Jewellery Cleaning: మీ బంగారు, వెండి నగలను ఇంట్లోనే ఇలా క్లీన్ చేసి మెరిపించేయండి, చిట్కాలు ఇవిగోండి
Jewellery Cleaning: పండుగలు వస్తున్నాయంటే ఇంట్లో ఉన్న బంగారు, వెండి నగలను శుభ్రపరచుకోవడం మొదలుపెడతారు. ఇందుకోసం ఇంట్లోనే చిన్న చిట్కాలను ఉపయోగించి ఆ నగలను, ఆభరణాలను మెరిసేలా చేయవచ్చు.
వరుసపెట్టి దసరా, దీపావళి, నాగుల చవితి ఇలా పండుగలు వచ్చేస్తున్నాయి. ఈ సందర్భంగా ఇంట్లో ఉన్న నగలను శుభ్రపరిచి వాటిని ధరించేందుకు సిద్ధమవుతారు. ఇంట్లోని ఆలయంలో ఉంచిన బంగారు, వెండి విగ్రహాలను కూడా శుభ్రపరుస్తారు. బంగారు-వెండి విగ్రహాలు లేదా ఆభరణాలు త్వరగా నల్లగా మారిపోతూ ఉంటాయి. వాటిని మెరుగుపెట్టేందుకు ఇచ్చి ఒక్కోసారి మోసపోతూ ఉంటారు. ఇలా మెరుగు పెట్టాల్సిన అవసరం లేకుండా ఇంట్లోనే వీటిని మెరిపించుకోవచ్చు.
వెండి ఆభరణాలు క్లీనింగ్
వెండి ఆభరణాలను శుభ్రం చేయడానికి వంటగదిలో ఉపయోగించే అల్యూమినియం ఫాయిల్ ఉపయోగించవచ్చు. ఇందుకోసం ఒక పాత్రలో వేడినీటిని తీసుకుని అల్యూమినియం ఫాయిల్ ను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ నీటిలో ఒక టీస్పూన్ బేకింగ్ సోడా వేసి వెండి ఆభరణాలను కాసేపు నానబెట్టాలి. దీని తరువాత, వెండి వస్తువులను బ్రష్ సహాయంతో శుభ్రపరచండి. వెండి ఆభరణాలపై ఉన్న నలుపు తొలగిపోతుంది, తెల్లగా తళతళ మెరుస్తాయి.
టీ ఆకులతో
బంగారు ఆభరణాలు లేదా దేవుని విగ్రహాలు వంటి వాటిని మెరిసేలా చేయడానికి టీ ఆకులను ఉపయోగించవచ్చు. ఈ రెమెడీ చేయడానికి, ఒక పాన్ లో ఒక పెద్ద గ్లాసు నీటిని తీసుకొని అందులో 2 టీస్పూన్ల టీ ఆకులను వేసి స్టవ్ మీద పెట్టి మరిగించండి. నీటి రంగు చిక్కగా ఉన్నప్పుడు నీటిని వడగట్టి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక పాత్రలో ఒక టీస్పూన్ బేకింగ్ సోడా, ఒక స్పూను డిటర్జెంట్ పౌడర్ వేసి కలపండి. అలాగే అందులో టీ ఆకుల నీటిని వేసి కలపాలి. ఈ నీరు చల్లారిన తర్వాత, మీ బంగారు ఆభరణాలను ఈ నీటిలో వేసి పావుగంట పాటూ వదిలేయాలి. ఆ తర్వాత ఈ నగలను బ్రష్ తో శుభ్రం చేసి సాధారణ నీటిలో ఉంచాలి. తర్వాత ఈ ఆభరణాలను కాటన్ వస్త్రంతో తుడవాలి. మీ బంగారు ఆభరణాలు కొత్త వాటిలా మెరుస్తాయి.
నిమ్మరసంతో
ఒక గిన్నెలో ఒక రెండు స్పూన్ల నిమ్మ రసం, మూడు టీస్పూన్ల ఉప్పు కలపండి. ఈ మిశ్రమంలో వెండి వస్తువులను కాసేపు ఉంచాలి. ఇలా చేయడం వల్ల వెండిపై ఉన్న మురికి తొలగిపోయి వెండి మెరిసిపోవడం ప్రారంభమవుతుంది.
టూత్ పేస్టుతో
వజ్రాభరణాలను శుభ్రం చేయడానికి టూత్ పేస్ట్ ను ఉపయోగించవచ్చు. ఈ రెమెడీ చేయాలంటే డైమండ్ రింగ్ లేదా చెవిపోగులపై కొద్దిగా టూత్ పేస్ట్ అప్లై చేసి కాసేపు రుద్దాలి. తరువాత తడి వస్త్రంతో తుడిచేయాలి. ఆభరణాలు తళతళ మెరవడం ప్రారంభమవుతాయి.
నీటిని వేడి చేసి స్టవ్ ఆఫ్ చేయాలి. తరువాత ఆ వేడి నీటిలో బంగారు ఆభరణాలు వేసి బ్రష్ తో పైన రుద్దాలి. అంతే మురికి తొలగిపోతుంది. వజ్రాలు, ముత్యాలు, కెంపులు వంటి పొడులు పెట్టిన ఆభరణాలను అవి రాలిపోకుండా జాగ్రత్తగా క్లీన్ చేసుకోవాలి. బ్రష్ తో రుద్దితే అవి రాలిపోయే ప్రమాదం ఉంది కాబట్టి, తడి గుడ్డతో ఒత్తుకుని తుడుచుకోవాలి.
టాపిక్