కి విరిగిపోవడంతో.. అధికారుల చర్యలు చేపట్టారు. ధ్వజస్తంభం మరమ్మతు పనులు చేపట్టారు.

ఖండించిన టీటీడీ..

అయితే.. తిరుమలలో ఎలాంటి అపశ్రుతి జరగలేదని టీటీడీ స్పష్టం చేసింది. పాత వాటి స్థానంలో కొత్తవి అమర్చారని తెలిపింది. అంతలోనే అపశ్రుతి అంటూ సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేశారని వివరించింది. భక్తులు ఇలాంటి వదంతులను నమ్మొద్దని విజ్ఞప్తి చేసింది.

శ్రీ‌వారి సాలికట్ల బ్ర‌హ్మోత్స‌వాల‌కు తిరుమల సిద్ధమైంది. ధ్వజారోహణంతో ఇవాళ బ్రహ్మోత్సవాలను ప్రారంభించనున్నారు. చంద్రబాబు దంపతులు శ్రీవారికి ప‌ట్టువ‌స్త్రాల స‌మ‌ర్ప‌ించనున్నారు. మరోవైపు బ్రహ్మోత్సవాల నిర్వహణకు టీటీడీ విస్తృత ఏర్పాట్లు చేసింది. రోజుకు సగటున 80వేల మంది భక్తులు స్వామి వారిని దర్శించుకునేలా ఏర్పాట్లు చేశారు. అన్ని రకాల ఆర్జిత సేవలు, విఐపి సిఫార్సు దర్శనాలు రద్దు చేశారు.

సాయంత్రం 5.45 నుండి 6 గంటల మధ్య మీన లగ్నంలో శాస్త్రోక్తంగా ధ్వజారోహణం నిర్వహిస్తారు. బ్రహ్మోత్సవాలు ధ్వజారోహణంతో ప్రారంభమవుతాయి. శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ మలయప్పస్వామివారి సమక్షంలో వేదగానాల మధ్య మంగళవాద్యాలు మోగుతుండగా అర్చకస్వాములు బంగారు ధ్వజస్తంభంపై గరుడధ్వజాన్ని ఎగురవేస్తారు.

ఈ కార్యక్రమం ద్వారా సకల దేవతలను, అష్టదిక్పాలకులను బ్రహ్మోత్సవాలకు ఆహ్వానిస్తారు. ఆ తరువాత రాత్రి 9 నుండి 11 గంటల వ‌ర‌కు పెద్దశేషవాహన సేవ జరుగుతుంది. శుక్రవారం సాయంత్రం ముఖ్యమంత్రి చంద్రబాబు స్వామివారికి పట్టువస్త్రాలు సమర్పిస్తారు. ముఖ్యమంత్రి రెండు రోజుల పాటు తిరుమలలో ఉంటారు. శనివారం కూడా పలు కార్యక్రమాల్లో పాల్గొంటారని ఈవో వివరించారు.

బ్రహ్మోత్సవాల్లో సీఎం దర్శనానందరం టీటీడీ 2025 క్యాలెండర్లు, డైరీలను ఆవిష్కరించనున్నారు. శనివారం అక్టోబర్ 5వ తేదీ నుంచి తిరుపతి, తిరుమలలోని టీటీడీ విక్రయ కేంద్రాల్లో క్యాలెండర్లు, డైరీలు భక్తులకు అందుబాటులో ఉంటాయి. బ్రహ్మోత్సవాల సందర్భంగా 1.32 లక్షల మందికి రూ.300 దర్శన టికెట్లు ఆన్లైన్లో అందుబాటులో ఉంచారు. రోజూ 24వేల సర్వదర్శనం స్లాట్లను కేటాయించనున్నారు.

శ్రీవాణి దర్శన టికెట్ల కరెంట్ బుకింగ్ ఈనెల 4, 8వ తేదీలలో రద్దు చేశారు. మిగిలిన రోజుల్లో శ్రీవాణి టిక్కెట్లు అందుబాటులో ఉంటాయి. తిరుమలలో 40 వేల మంది భక్తులు బసచేసే అవకాశం ఉంది. వసతి సముదాయాలు 1, 2, 3, 4తో కలిపి 28 హాళ్లు, 670 వరకు లాకర్లు ఉన్నాయి. వీటిలో మరో 20 వేల మంది భక్తులు వీటిలో బస చేయవచ్చని ఈవో వివరించారు.

శ్రీవారి బ్రహ్మోత్సవాలకు విచ్చేసే భక్తులకు విశేష సేవలు అందించాలని, విధులను నిర్వర్తించడంతో పాటు, డిప్యూటేషన్ సిబ్బంది తమ పరిసరాలపై నిఘా ఉంచి, అప్రమత్తంగా ఉండాలని, సమస్యను పరిష్కరించడంలో ప్రముఖ పాత్ర పోషించాలని టీటీడీ ఈవో శ్యామలరావు సూచించారు.

తిరుమల ఆస్థాన మండపంలో గురువారం సాయంత్రం బ్రహ్మోత్సవాల విధులకు హాజరైన ఉద్యోగులను ఉద్దేశించి ఈవో మాట్లాడుతూ.. శ్రీవారి బ్రహ్మోత్సవాలను నిర్వహించేందుకు పోలీసులు, జిల్లా యంత్రాంగంతో టీటీడీ డిప్యూటేషన్ సిబ్బంది సమన్వయంతో పని చేయాలని ఉద్యోగులకు పిలుపునిచ్చారు.

Whats_app_banner