Hari Hara Veera Mallu First Song: హరి హర వీరమల్లు నుంచి ఫస్ట్ సాంగ్ అప్పుడే రానుందా! పవన్ కల్యాణ్ గాత్రంతో..
Hari Hara Veera Mallu First Song: హరి హర వీరమల్లు చిత్రం నుంచి ఫస్ట్ సాంగ్ కోసం మూవీ టీమ్ ప్లాన్ చేసినట్టు సమాచారం బయటికి వచ్చింది. తొలి పాటను ఎప్పుడు రిలీజ్ చేయాలో మేకర్స్ డిసైడ్ అయ్యారట. ఈ పాటను పవన్ కల్యాణే పాడారని తెలుస్తోంది.
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సినిమాల నుంచి అప్‍డేట్స్ ఎప్పుడు వస్తాయా అని అభిమానులతో పాటు సినీ ప్రేక్షకులందరూ ఎదురుచూస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం అయిన జనసేన అధినేత పవన్ సినిమాలకు కొన్ని నెలలు బ్రేక్ ఇచ్చారు. అయితే, ఇటీవలే హరి హర వీరమల్లు షూటింగ్‍ను ఆయన మళ్లీ మొదలుపెట్టారు. చిత్రీకరణలో పాల్గొంటున్నారు. పవన్ లైనప్‍లో ఉన్న మూడు చిత్రాల్లో ఈ మూవీనే ముందుగా రిలీజ్ కానుంది. హరి హర వీరమల్లు నుంచి తొలి సాంగ్ సిద్ధమవుతోంది.
పండుగకు పాట!
హరి హర వీరమల్లు చిత్రం నుంచి తొలి పాటను దీపావళి సందర్భంగా అక్టోబర్ చివర్లో తీసుకొచ్చేందుకు మూవీ టీమ్ ప్లాన్ చేస్తోందని తెలుస్తోంది. ఇందుకోసం సిద్ధం అవుతున్నట్టు ఇండస్ట్రీ వర్గాల నుంచి టాక్ బయటికి వచ్చింది. దీంతో దీపావళికి పవన్ అభిమానులకు అదిరిపోయే గిఫ్ట్ రావడం ఖాయంగా కనిపిస్తోంది.
పాట షూటింగ్ ఫినిష్
హరి హర వీరమల్లు షూటింగ్ ప్రస్తుతం విజయవాడలో జరుగుతోంది. ఇందుకోసం అక్కడ ఓ భారీ సెట్ వేసింది మూవీ టీమ్. ఈ పాటకు సంబంధించిన షూటింగ్ తాజాగా పూర్తయినట్టు సమాచారం బయటికి వచ్చింది. సాంగ్ కూడా ఇప్పటికే రెడీ అయిపోయింది. అందుకే దీపావళికి ఈ పాటను రిలీజ్ చేసేందుకు మూవీ టీమ్ డిసైడ్ అయిందని టాక్.
పాట పాడిన పవన్
హరి హర వీరమల్లు నుంచి రానున్న ఈ పాటను హీరో పవన్ కల్యాణ్ స్వయంగా పాడారు. ఆయన గాత్రంతో ఈ సాంగ్ ఉండనుంది. దీంతో మరింత ఆసక్తి పెరిగిపోయింది. గతంలోనూ పవన్ కొన్ని చిత్రాల్లో పాడారు. ఇప్పుడు ఈ చిత్రానికి కూడా పాట ఆలపించారు. దీంతో ఈ సాంగ్ ఎలా ఉంటుందా అనే క్యూరియాసిటీ మరింత పెరిగిపోయింది. ఆస్కార్ అవార్డు విన్నర్ ఎంఎం కీరవాణి ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు.
మొఘలుల కాలం నాటి బ్యాక్‍డ్రాప్‍లో పీరియడ్ యాక్షన్ అడ్వెంచర్ మూవీగా హరి హర వీరమల్లు రూపొందుతోంది. ఈ సినిమా ఫస్ట్ పార్ట్‌ను 2025 మార్చి 28వ తేదీన రిలీజ్ చేయనున్నట్టు మూవీ టీమ్ ఇటీవలే వెల్లడించింది. షూటింగ్ మళ్లీ షూరూ కావటంతో రిలీజ్ డేట్‍ను ఖరారు చేసింది.
స్టార్ డైరెక్టర్ క్రిష్ దర్శకత్వంలో హరి హర వీరమల్లు చిత్రం షూటింగ్ నాలుగేళ్ల క్రితమే మొదలైంది. అయితే, ఆలస్యమవుతూ వచ్చింది. ప్రాజెక్ట్ ముందుకు సాగలేదు. ఈ ఏడాదిలోనే మళ్లీ ఈ చిత్రాన్ని మేకర్స్ పట్టాలెక్కించారు. అయితే, దర్శకత్వ బాధ్యతల నుంచి క్రిష్ తప్పుకున్నారు. ఆ స్థానంలో ఏఎం జ్యోతికృష్ణ ఈ మూవీకి ఇప్పుడు దర్శకత్వం వహిస్తున్నారు.
హరి హర వీరమల్లు చిత్రంలో బాలీవుడ్ స్టార్ బాబీ డియోల్.. ఔరంగజేబు పాత్ర పోషిస్తున్నారు. నిధి అగర్వాల్ హీరోయిన్‍గా చేస్తున్నారు. విక్రమ్‍జీత్ విర్క్, నోరా ఫతేహి, నర్గీస్ ఫక్రి, జిస్సు సెంగుప్త కీరోల్స్ చేస్తున్నారు. పాన్ ఇండియా రేంజ్‍లో ఈ చిత్రం రిలీజ్ కానుంది.
పవన్ కల్యాణ్ లైనప్‍లో ఓజీ మూవీపై విపరీతమైన హైప్ ఉంది. ఈ గ్యాంగ్‍స్టర్ యాక్షన్ మూవీకి సుజీత్ దర్శకత్వం వహిస్తున్నారు. ముందుగా ఓజీ వస్తుందని అంచాలు రాగా.. హరి హర వీరమల్లునే సిద్ధమవుతోంది. హరీశ్ శంకర్ దర్శకత్వంలో ఉస్తాద్ భగత్ సింగ్ కూడా పవన్ లైనప్‍లో ఉంది.