TG Highcourt: బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేల అనర్హతపై సింగల్‌ జడ్జి తీర్పు కొట్టేసిన డివిజన్‌ బెంచ్‌, స్పీకర్‌దే నిర్ణయాధికారం..-the division bench overturned the single judges verdict on the disqualification of brs mlas ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Tg Highcourt: బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేల అనర్హతపై సింగల్‌ జడ్జి తీర్పు కొట్టేసిన డివిజన్‌ బెంచ్‌, స్పీకర్‌దే నిర్ణయాధికారం..

TG Highcourt: బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేల అనర్హతపై సింగల్‌ జడ్జి తీర్పు కొట్టేసిన డివిజన్‌ బెంచ్‌, స్పీకర్‌దే నిర్ణయాధికారం..

Bolleddu Sarath Chandra HT Telugu
Nov 22, 2024 11:32 AM IST

TG Highcourt: బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేల అనర్హతపై నాలుగు వారాల్లో నిర్ణయం తీసుకోవాలంటూ సెప్టెంబర్‌9న తెలంగాణ హైకోర్టు ఉత్తర్వులు డివిజన్‌ బెంచ్ కొట్టేసింది. సహేతుకమైన కాల వ్యవధిలో అనర్హత పిటిషన్లపై విచారణ ముగించాలని స్పష్టం చేసింది.ఎమ్మెల్యేల అనర్హతపై స్పీకర్‌దే నిర్ణయమని డివిజన్‌ బెంచ్‌ పేర్కొంది.

తెలంగాణ హైకోర్టు
తెలంగాణ హైకోర్టు (Twitter )

TG Highcourt: పార్టీ మారిన ఎమ్మెల్యేల అనర్హతపై తెలంగాణ హైకోర్టు సింగల్‌ బెంచ్‌ సెప్టెంబర్‌ 9వ తేదీన ఇచ్చిన తీర్పును డివిజన్‌ బెంచ్‌ కొట్టేసింది. ఎమ్మెల్యేల అనర్హత వ్యవహారంపై తెలంగాణ హైకోర్టు కీలక ఆదేశాలు ఇచ్చింది. నాలుగు వారాల్లోగా నిర్ణయం తీసుకోవాలని గతంలో స్పీకర్ కార్యాలయాన్ని హైకోర్టు ఆదేశించింది. దీనిపై తెలంగాణ అసెంబ్లీ హైకోర్టు డివిజన్‌ బెంచ్‌లో సవాలు చేసింది. దానం నాగేందర్, కడియం శ్రీహరి, తెల్లం వెంకట్రావుపై.. చర్యలు తీసుకోవాలని గతంలో బీఆర్ఎస్ హైకోర్టును ఆశ్రయించింది.

2023లో గెలిచిన తర్వాత..

2023 అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచిన తర్వాత పార్టీ మారిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని బీఆర్ఎస్, బీజేపీ నేతలు హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. దానం నాగేందర్‌, కడియం శ్రీహరి, తెల్లం వెంకట్రావుపై వేటు వేయాలని.. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పాడి కౌశిక్‌ రెడ్డి, వివేకానంద గౌడ్‌ పిటిషన్‌ వేశారు. దానంపై అనర్హత వేటు వేయాలని బీజేపీ ఎమ్మెల్యే మహేశ్వర్‌ రెడ్డి పిటిషన్‌ దాఖలు చేశారు.

సుదీర్ఘ వాదనల తర్వాత..

బీఆర్ఎస్, బీజేపీ వేసిన అన్ని పిటిషన్లను కలిపి హైకోర్టు విచారణ జరిపింది. ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపుపై ఉన్నత న్యాయస్థానంలో సుదీర్ఘ వాదనలు జరిగాయి. పార్టీ ఫిరాయింపు అంశంలో సుప్రీం కోర్టు ఆదేశాలను స్పీకర్‌ పట్టించుకోవడం లేదని.. పిటిషనర్లు కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. ఇరు పక్షాల వాదనలు విన్న న్యాయస్థానం నాలుగువారాల్లో పిటిషన్లపై నిర్ణయం తీసుకోవాలని హైకోర్టు గతంలో తీర్పునిచ్చింది. ఈ తీర్పును సవాలు చేయడంతో డివిజన్‌ బెంచ్‌ తాజాగా కీలక ఆదేశాలు జారీ చేసింది. నాలుగు వారాల్లో నిర్ణయం తీసుకోవాలని స్పీకర్‌ కార్యాలయాన్ని న్యాయస్థానం ఆదేశించడాన్ని తప్పు పట్టింది.

బీఆర్ఎస్ నుంచి..

2023 అసెంబ్లీ ఎన్నికల్లో దానం నాగేందర్ బీఆర్ఎస్ తరఫున పోటీ చేసి.. ఖైరతాబాద్ ఎమ్మెల్యేగా విజయం సాధించారు. కడియం శ్రీహరి వరంగల్ జిల్లా స్టేషన్ ఘన్‌పూర్ నుంచి గెలుపొందారు. తెల్లం వెంకట్రావ్ భద్రాచలం ఎమ్మెల్యేగా బీఆర్ఎస్ నుంచి విజయం సాధించారు. ఏంపీ ఎన్నికల ముందు వీరు కాంగ్రెస్ పార్టీలో చేరారు. దీనిపై బీఆర్ఎస్ అభ్యంతరం వ్యక్తం చేసింది. పార్టీ మారిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని పోరాడుతోంది. హైకోర్టు డివిజన్‌ బెంచ్ ఆదేశాలతో ఈ వ్యవహారం ఆసక్తికరంగా మారింది. ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై సహేతుకమైన కాల వ్యవధిలో నిర్ణయం తీసుకోవాలని హైకోర్టు డివిజన్‌ బెంచ్‌ ఆదేశించింది. దీనిపై బీఆర్‌ఎస్‌ ఎలా స్పందిస్తుందనేది ఆసక్తికరంగా మారింది.

Whats_app_banner