Pawan Kalyan in Tirupati : సనాతన ధర్మం కోసం అవసరమైతే ప్రాణ త్యాగం చేస్తాను - డిప్యూటీ సీఎం పవన్
సనాతన ధర్మానికి భంగం కలిగితే బయటకి వచ్చి పోరాటం చేస్తానని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పునరుద్ఘాటించారు. తిరుపతి వారాహి డిక్లరేషన్ సభలో మాట్లాడిన ఆయన.. సనాతన ధర్మాన్ని కాపాడుకునేందుకు అవసరమైతే ప్రాణ త్యాగం కూడా చేస్తానంటూ కామెంట్స్ చేశారు. భిన్నత్వంలో ఏకత్వం చూపించేదే సనాతన ధర్మమని అన్నారు.
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వర స్వామి వారికి అపచారం జరిగితే చూస్తూ ఊరుకుంటానా..? అని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ప్రశ్నించారు. ఇలా బయటకి వచ్చి మాట్లాడాల్సిన రోజు వస్తుంది అనుకోలేదని వ్యాఖ్యానించారు. తిరుపతి వారాహి డిక్లరేషన్ సభలో మాట్లాడిన ఆయన…"ఈరోజు నాకు అన్యాయం జరిగిందని నేను రాలేదు, ధర్మానికి అవమానం జరిగింది, అన్ని ధర్మాలను గౌరవించే సనాతన ధర్మంపై దాడులు చేస్తుంటే వచ్చాను" అని చెప్పారు.
తిరుమల ప్రసాదాన్ని కల్తీ చేసే పరిస్థితిని వైసీపీ తీసుకొచ్చిందని పవన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలో కూడా ఇదే విషయాన్ని తాను తిరుపతి వారాహి సభలో చెప్పానని గుర్తు చేశారు. సరిదిద్దుకోవాలని చెప్పినా వైసీపీ వారు వినలేదన్నారు. “ఇస్లాం సమాజం అల్లా అంటే ఆగిపోతారు కానీ మనం మాత్రం గోవిందా అంటే ఆగరు. మన దౌర్భాగ్యం మన ధర్మానికి గౌరవం ఇవ్వకపోవడం, మీరు గౌరవించడం నేర్చుకోండి” అంటూ హితవు పలికారు.
ప్రాణత్యాగానికైనా సిద్ధమే - పవన్ కల్యాణ్
“ఈరోజూ నేను ఉప ముఖ్యమంత్రి గానో, జనసేన పార్టీ అధ్యక్షుడిగా మీ ముందుకు రాలేదు, నేను సగటు హిందువుగా, సనాతన ధర్మం పాటించే వ్యక్తిగా, భారతీయుడిగా మీ ముందుకు వచ్చాను. నేను హిందూ మతాన్ని అనుసరిస్తాను, నేను ఇస్లాం, క్రిస్టియానిటి, సిఖ్, ఇతర అన్ని మతాలను గౌరవిస్తాను. భిన్నత్వంలో ఏకత్వం చూపించేది సనాతన ధర్మం, ఇతర మతాలను గౌరవించింది సనాతన ధర్మం. నా సనాతన ధర్మానికి భంగం కలిగితే నేను బయటకి వస్తాను.. పోరాడుతాను, అవసరమైతే ప్రాణ త్యాగం చేస్తాను. నా ఉపముఖ్యమంత్రి పదవి పోయినా సరే నేను భదపడను, ధర్మాన్ని రక్షించడం కోసం ఎంత దూరం అయినా వెళతాను” అని పవన్ కల్యాణ్ కామెంట్స్ చేశారు.
మేం వారిని అనలేదు కదా…!
"ఈరోజు తిరుపతి స్వామి వారి సన్నిధి నుండి కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు పిలుపునిస్తున్నాను, దేశమంతా ఒకటే గళం వినిపించాలి, జాతి, మాట, భేదం లేకుండా మాట్లాడాలి, వారాహి డిక్లరేషన్ ప్రకటిస్తున్నాను. మేము మా NDA కూటమి నాయకుల మీటింగ్ లో తిరుపతి లడ్డు ప్రసాదం కల్తీ అంశంపై మాట్లాడాం.ఏరోజు వైఎస్ జగన్ కల్తీ చేశాడు అని మేము చెప్పలేదు. అయినా సరే వారు గుమ్మడి కాయ దొంగ లాగా బుజాలు తడుముకుంటున్నాడు. మేము తిరుపతి లడ్డూ వైసీపీ కల్తీ చేసింది అని అనలేదు. వారు ఏర్పాటు చేసిన టీటీడీ బోర్డులో తప్పులు జరిగాయి అంటున్నాం. విచారణకు సహకరిస్తా అని చెప్పకుండా, విమర్శలు చేస్తున్నారు, ఎందుకు బుజాలు తడుముకుంటున్నారు..? అని పవన్ కల్యాణ్ నిలదీశారు.
తిరుమలలో ఈవోగా శ్యామలా రావు భాద్యతలు తీసుకున్నాక ఎప్పుడు కల్తీ జరగలేదు అని చెప్తే.. అసలు కల్తీనే జరగలేదు అని వైసీపీ మాట్లాడుతోందని దుయ్యబట్టారు. ఇలా ప్రజలను తప్పదోవ పట్టించి మోసాగించాలని చూస్తారా అని పవన్ ప్రశ్నించారు. “గత టీటీడీ ఈఓ ధర్మారెడ్డి గారు ఎక్కడికి వెళ్ళారు, ఎందుకు కనిపించడం లేదు? ఇక్కడ మాయం అయ్యారు? ఎందుకు బయటకు వచ్చి మాట్లాడటం లేదు? 2005 సమయంలో కూడా ఆయన మీద చాలా ఆరోపణలు ఉన్నాయి, అన్ని బయటకు తీస్తాం” అని ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు.
“వైసీపీకి 11 సీట్లు వచ్చినా బుద్ధిరాలేదు. ఈసారి ఎన్నికలు పెట్టమనండి.. ఒకే సీటుకు పరిమితం చేస్తా. సనాతన ధర్మం పాటించేవారి పట్ల చట్టాలు నిర్ధాక్షిణ్యంగా పనిచేస్తాయి. సనాతన ధర్మాన్ని దూషణ చేసేవారికి కోర్టులు రక్షణ కల్పిస్తున్నాయి. అయినవాళ్లకు ఆకులు.. కానివాళ్లకు కంచాలు అన్నట్లు ఉంది” అని పవన్ కామెంట్స్ చేశారు.
సంబంధిత కథనం