Phone Tapping Case: ఎన్నికల సమయంలో పోలీస్ అధికారి Police Officer కరీంనగర్ జిల్లాలో ఎందుకు సంచరించారు..? దేనికోసం ఇక్కడ మకాం వేశారు..? అతను సంచరించిన రోజు రాష్ట్రంలో ఏం జరిగింది..? అన్న విషయాలపై ఆరా తీసి, పలు కీలక ఘటనలపై ఓ నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం.
ఫోన్ ట్యాపింగ్ Phone Tapping వ్యవహారంలో కీలకంగా వ్యవహరించారన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న ఉన్నతాధికారుల్లో ఒకరు 2023 నవంబర్ లో ఒకసారి ఉమ్మడి కరీంనగర్ లో పర్యటించారు. కరీంనగర్ లోని ఓ ప్రముఖ హోటల్లో నవంబర్ 26న బస చేశారు. తాను వచ్చినట్లు ఎవరికీ తెలియకుండా ఎంతో జాగ్రత్తపడిన సదరు ఉన్నతాధికారి.. ట్యాపింగ్ వ్యవహారంలో షాడోలా వ్యవహరించారన్న ఆరోపణలు ఉన్నాయి.
మరునాడు అతను ఏమాత్రం బిల్లు చెల్లించకుండా ఉమ్మడి జిల్లాలో మరోచోటుకి వెళ్లిపోయాడని తెలిసింది. హైదరాబాద్ లో కీలకంగా ఉన్న సదరు అధికారి కరీంనగర్ కు ఎందుకు వచ్చాడు..? ఏం పని మీద వచ్చాడు..? అన్న దానిపై నిఘావర్గాలు కూపీ లాగే పనిలో పడ్డాయి. ఎందుకంటే ఆ సమయంలో బిఆర్ఎస్ అధికారంలో ఉంది. ఆ సమయంలో ఎవరి మీద నిఘా కోసం సదరు అధికారి వచ్చాడనే విషయంపై స్పష్టత రావాల్సి ఉంది.
ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం తొలి సారిగా లోకానికి తెలిసింది కరీంనగర్ లో కాగా, తొలి అరెస్టు జరిగింది సిరిసిల్ల లో కావడం గమనార్హం. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఒక్కో పోలీసు అధికారి పాత్ర ఏమిటి..? అన్నది ఒక్కొక్కటిగా వెలుగుచూస్తున్నాయి.
ఈ క్రమంలోనే డీఎస్పీ ప్రణీత్ రావు DSP Praneeth Rao పేరు వెలుగులోకి రావడం.. అరెస్టు కావడం.. అది కూడా ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోనే కావడం విశేషం. తొలిసారిగా హుజురాబాద్ Huzurabad ఉప ఎన్నికల సందర్భంగా ఫోన్ ట్యాపింగ్ వ్యవహారాన్ని అప్పటి పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి Revanth Reddyవెలుగులోకి తీసుకురావడం తెలిసిందే.
ప్రతిపక్ష నేతల కదలికలను ఎప్పటికప్పుడు తెలుసుకునేందుకు అప్పటి ఎస్ఐబీ చీఫ్ ప్రభాకర్ రావు నేతృత్వంలో ఓ ప్రత్యేక బృందం పనిచేసిందని, వీరు ప్రతిపక్ష నేతల ఫోన్ల ట్యాపింగ్ తోపాటు పలువురు మహిళల వ్యక్తిగత జీవితాల్లోకి తొంగిచూసే ప్రయత్నం చేశారన్నది రాష్ట్రవ్యాప్తంగా కలకలం రేపుతోంది.
ప్రస్తుత సీఎం రేవంత్ రెడ్డి, అతని కుటుంబ సభ్యులు, సన్నిహితులను లక్ష్యంగా చేసుకుని ఫోన్ ట్యాపింగ్ జరిగిందని పోలీసులే చెబుతున్నారు. రేవంత్ రెడ్డికి ఉమ్మడి జిల్లాలో సన్నిహితులుగా ఉన్న సీనియర్ కాంగ్రెస్ నేత సత్తు మల్లేశ్ ఫోన్ ను ట్యాప్ చేసినట్లు పోలీసులు ఇప్పటికే గుర్తించారు.
సిరిసిల్లలో వార్ రూమ్ ఏర్పాటు చేసుకుని ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా పలువురు ప్రతిపక్ష నేతల ఫోన్ సంభాషణలు రికార్డు చేసి అప్పటి ఉన్నతాధికారులకు పంపినట్లు సమాచారం. నవంబర్ లో అసెంబ్లీ ఎన్నికల ప్రచార సమయంలో సదరు అధికారి ఎంట్రీ ఉమ్మడి జిల్లాలో రాజకీయ ప్రకంపనలకు దారితీసిందని అనుమానిస్తున్నారు.
ఆ అధికారి జిల్లాకు వచ్చిన రోజు సాయంత్రం పెద్దపల్లి జిల్లాలో రూ.50 లక్షలు మరునాడు రూ.2.18 కోట్లు పట్టుబడ్డాయి. అంతకుముందు పెద్దపల్లి జిల్లాలో ఓ ప్రతిపక్ష నేతకు సంబంధించిన దాదాపు రూ.6 కోట్లు హైదరాబాద్ నుంచి వస్తుండగా ఫోన్ ట్యాపింగ్ ద్వారా గుర్తించి పట్టుకున్నారని అనుమానిస్తున్నారు.
అంతకుముందు పొరుగు రాష్ట్రం నుంచి డబ్బు, కానుకలతో వస్తున్న ఓ భారీ వాహనాన్ని ముందస్తుగా గుర్తించడంలోనూ ట్యాపింగ్ కీలకంగా పనిచేసి ఉంటుందని అనుమానిస్తున్నారు. ఈ మూడు ఘటనలకు ముందు సదరు అధికారి ఉమ్మడి జిల్లాలో సంచరించాడని, అందుకు తగిన ఆధారాల కోసం అన్వేషిస్తున్నారు.
సిరిసిల్ల కేంద్రంగా కొన్నేళ్లుగా సాగిన ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం త్వరలోనే కొలిక్కి రానుంది. ఇందులో కొందరు పోలీసు సిబ్బంది సైతం ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ట్యాపింగ్ చేసినట్లు సమాచారం. కేసును దర్యాప్తు చేస్తున్న పోలీసు ఉన్నతాధికారులు త్వరలోనే సిరిసిల్ల వార్ రూమ్ ఉన్న ప్రాంతాన్ని సందర్శిస్తారని సమాచారం.
జిల్లాలో ఎక్కడ వార్ రూం నిర్వహించారు?.. ఏ లొకేషన్లో వారికి ఆశ్రయం దొరికింది?.. ఎవరెవరి ఫోన్ కాల్స్ ట్యాప్ అయ్యాయి? అన్న విషయం తెలిసే అవకాశాలున్నాయి. ఇందుకోసం పనిచేసిన ఓ ఎస్సై, ముగ్గురు కానిస్టేబుళ్లను సైతం విచారించే అవకాశాలు లేకపోలేదు. ఇవన్నీ కార్యరూపం దాల్చితే త్వరలోనే సిరిసిల్ల వార్ రూం కథ కొలిక్కి వచ్చే అవకాశాలు ఉన్నాయి.
(రిపోర్టింగ్ కే.వీ.రెడ్డి, ఉమ్మడి కరీంనగర్ జిల్లా)
సంబంధిత కథనం