Pawan Kalyan Birthday: పవన్ కల్యాణ్ పుట్టిన రోజున రావాల్సిన అప్‍డేట్స్ అన్నీ క్యాన్సల్.. కారణం ఇదే
Pawan Kalyan Birthday: పవన్ కల్యాణ్ పుట్టిన రోజున అప్‍డేట్ల కోసం అభిమానుల్లో చాలా ఆసక్తి ఉంది. ఆయన లైనప్‍లోని మూడు చిత్రాల నుంచి అప్‍డేట్స్ రావాల్సి ఉంది. అయితే, రావాల్సిన అన్ని అప్‍డేట్లు క్యాన్సల్ అయ్యాయి. అందుకు కారణం ఏంటంటే..
Pawan Kalyan Birthday: ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, స్టార్ హీరో పవర్ స్టార్ పవన్ కల్యాణ్.. సోమవారం (సెప్టెంబర్ 2) తన 56వ పుట్టిన రోజు జరుపుకోనున్నారు. ఈ సెలెబ్రేషన్లకు ఆయన అభిమానులు సిద్ధమయ్యారు. గబ్బర్ సింగ్ చిత్రం మళ్లీ థియేటర్లలో రీ-రిలీజ్ కానుంది. కాగా, పవన్ కల్యాణ్ హీరోగా లైనప్‍లో ఉన్న ఓజీ, హరిహర వీరమల్లు, ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాల నుంచి ఆయన బర్త్ డే సందర్భంగా సోమవారం అప్‍డేట్స్ రావాల్సి ఉంది. అయితే, అవన్నీ క్యాన్సల్ అయ్యాయి.
వరదల వల్ల..
భారీ వర్షాలతో తెలుగు రాష్ట్రాలు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ అతలాకుతలం అవుతున్నాయి. చాలా చోట్ల వరదలు వచ్చాయి. భారీ వానలతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. దీంతో తన పుట్టిన రోజైన సెప్టెంబర్ 2న ఎలాంటి సినిమా అప్‍డేట్లు ఇవ్వొద్దని మూవీ టీమ్‍లకు పవన్ కల్యాణ్ సూచించారని సమాచారం. అందుకే సెప్టెంబర్ 2న రావాల్సిన మూడు చిత్రాల అప్‍డేట్స్ రద్దయ్యాయి. పవన్ చిత్రాలపై ఏ అప్‍డేట్ రాదు.
ఓజీ మేకర్స్ నుంచి..
పపన్ పుట్టిన రోజు సందర్భంగా ఓజీ నుంచి కంటెంట్ ఏమీ రాదని ఆ చిత్రాన్ని నిర్మిస్తున్న డీవీవీ ఎంటర్‌టైన్‍మెంట్స్ వెల్లడించింది. ఓజీ సినిమాను కొన్నేళ్ల పాటు సెలెబ్రేట్ చేసుకుంటామని పేర్కొంది. “ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలు, వరద విలయాల కారణంగా రేపు బర్త్‌డే కంటెంట్ రిలీజ్‍ను రద్దు చేస్తున్నాం. రానున్న చాలా సంవత్సరాలు సెలెబ్రేట్ చేసుకునేలా ఓజీ సినిమా ఉంటుంది. దీన్ని కలిసికట్టుగా అధిగమిద్దాం. త్వరలో భారీగా సెలెబ్రేట్ చేసుకుందా” అని డీవీవీ ఎంటర్‌టైన్‍మెంట్ బ్యానర్ ఆదివారం ట్వీట్ చేసింది.
ఓజీ సినిమా తొలి పాట అప్‍డేట్‍తో పాటు ఈ మూవీ కొత్త రిలీజ్ డేట్‍పై కూడా అప్‍డేట్ వస్తుందని అభిమానులు ఆశించారు. తొలి పాట డేట్ చెబుతామని మూవీ టీమ్ కూడా వెల్లడించింది. అయితే, వరదల కారణంగా ఇవి రద్దయ్యాయి. వచ్చే ఏడాది మార్చి 27న ఈ చిత్రాన్ని విడుదల చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తోంది.
ఓజీ చిత్రానికి సుజీత్ దర్శకత్వం వహిస్తున్నారు. పవన్ కల్యాణ్ ఈ ఏడాది ఎన్నికల్లో బిజీ అవటం, ఆ తర్వాత ఉప ముఖ్యమంత్రి పదవి చేపట్టడంతో ఈ మూవీ షూటింగ్ నిలిచిపోయింది. అయితే, త్వరలోనే ఆయన మళ్లీ షూటింగ్‍కు వెళ్లే అవకాశాలు ఉన్నాయి.
హరిహర వీరమల్లు ఇలా..
పవన్ కల్యాణ్ పుట్టిన రోజున హరిహర వీరమల్లు నుంచి ఓ పోస్టర్ తీసుకొద్దామని అనుకున్నామని, కానీ రద్దు చేస్తున్నట్టు ఈ మూవీ టీమ్ వెల్లడించింది. “పవర్ ఫ్యాన్స్ కోసం ఓ ఎగ్జైటింగ్ పోస్టర్ తీసుకొద్దామని మేం ప్లాన్ చేశాం. ప్రస్తుతం ఉన్న తీవ్రమైన వరదల పరిస్థితుల్లో ఇది సరైన సమయం కాదని భావిస్తున్నాం. అందరూ అర్థం చేసుకుంటారని ఆశిస్తున్నాం” అని మెగా సూర్య ప్రొడక్షన్స్ సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. పవన్ కల్యాణ్ విలువలను దృష్టిలో ఉంచుకొని అప్‍డేట్‍కు ఇది సరైన టైమ్ కాదని ఈ నిర్ణయం తీసుకున్నట్టు వెల్లడించింది.
హరిహర వీరమల్లు సినిమాకు తొలుత క్రిష్ దర్శకత్వం వహించగా.. ఇటీవలే ఆయన తప్పుకున్నట్టు మేకర్స్ వెల్లడించారు. ఈ పీరియాడిక్ యాక్షన్ అడ్వెంచర్ మూవీ దర్శకత్వ బాధ్యతలు ఇప్పుడు ఏఎం జ్యోతికృష్ణ చేతుల్లో ఉన్నాయి.
హరీశ్ శంకర్ దర్శకుడిగా ఉన్న ఉస్తాద్ భగత్ సింగ్ చిత్రం నుంచి కూడా పవన్ కల్యాణ్ పుట్టిన రోజున స్పెషల్ పోస్టర్ తెచ్చేందుకు మేకర్స్ ముందుగా నిర్ణయించారని సమాచారం బయటికి వచ్చింది. అయితే, ఇప్పుడు అది రద్దయింది.