Pawan Kalyan: ఆ తమిళ డైరెక్టర్ ఫిల్మ్ మేకింగ్ అంటే ఇష్టం: పవన్ కల్యాణ్
Pawan Kalyan: తమిళంతో తనకు ఇష్టమైన డైరెక్టర్ ఎవరో చెప్పారు పవర్ స్టార్ పవన్ కల్యాణ్. తనకు నచ్చిన కమెడియన్ ఎవరో కూడా వెల్లడించారు. తమిళ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ విషయాలను పంచుకున్నారు.
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, పవర్ స్టార్ పవన్ కల్యాణ్ తదుపరి చిత్రం ఎప్పుడెప్పుడూ వస్తుందా అని ఆయన అభిమానులతో పాటు సినీ ప్రేక్షకులంతా వేయికళ్లతో ఎదురుచూస్తున్నారు. రాజకీయాల్లో బిజీ అవడం, డిప్యూటీ సీఎంగా బాధ్యతలు తీసుకోవడంతో సినిమాల నుంచి కొన్ని నెలల గ్యాప్ తీసుకున్నారు పవన్. ఇటీవలే మళ్లీ షూటింగ్‍ను మొదలుపెట్టారు. హరి హర వీరమల్లు చిత్రాన్ని ముందుగా పూర్తి చేసే పనిలో ఉన్నారు. ఈ తరుణంలో తాజాగా తమిళ మీడియాకు ఓ ఇంటర్వ్యూ ఇచ్చారు పవన్.
లోకేశ్ ఫిల్మ్ మేకింగ్ ఇష్టం
తమిళంలో నచ్చిన డైరెక్టర్ ఎవరు అనే ప్రశ్న పవన్ కల్యాణ్‍కు ఎదురైంది. దీనికి ఆయన రియాక్ట్ అయ్యారు. లోకేశ్ కనగరాజ్ ఫిల్మ్ మేకింగ్ స్టైల్ తనకు ఇష్టమని పవన్ చెప్పారు. ఆయన దర్శకత్వంలో దళపతి విజయ్ హీరోగా నటించిన లియో చిత్రాన్ని తాను చూశానని అన్నారు. దిగ్గజ డైరెక్టర్ మణిరత్నం సినిమాలు అంటే తనకు ఇష్టమని పవన్ కల్యాణ్ చెప్పారు.
లోకేశ్ కనగరాజ్ ఫిల్మ్ మేకింగ్ ఇష్టమని పవన్ కల్యాణ్ చెప్పిన వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. లోకేశ్ చాలా సక్సెస్‍ఫుల్ దర్శకుడిగా ఉన్నారు. తన మార్క్ యాక్షన్ చిత్రాలతో వరుస హిట్‍లు కొడుతున్నారు. స్టార్ డైరెక్టర్ స్థాయికి ఎదిగారు.
లోకేశ్‍తో పవన్ ఓ మూవీ చేస్తారని గతంలో రూమర్లు విపరీతంగా వచ్చాయి. పవర్ స్టార్‌కు లోకేశ్ స్టోరీ నరేట్ చేశారని కూడా పుకార్లు వినిపించాయి. అయితే అది సాధ్యం కాలేదు. ఈ ప్రాజెక్టుపై ఎలాంటి వివరాలు బయటికి రాలేదు.
కాగా, తమిళ స్టార్ కమెడియన్ యోగిబాబు యాక్టింగ్ పర్ఫార్మెన్స్ అంటే తనకు ఇష్టమని కూడా పవన్ కల్యాణ్ చెప్పారు. అతడు ఓ గ్రామానికి ప్రెసిడెంట్ అయ్యే ఓ మూవీని చూశానని గుర్తు చేసుకున్నారు.
తిరుమలకు పవన్
తిరుమలకు పవన్ కల్యాణ్ చేరుకున్నారు. అలిపిరి మెట్లు మార్గం ద్వారా ఆయన తిరుమల కొండ మీదికి వెళ్లారు. రాత్రి తిరుమలలో బస చేసిన పవన్ నేడు శ్రీ వేంకటేశ్వర స్వామిని దర్శించుకోనున్నారు.
హరి హర వీరమల్లు సినిమా షూటింగ్‍ను పవన్ ఇటీవలే మళ్లీ షురూ చేశారు. ఈ మూవీని 2025 మార్చి 28వ తేదీన విడుదల చేయనున్నట్టు మూవీ టీమ్ ప్లాన్ చేసింది. నాలుగేళ్ల కిందట షూటింగ్ మొదలైన ఈ చిత్రం ఆలస్యమవుతూ వస్తోంది. ఈ పీరియడ్ యాక్షన్ అడ్వెంచర్ చిత్రానికి ఎక్కువ శాతం దర్శకత్వం వహించిన క్రిష్ ఆ బాధ్యత నుంచి తప్పుకున్నారు. జ్యోతి కృష్ణ ప్రస్తుతం ఈ మూవీకి దర్శకుడిగా ఉన్నారు. విజయవాడ సమీపంలో ఈ చిత్రం షూటింగ్ జరుగుతోంది.
హరి హర వీరమల్లు చిత్రం నుంచి తొలి పాటను తెచ్చేందుకు కూడా మూవీ టీమ్ రెడీ అవుతోంది. దీపావళి సందర్భంగా అక్టోబర్ చివర్లో పాటను తీసుకొచ్చేందుకు ప్లాన్ చేస్తోంది. పవన్ కల్యాణ్ స్వయంగా ఈ పాటను పాడారు. ఈ సాంగ్ చిత్రీకరణ కూడా ఇటీవలే పూర్తయింది.
సుజీత్ దర్శకత్వంలో ‘ఓజీ’, హరీశ్ శంకర్ డైరెక్షన్‍లో ‘ఉస్తాద్ భగత్ సింగ్’ సినిమాలు కూడా పవన్ లైనప్‍లో ఉన్నాయి. ఓజీ చిత్రానికి క్రేజ్ ఓ రేంజ్‍లో ఉంది. హరి హర వీరమల్లు తర్వాత ఓజీనే పవన్ పూర్తి చేయనున్నారు.