CJI at Tirumala : తిరుమల శ్రీవారిని దర్శించుకున్న సీజేఐ డీవై చంద్రచూడ్
సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఆలయానికి విచ్చేసిన సీజేఐ దంపతులకు టీటీడీ అధికారులు స్వాగతం పలితారు. వేద పండితులు వేదాశీర్వచనం అందించటంతో పాటు తీర్థప్రసాదాలు అందజేశారు.
సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డివై.చంద్రచూడ్ ఆదివారం ఉదయం తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్నారు. వైకుంఠం క్యూ కాంప్లెక్స్ వద్ద కుటుంబ సభ్యులతో కలిసి వచ్చిన జస్టిస్ డివై.చంద్రచూడ్ కు టిటిడి ఈవో శ్యామల రావు, అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి స్వాగతం పలికారు.
స్వామివారి దర్శనం అనంతరం రంగనాయకుల మండపంలో చీఫ్ జస్టిస్‌కు వేద పండితులు వేదాశీర్వచనం అందించారు. అనంతరం టీటీడీ ఈవో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి తీర్థప్రసాదాలు అందజేశారు.
శనివారం తిరుమల పర్యటనకు వచ్చిన సీజేఐ దంపతులు.. తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారిని దర్శించుకున్నారు. సతీసమేతంగా ఆలయం వద్దకు వచ్చిన జస్టిస్ డాక్టర్ డివై చంద్రచూడ్ కు టీటీడీ ఈవో శ్యామలరావు స్వాగతం పలికారు. ఆలయ అర్చకులు సాంప్రదాయబద్ధంగా స్వాగతం పలికారు. అమ్మవారి దర్శనం అనంతరం చీఫ్ జస్టిస్ దంపతులకు వేద పండితులు వేదశీర్వచనం చేసి అమ్మవారి తీర్థ ప్రసాదాలు అందించారు.
బ్రహ్మోత్సవాలకు విస్తృత ఏర్పాట్లు:
తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలకు విచ్చేసే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేయాలని టిటిడి అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి అధికారులను ఆదేశించారు. తిరుమల అన్నమయ్య భవనంలో శనివారం తిరుపతి ఎస్పీ సుబ్బరాయుడు, సివిఎస్‌వో శ్రీధర్‌తో కలిసి భద్రతా ఏర్పాట్లపై విస్తృతంగా సమీక్షించారు.
భక్తులకు ఇబ్బందులు లేకుండా దర్శనం, వాహనసేవలు జరిగేలా చూడాలని టీటీడీ, పోలీసు ఉన్నతాధికారులను అదనపు ఈవో కోరారు. గత అనుభవాలను దృష్టిలో ఉంచుకుని ఇలాంటివి పునరావృతం కాకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పారు. గరుడసేవ రోజు ఇటువంటి ఇబ్బంది లేకుండా గ్యాలరీలకు అన్నప్రసాదాలు చేరేలా చూడాలని అదనపు ఈఓకు సూచించారు.
ట్రాఫిక్ నియంత్రణ, వాహనాల పార్కింగ్ తదితర అంశాల్లో టీటీడీ భద్రత, జిల్లా పోలీసులు పరస్పరం సమన్వయం చేసుకోవాలన్నారు. వార్షిక బ్రహ్మోత్సవాలలో ఏర్పాట్లను మరియు కార్యక్రమాలను నిశితంగా పర్యవేక్షించడానికి ముఖ్యమైన అధికారులతో ప్రత్యేకమైన వాట్సాప్ గ్రూప్‌ను ఏర్పాటు ఏర్పాటు చెయ్యాలని ఆయన ఆదేశించారు.
తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలు అక్టోబర్ 4 నుంచి ప్రారంభం కానున్నాయి. 12 వరకు జరగనున్న దృష్ట్యా.. అక్టోబర్ 1న కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం నిర్వహించబడుతుందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు ఓ ప్రకటనలో తెలిపారు.
ఈ మొత్తం కార్యాచరణ ఉదయం 6 నుండి 10 గంటల వరకు ఒక మహా యజ్ఞం లా జరుగుతుంది. తర్వాత ప్రధాన దేవతపై ఉన్న వస్త్రాన్ని తొలగించి, లోపల దేవతలు, దీపం మరియు ఇతర పూజ వస్తువులను మరల లోనికి తీసుకొస్తారు . అనంతరం స్వామివారికి ప్రత్యేక పూజలు, నైవేద్యం సమర్పిస్తారు.
సంవత్సరానికి నాలుగు సార్లు ఈ వైదిక కార్యక్రమం నిర్వహిస్తారు. ఉగాది, ఆణివార ఆస్థానం, వైకుంఠ ఏకాదశి మరియు వార్షిక బ్రహ్మోత్సవాలు ముందు వచ్చే మంగళవారం నాడు ఈ వేడుకను నిర్వహించడం ఆనవాయితీ . టీటీడీ అక్టోబర్ 1న విఐపి బ్రేక్ దర్శనాన్ని (ప్రోటోకాల్ విఐపిలు మినహా) రద్దు చేసింది. కనుక సెప్టెంబర్ 30న ఎటువంటి సిఫార్సు లేఖలు స్వీకరించబడవు.