SIB Ex DSP Praneeth Rao Arrest : బీఆర్ఎస్ ప్రభుత్వంలో ప్రతిపక్ష నేతల ఫోన్ ట్యాపింగ్ (Phone Tapping)కేసులో స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్రాంచ్ (SIB) మాజీ డీఎస్పీ దుగ్యాల ప్రణీత్ రావును(Ex DSP Praneeth Rao) పోలీసులు అరెస్టు చేశారు. ఈ కేసు విచారణకు జూబ్లీహిల్స్ ఏసీపీ నేతృత్వంలో ప్రత్యేక టీమ్ ఏర్పాటైంది. ఈ బృందం ప్రణీత్ రావు విచారించి, పూర్తి వివరాలతో కోర్టు ముందు ప్రవేశపెట్టే అవకాశం ఉంది. రాజన్న సిరిసిల్ల జిల్లా(Sircilla)లోని ప్రణీత్‌రావు నివాసంలో మంగళవారం రాత్రి ఆయనను పంజాగుట్ట పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అరెస్టు అనంతరం ఆయనను హైదరాబాద్(Hyderabad)కు తరలించారు. ప్రణీత్ రావు ఎన్నికల ఫలితాల మరుసటి రోజు ఎస్‌ఐబీ లాగర్ రూమ్‌లో సీసీ కెమెరాలు ఆఫ్ చేసి హార్డ్‌డిస్క్‌లు ధ్వంసం చేసినట్లు పోలీసులు తెలిపారు. ఆధారాల ధ్వంసంలో ప్రణీత్‌రావు పక్కా ప్లాన్‌తో వ్యవహరించారన్నారు. తెలంగాణ ఎన్నికల ఫలితాల్లో బీఆర్ఎస్ ఓడిపోయిన తర్వాత ప్రతిపక్ష నేతల ఫోన్ల ట్యాపింగ్ చేసి ఆధారాలు లేకుండా చేశారని ప్రణీత్ రావుపై ఆరోపణలు ఉన్నాయి. ఎస్ఐబీలో ప్రణీత్ రావుకు సహకరించిన అధికారుల పాత్రపై పొలీసులు ఆరా తీస్తున్నారు.
ఈ వ్యవహారంతో పోలీస్ శాఖ ప్రణీత్ రావును విధుల నుంచి తప్పించింది. సిరిసిల్ల హెడ్ క్వార్టర్ ను విడిచివెళ్లరాదని సస్పెన్షన్ ఉత్తర్వుల్లో పేర్కొంది. అయితే ఆయన తప్పించుకుతున్నారని పోలీసుల నిఘాలో తెలిసింది. దీంతో శ్రీనగర్ కాలనీలోని ఆయన ఇంటి వద్ద పోలీసులు నిఘా పెట్టారు. మంగళవారం రాత్రి ప్రణీత్ రావు ఇంటికి వచ్చిన విషయం తెలుసకున్న పంజాగుట్ట(Punjagutta) పోలీసుల ఆయనను అరెస్టు చేశారు. ఆయన సెల్ ఫోన్లను సీజ్ చేసి, హైదరాబాద్‌కు తరలించారు. ప్రణీత్ రావు స్టేట్మెంట్ రికార్డు చేసిన అనంతరం ఆయనను నాంపల్లి కోర్టులో హాజరు పరచనున్నారు.
అయితే ప్రణీత్ రావు వ్యవహారంలో మరో విషయం వెలుగులోకి వచ్చింది. గత ప్రభుత్వంలో పోలీసు శాఖలో నలుగురు అధికారులు నిబంధనలకు విరుద్ధంగా యాక్సిలరేటెడ్ ప్రమోషన్ పొందినట్లు తెలిసింది. ఈ విషయంపై డీఎస్పీ గంగాధర్ ప్రభుత్వానికి ఫిర్యాదు చేశారు. అడ్డదారిలో ప్రమోషన్ పొందిన నలుగురు అధికారుల్లో స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్రాంచ్(Special Intelligence Branch) మాజీ డీఎస్పీ దుగ్యాల ప్రణీత్ రావు కూడా ఉన్నారు. నక్సలైట్ ఆపరేషన్స్ లో కీలకంగా వ్యవహరించిన అధికారులకు యాక్సిలరేటెడ్ ప్రమోషన్ ఇస్తారు. అయితే ప్రణీత్ రావు ఎలాంటి నక్సలైట్ ఆపరేషన్ లో పాల్గొనలేదు. అయినా అడ్డదారిలో డీఎస్పీ హోదా పొందారు. ఈ విషయాన్ని డీఎస్పీ గంగాధర్ తన ఫిర్యాదులో పేర్కొన్నారు. గత ప్రభుత్వంలో కొందరు అధికారులకు నిబంధనలకు విరుద్ధంగా ప్రమోషన్ ఇచ్చారని గంగాధర్ తన ఫిర్యాదులో ఆరోపించారు. ఆ నలుగురు అధికారుల ప్రమోషన్ పై ప్రభుత్వం విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని కోరారు.
సంబంధిత కథనం