Phone Tapping Case : ఫోన్ ట్యాపింగ్ కేసులో బీఆర్ఎస్ హస్తం, సొంత పార్టీ నేతలపైనా నిఘా-రాధా కృష్ణరావు వాంగ్మూలం!-hyderabad phone tapping case ex dcp radhakishan rao revealed brs party role key names limelight ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Phone Tapping Case : ఫోన్ ట్యాపింగ్ కేసులో బీఆర్ఎస్ హస్తం, సొంత పార్టీ నేతలపైనా నిఘా-రాధా కృష్ణరావు వాంగ్మూలం!

Phone Tapping Case : ఫోన్ ట్యాపింగ్ కేసులో బీఆర్ఎస్ హస్తం, సొంత పార్టీ నేతలపైనా నిఘా-రాధా కృష్ణరావు వాంగ్మూలం!

Bandaru Satyaprasad HT Telugu
May 27, 2024 10:04 PM IST

Phone Tapping Case : తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ కేసు ప్రకంపనలు సృష్టిస్తోంది. ఈ కేసులో బీఆర్ఎస్ పార్టీ హస్తం ఉందని టాస్క్ ఫోర్స్ మాజీ డీసీపీ రాధా కృష్ణరావు వాంగ్మూలం ఇచ్చారు.

ఫోన్ ట్యాపింగ్ కేసులో బీఆర్ఎస్ హస్తం, సొంత పార్టీ నేతలపైనా నిఘా
ఫోన్ ట్యాపింగ్ కేసులో బీఆర్ఎస్ హస్తం, సొంత పార్టీ నేతలపైనా నిఘా

Phone Tapping Case : తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ కేసు మరోసారి తెరపైకి వచ్చింది. ఫోన్ ట్యాపింగ్ కేసులో దర్యాప్తు ముమ్మరం చేశారు అధికారులు. హైదరాబాద్ టాస్క్ ఫోర్స్ మాజీ డీసీపీ రాధాకృష్ణ రావు.. రాజకీయ నేతల ఫోన్లు ట్యాపింగ్‌ చేసినట్లు అంగీకరించినట్లు తెలిసింది. అలాగే ఎవరి ఫోన్ల ట్యాప్ చేశారో ఆ జాబితా బయటకు వచ్చింది. హైదరాబాద్ టాస్క్ ఫోర్స్ మాజీ డీసీపీ పోలీస్ రాధా కృష్ణరావు బీఆర్ఎస్ ప్రభుత్వంలో పలువురు రాజకీయ నేతలను లక్ష్యంగా చేసుకుని విస్తృతంగా ఫోన్ ట్యాపింగ్ చేసినట్లు పోలీసుల ఎదుట వాంగ్మూలం ఇచ్చారు. ఈ కేసులో ఇటీవల అరెస్టైన రాధా కృష్ణరావు తన వాంగ్మూలంలో కీలక అంశాలు పేర్కొన్నారు.

రాధా కృష్ణరావు వాంగ్మూలంలో సంచలనాలు

రాధాకిషన్ రావు వాంగ్మూలం ప్రకారం....స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్రాంచ్ (SIB) చీఫ్ ప్రభాకర్ రావు ఆధ్వర్యంలో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం నడిచింది. ఎస్ఐబీ ప్రభాకర్ రావు ఆధ్వర్యంలో బీఆర్ఎస్ కు ఇబ్బందిగా మారిన నేతల సమాచారాన్ని సేకరించారు. ఈ సమాచారాన్ని ఇంటెలిజెన్స్ ఎస్ఐబీ మాజీ డీఎస్పీ ప్రణీత్ కుమార్‌కు అందించారు. ప్రణీత్ కుమార్ ఈ నేతలపై నిరంతరం నిఘా పెట్టి, బీఆర్ఎస్ పార్టీకి వీరిని ముప్పు లేకుండా వీరి ప్రొఫైల్స్ తయారుచేశారు. అయితే నిఘా పెట్టిన వారిలో ప్రతిపక్ష నేతలతో పాటు బీఆర్ఎస్ పార్టీ నేతలు, ప్రముఖ వ్యాపారులు ఉండడం కలకలం రేపుతోంది.

బీఆర్ఎస్ నేతల ఫోన్లు కూడా ట్యాపింగ్

ఫోన్ ట్యాపింగ్ చేస్తూ నిఘా పెట్టిన వారిలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ శంబీపూర్ రాజు (కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యేతో విభేదాలు ఉండడంతో), స్టేషన్ ఘన్ పూర్ అప్పటి ఎమ్మెల్యే రాజయ్య(కడియం శ్రీహరితో విభేదాలు), తాండూరు ఎమ్మెల్యేపై అసంతృప్తితో ఉన్న పట్నం మహేందర్ రెడ్డి దంపతులపై ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, ఎన్టీవీ నరేంద్ర చౌదరి, ఏబీఎన్ రాధాకృష్ణ, నాగార్జునసాగర్‌కు చెందిన జానా రెడ్డి కుమారుడు రఘువీర్‌ రెడ్డి సహా పలువురు ప్రతిపక్ష పార్టీ అభ్యర్థులపై నిఘా పెట్టారు. గద్వాల సరిత తిరుపతయ్య, కోరుట్ల జువ్వాడి నర్సింగరావు, అచ్చంపేటకు చెందిన వంశీ కృష్ణ వ్యవహారాలపై నిఘా పెట్టి వీరి సమాచారాన్ని ఎప్పటికప్పుడు సేకరించారు.

ఇంటర్నెట్ కాల్స్ ట్రాక్

అయితే ఫోన్ ట్యాపింగ్ రాజకీయ ప్రముఖులకే పరిమితం కాలేదని రాధా కృష్ణరావు తెలిపారు. నిర్మాణ, రియల్ ఎస్టేట్ రంగాలకు చెందిన పలువురు వ్యాపారవేత్తలు కదలికలు, పలు సంఘాలను ట్రాక్ చేశామని వెల్లడించారు. దీంతో అనేక మంది రాజకీయ నాయకులు, న్యాయవ్యవస్థ సభ్యులు, అధికారులు ప్రత్యక్ష ఫోన్ కాల్స్ కు బదులుగా WhatsApp, Signal, Snapchat వంటి ఎన్‌క్రిప్టెడ్ కమ్యూనికేషన్ ప్లాట్‌ఫారమ్‌లను వినియోగించేవారన్నారు. దీంతో ప్రభాకర్ రావు, అతని బృందం ఇంటర్నెట్ కాల్స్ కమ్యూనికేషన్లను ట్రాక్ చేయడానికి ఇంటర్నెట్ ప్రోటోకాల్ డేటా రికార్డులను విశ్లేషించడం మొదలుపెట్టారన్నారు.

ఆన్ లైన్ ట్రోలింగ్ కు ప్రణీత్ కుమార్ సాయం

ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ఐన్యూస్ కు చెందిన జర్నలిస్ట్ శ్రావణ్ కుమార్ కీలకం వ్యవహరించారని రాధా కృష్ణరావు తెలిపారు. 2023 ఎన్నికల సమయంలో అప్పటి మంత్రి హరీశ్‌రావు ఆదేశాలతో శ్రావణ్‌కుమార్‌ ప్రభాకర్‌రావుతో సంబంధాలు కొనసాగించారన్నారు. శ్రావణ్ కుమార్ ప్రతిపక్ష పార్టీ నేతలు, వారి ఆర్థిక మద్దతుదారుల గురించి ఎస్ఐబీ సమాచారం అందజేశారని తెలిపారు. ప్రత్యర్థి నాయకుల డబ్బు సీజ్ చేసేందుకు ఇన్‌పుట్స్ అందించేవాడన్నారు. ఆన్ లైన్ లో బీఆర్ఎస్ ను విమర్శించేవారిని ట్రోలింగ్ చేసేందుకు ప్రణీత్ కుమార్ బృందం సహాయం చేసిందని తన వాగ్మూలంలో రాధా కృష్ణరావు స్పష్టం చేశారు. ఫోన్ ట్యాపింగ్ లో బీఆర్ఎస్ నేతల పేర్లు కూడా వెలుగులోకి రావడంతో ఈ కేసు కీలక మలుపు తిరిగింది. త్వరలో కీలక నేతల పేర్లు వెలుగులోకి వస్తాయని దర్యాప్తు అధికారులు అంటున్నారు.

Whats_app_banner

సంబంధిత కథనం