Phone Tapping Case : 2004 నుంచి జరిగిన ఫోన్ ట్యాపింగ్‌ ఆధారాలన్నీ బయటపెట్టండి - కేటీఆర్-ktr demanded to disclose all evidence of phone tapping since 2004 ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Phone Tapping Case : 2004 నుంచి జరిగిన ఫోన్ ట్యాపింగ్‌ ఆధారాలన్నీ బయటపెట్టండి - కేటీఆర్

Phone Tapping Case : 2004 నుంచి జరిగిన ఫోన్ ట్యాపింగ్‌ ఆధారాలన్నీ బయటపెట్టండి - కేటీఆర్

Maheshwaram Mahendra Chary HT Telugu
Apr 03, 2024 01:30 PM IST

KTR On Phone Tapping Case Updates: ఫోన్ ట్యాపింగ్ కేసుపై కేటీఆర్ స్పందిస్తూ కీలక వ్యాఖ్యలు చేశారు. 2004 నుంచి జరిగిన ఫోన్ ట్యాపింగ్‌ ఆధారాలన్నీ బయటపెట్టాలని డిమాండ్ చేశారు.

2011 నుంచి జరిగిన ఫోన్ ట్యాపింగ్‌ ఆధారాలన్నీ బయటపెట్టండి - కేటీఆర్
2011 నుంచి జరిగిన ఫోన్ ట్యాపింగ్‌ ఆధారాలన్నీ బయటపెట్టండి - కేటీఆర్

KTR On Phone Tapping Case: 2004 నుంచి జరిగిన ఫోన్ ట్యాపింగ్‌(Phone Tapping Case) ఆధారాలు అన్ని బయటపెట్టాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఇవాళ తెలంగాణ భవన్ లో మీడియాతో మాట్లాడిన ఆయన…. ఫోన్ ట్యాపింగ్ వంటి వ్యవహారాలతో తనకు ఎలాంటి సంబంధం లేదన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) లీకు వీరుడిలాగా మారారని విమర్శించారు. హీరోయిన్లను బెదిరించానని ఓ మంత్రి మాట్లాడారని, అలాంటి దిక్కుమాలిన పనులు చేయాల్సిన అవసరం తనకు లేదన్నారు. అసత్య ఆరోపణలు చేస్తున్న వారిపై న్యాయపరమైన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.

మా ప్రభుత్వం రాకముందు కాంగ్రెస్ సర్కార్ ఉంది. పదేళ్లు అధికారంలోకి ఉంది. నాడు కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు… కాంగ్రెస్ పార్టీలోని గడ్డం వివేక్, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, పొన్నం ప్రభాకర్ తమ ఫోన్లను ట్యాపింగ్ చేస్తున్నారని ఆరోపించారు. ఈ విషయంలో మేము కాదు… కాంగ్రెస్ నేతలే కిరణ్ కుమార్ రెడ్డిపై ఆరోపణలు చేశారు. 2014 నుంచే కాదు… 2004 నుంచి జరిగిన అన్ని విషయాలన్నీ బయటికి తీయండి. కేవలం ప్రభుత్వమే మారింది. కానీ అధికారులు మాత్రం వారే ఉన్నారు. ఇప్పుడున్న ఇంటెలిజెన్స్ డీజీ శివధర్ రెడ్డి ఆ రోజు మా ప్రభుత్వంలో ఇంటెలిజెన్స్ ఐజీగా ఉన్నారు. ఈ రోజు టీఎస్పీఎస్సీ చైర్మన్ మహేందర్ రెడ్డి ఆ రోజు రాజశేఖర్ రెడ్డి ప్రభుత్వంలో ఇంటెలిజెన్స్ ఐజీ, ఆ తర్వాత మా ప్రభుత్వంలో ఇంటెలిజెన్స్ డీజీగా హైదరాబాద్ సీపీగా పని చేశారు . ఈ రోజు డీజీపీ రవి గుప్తా ఆ రోజు హోం సెక్రెటరీ.. వీళ్ళందరూ ఇప్పుడు మీ ప్రభుత్వంలో ఉన్నారు.. ఒక వేళ ఫోన్ ట్యాపింగ్‌ జరిగితే ఈ అధికారులకు తెలియదా…? అని కేటీఆర్ ప్రశ్నించారు.

వాటర్ ట్యాపింగ్ పై దృష్టిపెట్టండి - కేటీఆర్

KTR On Water Problem: కాంగ్రెస్ హయాంలో మళ్లీ తాగునీటి తండ్లాట మొదలైందన్నారు కేటీఆర్. “ప్రజలు గొంతు ఎండి ఇబ్బంది పడుతుంటే రేవంత్ రెడ్డి గొంతు చించుకునే ప్రయత్నం చేస్తున్నారు. మహిళలు రోడ్ల పైన ఖాళీ బిందెలతో తల్లడిల్లుతుంటే రేవంత్ రెడ్డి లంక బిందెల కోసం మాట్లాడుతున్నాడు. ఢిల్లీకి ధనరాశులను తరలిస్తున్న రేవంత్ రెడ్డికి జలరాశులు తరలించే ఓపిక లేదు. గతంలో మేము ప్రజల అవసరాలు ఎట్ల తీర్చాలని ఆలోచిస్తే రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) ప్రభుత్వం మాత్రం చేరికల పైన దృష్టి పెట్టింది. ఢిల్లీకి డబ్బు సంచులు పంపడంపైన దృష్టి పెట్టారు. మంచినీళ్లను మానవ హక్కుగా గుర్తించి రూ. 38 వేల కోట్లతో మిషన్ భగీరథను చేపట్టి పూర్తి చేశాం. 50 ఏళ్ల పాటు హైదరాబాదు నగరానికి తాగునీటి కొరత రాకుండా చేశాం. కనీసం వాటి నిర్వహణ కూడా చేతగాని ప్రభుత్వం ఈ కాంగ్రెస్ ప్రభుత్వం. కెసీఆర్(KCR) ప్రభుత్వం దిగిపోగానే హైదరాబాద్‌లో ట్యాంకర్ల హడావిడి మొదలైంది. రాష్ట్రంలో ఇన్వర్టర్లు, జనరేటర్లతో పాటు ట్యాంకర్ల దందా స్టార్ట్ అయింది. మూడు నాలుగు రెట్లు పెట్టి ట్యాంకర్లు కొనుగోలు చేస్తున్నారు. ఇది ప్రకృతి వల్ల వచ్చిన తాగునీటి కొరత కాదు. కేవలం కాంగ్రెస్ పార్టీ చేతగానితనం వల్ల వచ్చిన కొరత. గతంలో కురిసిన వర్షం కంటే 14% అధికంగా వర్షం ఉన్న తాగునీటి కొరత ఎందుకు వచ్చింది..? పార్టీ గేట్లు ఎత్తడం కాదు ముఖ్యమంత్రి.. ప్రజల కోసం చేతనైతే ప్రాజెక్టుల గేట్లు ఎత్తండి. ఫోన్ ట్యాపింగ్ కాదు . వాటర్ ట్యాపింగ్‌పైన దృష్టి పెట్టండి. సాగర్‌లో, ఎల్లంపల్లిలో, హిమాయత్ సాగర్‌లో, ఉస్మాన్ సాగర్‌లో నీళ్లు ఉన్నా.. ప్రజలు ఎందుకు ట్యాంకర్లు బుక్ చేసుకోవాలి..? తాగునీటి ఇబ్బందులు ఎందుకు పడాలి ముఖ్యమంత్రి గారు చెప్పాలి..? కాళేశ్వరం ప్రాజెక్టు విఫలమైతే మళ్లీ పంప్ హౌస్‌లు ఎట్లా ప్రారంభమైనయ్.. నీళ్లు ఎట్ల ఎత్తిపోస్తున్నారు..? బెంగళూరు మాదిరి నీటిని వాడితే జరిమానాలు విధించే పరిస్థితి హైదరాబాద్ నగరంలో కూడా వస్తుంది. నీటిని వృథా చేసినందుకు జరిమానా వేస్తే నీటిని ఎత్తిపోయకుండా గొంతులు ఎండబెట్టిన రేవంత్ రెడ్డి పైన ఎన్ని జరిమానాలు వేయాలి. కాళేశ్వరం ప్రాజెక్ట్ పంపులు ఆన్ చేసి రిజర్వాయర్లు నింపండి.. హైదరాబాద్ ప్రజల తాగునీటి అవసరాలు తీర్చండి. తాగునీటి ఇబ్బందులు రాకుండా వెంటనే చర్యలు చేపట్టాలని ఈ ప్రభుత్వాన్ని హైదరాబాద్ ప్రజల తరఫున డిమాండ్ చేస్తున్నా. అవసరమైతే జలమండలి ముందు ధర్నాలు చేస్తాం” అని కేటీఆర్ హెచ్చరించారు.

Whats_app_banner