AP National Highways: ఏపీలో 35 జాతీయ రహదారుల్ని ప్రారంభించిన ప్రధాని మోదీ... రూ.29వేల కోట్ల ప్రాజెక్టులు జాతికి అంకితం
AP National Highways: ఏపీలో రూ.29వేల కోట్ల రుపాయల విలువైన 35 జాతీయ ప్రాజెక్టుల్ని ప్రధాని మోదీ గుర్గావ్ నుంచి వర్చువల్ పద్ధతిలో జాతికి అంకితం చేశారు. కేంద్ర ఉపరితల రవాణా మంత్రిత్వ శాఖ రూపొందించిన రహదారుల్ని ప్రధాని ప్రారంభించారు.
AP National Highways: ఆంధ్రప్రదేశ్‌లో కేంద్ర ప్రభుత్వం నిర్మించిన జాతీయ రమదారుల్ని ప్రధాని మోదీ Modi సోమవారం వర్చువల్ Virtual పద్ధతిలో ప్రారంభించారు. రాష్ట్రంలో చేపట్టిన 35 జాతీయ రహదారుల ప్రాజెక్టులను సోమవారం ప్రధాని Narendra Modi జాతికి అంకితం చేశారు.
కేంద్ర ఉపరితల రవాణా మంత్రిత్వ శాఖ భారత్‌మాల ప్రాజెక్టులో భాగంగా NHAI ద్వారా రాష్ట్రంలో రూ.29,395 కోట్లతో 1,134 కి.మీ. పొడవైన జాతీయ రహదారుల నిర్మాణం చేపట్టింది. రూ.లక్ష కోట్ల వ్యయంతో దేశవ్యాప్తంగా 114 జాతీయ రహదారి ప్రాజెక్టులను కేంద్రం చేపట్టింది. మొత్తం ప్రాజెక్టుల్లో 30 శాతం ప్రాజెక్టులు ఆంధ్రప్రదేశ్‌లో ఉన్నాయి.
విజయవాడ ఈస్ట్ బైపాస్, భోగాపురం ప్రాజెక్టులను త్వరితగతిన పూర్తి చేసేందుకు చర్యలు తీసుకోవాలని కేంద్రాన్ని రాష్ట్ర ప్రభుత్వం కోరింది. రాష్ట్రంలో రూ.29,395 కోట్ల వ్యయంతో చేపట్టిన 35 ప్రాజెక్టులకు సంబంధించిన 1,134 కి.మీ పొడవైన జాతీయ రహదారులను హరియాణాలోని గుర్ గ్రామ్ నుంచి ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ వర్చువల్ గా ప్రారంభించారు.
సోమవారం విజయవాడలో జాతీయ రోడ్డు, రవాణా మరియు జాతీయ రహదారి మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా ఏర్పాటు చేసిన రాష్ట్రస్థాయి సమావేశంలో పలువురు ఉన్నతాధికారులు, నాయకులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ద్వారకా ఎక్స్ ప్రెస్ హైవేలోని హరియాణా సెక్షన్ (ఢిల్లీ -గుర్ గ్రామ్) సహా దేశవ్యాప్తంగా 16 రాష్ట్రాలకు సంబంధించి లక్ష కోట్లకు పైగా వ్యయంతో నిర్మించిన పలు ప్రాజెక్టులను ప్రధాని మోదీ ప్రారంభించి జాతికి అంకితం చేశారు. పలు ప్రాజెక్టులకు శంకుస్థాపనలు కూడా వర్చువల్ గా చేశారు. ఈ సందర్భంగా ప్రస్తుత ప్రాజెక్టులతో పాటు విజయవాడ ఈస్ట్ బైపాస్, వైజాగ్ సమీపంలోని భోగాపురం ప్రాజెక్టును త్వరితగతిన పూర్తి చేసేందుకు కేంద్రం చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రతిపాదనగా రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ సెక్రటరీ ప్రద్యుమ్మ విజ్ఞప్తి చేశారు.
యూపీ తర్వాత ఏపీకే అత్యధిక ప్రాధాన్యత…
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించి జాతికి అంకితం చేసిన ప్రాజెక్టుల్లో రూ. 2,957 కోట్లతో 51 కి.మీల పొడవైన 6 లైన్ల ఆనందపురం – పెందుర్తి – అనకాపల్లి సెక్షన్ పూర్తి చేశారు.
రూ. 1,185 కోట్లతో 127 కి.మీల పొడవైన 2 లైన్ల గురజానపల్లి – అవనిగడ్డ రహదారి నిర్మాణం పూర్తి చేశారు. రూ. 666 కోట్లతో 27 కి.మీల పొడవైన 6 లైన్ల గుండుగొలను- కలపర్రు సెక్షన్ పూర్తి చేశారు.
రూ. 429 కోట్లతో 17 కి.మీల పొడవైన 4 లైన్ల విజయనగరం టౌన్ బైపాస్, రూ. 89 కోట్లతో 7 కి.మీల పొడవైన 4 లైన్ల ముర్కంబట్టు – చెర్లోపల్లి సెక్షన్ పూర్తైంది. రూ.85 కోట్లతో చేపట్టిన 23 కి.మీల పొడవైన 2 లైన్ల దేవరపల్లి- జీలుగుమిల్లి సెక్షన్ ఉన్నాయి.
ప్రధాని శంకుస్థాపన చేసిన ప్రాజెక్టుల్లో ప్రధానంగా రూ. 14,060 కోట్లతో 344 కి.మీల పొడవైన 6 లైన్ల(NH- 544G) బెంగుళూరు -కడప – విజయవాడ ఎకనమిక్ కారిడార్ తో పాటు పలు ప్రాజెక్టులు ఉన్నాయి.
దేశవ్యాప్తంగా ఇవాళ ప్రారంభించిన ప్రాజెక్టుల్లో 30 శాతం ప్రాజెక్టులను ఏపీకి కేటాయించామని ప్రధాని మోదీ తెలిపారు. దాదాపు 30వేల కోట్లతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జాతీయ రహదారులను నిర్మిస్తున్నామన్నారు. కొన్ని జాతీయ రహదారులు ఇప్పటికే పూర్తయిన విషయాన్ని గుర్తుచేశారు.
దేశ, రాష్ట్ర ఆర్థిక పెరుగుదలకి, సమగ్రాభివృద్ధికి జాతీయ రహదారులు దోహదపడతాయని ఆశాభావం వ్యక్తం చేశారు. జాతీయ రహదారుల నిర్మాణం వల్ల భారీ పరిశ్రమలు వచ్చే అవకాశం ఉందన్నారు.
ప్రధానంగా ప్రయాణీకుల భద్రతతో పాటు సురక్షిత, వేగవంతమైన ప్రయాణానికి బాటలు వేస్తున్నామన్నారు. తద్వారా ట్రాఫిక్ తగ్గడమే గాక సమయం, డబ్బు ఆదా అయి ప్రయాణం సులభతరం అవుతుందని పేర్కొన్నారు. 2047 నాటికి వికసిత్ భారత్ దిశగా అడుగులు వేస్తున్నామన్నారు. ప్రపంచవ్యాప్తంగా 3వ ఆర్థిక శక్తిగా భారత్ ఎదగాలన్నదే తమ లక్ష్యమన్నారు.
ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి కేంద్రం కట్టుబడి ఉందని కార్యక్రమంలో పాల్గొన్న మాజీ కేంద్ర మంత్రి శ్రీమతి. డి. పురందేశ్వరి, రాజ్యసభ సభ్యులు సి.ఎం. రమేష్ పేర్కొన్నారు. అధికారులు, సిబ్బంది, కార్మికులు అహర్నిశలు శ్రమించడం వల్లే సకాలంలో జాతీయ రహదారుల నిర్మాణం సాధ్యమైందని తెలిపారు.
పక్కా ప్రణాళికతో రాష్ట్రంలో చేపట్టిన ప్రాజెక్టులు త్వరితగతిన పూర్తి అవ్వాలని ఆకాంక్షించారు. 100-120 కి.మీ వేగంతో ప్రయాణించేలా నిర్మిస్తున్న విజయవాడ- బెంగుళూరు జాతీయ రహదారితో ప్రయాణీకులకు సమయం, డబ్బు ఆదా అవుతుందన్నారు.
గడిచిన 10 ఏళ్లలో దాదాపు రూ. 70 వేల కోట్లతో రాష్ట్రంలో జాతీయరహదారుల నిర్మాణం జరిగిందన్నారు. 2014లో దేశం అభివృద్ధిలో 11వ స్థానంలో ఉంటే ప్రస్తుతం 5వ స్థానానికి రావడం గర్వించదగ్గ విషయమన్నారు. రవాణా మార్గాలు పెరిగితే దేశం అభివృద్ధి జరుగుతుందని వెల్లడించారు.
వేల కోట్ల విలువైన ప్రాజెక్టులను రాష్ట్ర ప్రభుత్వం త్వరితగతిన పూర్తి చేసిందని రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ సెక్రటరీ ప్రద్యుమ్మ అన్నారు.ఉత్తరప్రదేశ్ తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే అత్యధిక ప్రాజెక్టులు చేపట్టి పూర్తి చేశామన్నారు.
రూ. 14,060 కోట్లతో చేపట్టనున్న విజయవాడ – బెంగుళూరు ఎకనామిక్ కారిడార్ అతిపెద్ద ప్రాజెక్టు అని వెల్లడించారు. ఈ ప్రాజెక్టుకు సంబంధించిన భూసేకరణ అతి తక్కువ సమయంలోనే చేయడంలో అధికారుల కృషి ప్రశంసనీయమన్నారు.
కేంద్ర రోడ్డు రవాణా మరియు రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ ఎప్పటికప్పుడు సమీక్షలు నిర్వహించగా, రాష్ట్ర ప్రభుత్వ పనితీరును మెచ్చుకోవడం సంతోషించదగ్గ అంశమని పేర్కొన్నారు.