Vijaywada Police Boss: సీపీలు వస్తారు, పోతారు జనం గుర్తు పెట్టుకునేది మాత్రం కొందరినే.. 25 ఏళ్లలో నలుగురికే ఆ గుర్తింపు-commissioners come and go but people remember only a few officers ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Vijaywada Police Boss: సీపీలు వస్తారు, పోతారు జనం గుర్తు పెట్టుకునేది మాత్రం కొందరినే.. 25 ఏళ్లలో నలుగురికే ఆ గుర్తింపు

Vijaywada Police Boss: సీపీలు వస్తారు, పోతారు జనం గుర్తు పెట్టుకునేది మాత్రం కొందరినే.. 25 ఏళ్లలో నలుగురికే ఆ గుర్తింపు

Sarath chandra.B HT Telugu
Apr 16, 2024 05:30 AM IST

Vijaywada Police Boss: బెజవాడలో పోలీస్ ఉద్యోగంలో పని చేయాలంటే అయితే తలొంచుకుని పోవాలి లేదంటే తలెత్తుకుని నిలబడాలి. పాతికేళ్లలో బెజవాడ కమిషనర్లుగా ఎంతోమంది ఐపీఎస్‌లు పనిచేసినా వారిలో ముగ్గురు నలుగురు మాత్రమే సమర్థులుగా గుర్తింపు పొందడానికి కారణం అదే...

పాతికేళ్లలో 20మంది పనిచేస్తే  సీపీల్లో జనానికి గుర్తున్నది నలుగురు మాత్రమే
పాతికేళ్లలో 20మంది పనిచేస్తే సీపీల్లో జనానికి గుర్తున్నది నలుగురు మాత్రమే

Vijaywada Police Boss: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో అత్యంత సమస్యాత్మక పోస్టింగ్‌లలో ఒకటిగా భావించే బెజవాడ కమిషనరేట్‌లో Police commissioners ఇప్పటి వరకు నలుగురైదుగురిని మాత్రమే నగర ప్రజలు గుర్తు పెట్టుకున్నారు.ముఖ్యమంత్రి జగన్మోహన్‌ రెడ్డిపై దాడి నేపథ్యంలో విజయవాడలో పనిచేసిన ఐపీఎస్‌ అధికారుల పనితీరు చర్చనీయాంశంగా మారింది. పాతికేళ్లలో 20మంది సీపీలుగా పనిచేస్తే వారిలో నలుగురికి Only Few Officers మాత్రమే ప్రజల నుంచి పాస్ మార్కులు లభించాయి.

ఐపీఎస్‌ ఉద్యోగంలో భాగంగా బదిలీపై వస్తారు, పోతారు జనంతో పనేముంది అనుకున్న వాళ్లను జనం కూడా అలాగే మర్చిపోయారు. పాతికేళ్లలో 20మంది ఐపీఎస్ అధికారులు సీపీలుగా పనిచేస్తే వారిలో నలుగురు మాత్రమే ఇప్పటికీ జనానికి గుర్తుండి పోయారు.

విజయవాడ పోలీస్ కమిషనరేట్‌గా ఏర్పడిన తర్వాత మొదటి సీపీగా పనిచేసిన కేఎస్‌ వ్యాస్‌ను నలభై ఏళ్ల తర్వాత కూడా ఇప్పటికి నగర ప్రజలు గుర్తు పెట్టుకున్నారు. ఆ తర్వాత ఆ స్థాయి పనితీరును మరో ముగ్గురు నలుగురు ఐపీఎస్‌లు మాత్రమే ప్రదర్శించారు.

2000వేల సంవత్సరం నుంచి 2003వరకు విజయవాడ పోలీస్ కమిషనరేట్‌కు స్వర్ణయుగంగా భావిస్తారు. ఖాకీ యూనిఫాంకు ఓ గుర్తింపు, గౌరవం దక్కడమనేది అప్పుడే మొదలైంది. రాజకీయ ఒత్తిళ్లను, విధి నిర్వహణలో సవాళ్లను ఎదుర్కొంటూ

నేరాలను నియంత్రించడం, వ్యవస్థీకృత నేరాల ముఠాలకు అడ్డుకట్ట వేయడం కత్తిమీద సాములా ఉంటుంది. అందుకే విజయవాడలో పనిచేయడానికి చాలామంది అధికారులు సుముఖత చూపేవారు కాదు.

ఇక్కడ పోస్టింగ్ అంటే పనిష్మెంట్…

విజయవాడలో పోస్టింగ్ అంటే పనిష్మెంట్‌గా భావించిన సందర్భాలు కూడా ఉన్నాయి. 1999లో విజయవాడ సీపీగా బాధ్యతలు చేపట్టిన సుదీప్ లక్టాకియా రాజకీయ ఒత్తిళ్లను తట్టుకుని సమర్ధుడిగా గుర్తింపు పొందారు. విజయవాడలో ఎవరిని ఖాతరు చేయని తత్వంతో ఇబ్బందులు పడ్డారు. తర్వాతి కాలంలో కేంద్ర సర్వీసులకు వెళ్లిన లక్టాకియా ఏకంగా ప్రధాని భద్రతను పర్యవేక్షించే ఎస్పీజీ బాధ్యతలు చేపట్టారు. ఆ తర్వాత కాలంలో సిఆర్‌పిఎఫ్‌ డీజీగా బాధ్యతలు అప్పగించారు.

ఆ రోజుల్లోనే కమిషనరేట్‌కు స్వర్ణయుగం

లక్టాకియా తర్వాత కాలంలో 2001 జూన్‌ 6న బాధ్యతలు చేపట్టిన నిమ్మగడ్డ సురేంద్రబాబును విజయవాడ ప్రజలు ఇప్పటికీ సూపర్‌ పోలీస్‌గా గుర్తు చేసుకుంటారు. విజయవాడను గడగడలాడించిన నేరగాళ్ళకు చెమటలు పట్టించారు. వ్యవస్థీకృత నేరాలు, దొంగతనాలు, దోపిడీలకు పాల్పడే వారిపై ఉక్కు పాదం మోపే వారు.

సురేంద్రబాబు సీపీగా పనిచేసింది రెండేళ్ల కాలమే అయినా ఆయన దూకుడును ప్రభుత్వ అధినేతలు కూడా తట్టుకోలేకపోయారు. క్రిమినల్స్ వ్యవహారంలో నిర్దాక్షిణ్యంగా వ్యవహరిస్తారనే విమర్శ కూడా ఆయనపై ఉన్నా, విజయవాడ ప్రజలు ప్రశాంతంగా గడిపింది మాత్రమే ఆయన సీపీ ఉన్న సమయంలోనేనని ఇరవై ఏళ్ల తర్వాత కూడా ప్రజలు గుర్తు చేసుకుంటారు.

అక్రమాలు, వేధింపులు, దౌర్జన్యాలు, గుండాగిరీ విషయంలో ఎంత పెద్ద నాయకుడికైనా చెమటలు పట్టించేవారు. విజయవాడ ట్రాఫిక్ సమస్యలను దృష్టిలో ఉంచుకుని రామవరప్పాడు రింగ్ రోడ్డులో ప్రభుత్వ స్థలం ప్రముఖ నాయకుడు కబ్జా చేయకుండా ఏకంగా పోలీస్ శాఖ పేరుతో బోర్డును ఏర్పాటు చేశారు. కోట్ల ఖరీదు చేసే స్థలాన్ని ఆ తర్వాత కాలంలో వచ్చిన ప్రభుత్వాలు ఆ నాయకుడినే అప్పనంగా అప్పగించేశాయి.

సురేంద్ర బాబు తర్వాత ఏబీ వెంకటేశ్వరరావు విజయవాడ సీపీగా ఏడు నెలలు పనిచేశారు. స్థానికుడు కావడంతో ఆయన వివాదాలకు దూరంగా ఉండేవారు. 2004లో కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఆయనను బదిలీ చేశారు. ఏబీ వెంకటేశ్వరరావు స్థానంలో వచ్చిన తెన్నేటి కృష్ణప్రసాద్ సరిగ్గా రెండు నెలలు మాత్రమే విజయవాడలో పనిచేశారు. కృష్ణా పుష్కరాలలో జరిగిన తొక్కిసలాటకు బాధ్యుడ్ని చేస్తూ ఆయనపై వేటు వేశారు.

ఇద్దరు ఐపీఎస్‌లకు మాత్రమే ప్రత్యేక గుర్తింపు
ఇద్దరు ఐపీఎస్‌లకు మాత్రమే ప్రత్యేక గుర్తింపు

గడగడలాడించిన ఉమేష్ షరాఫ్

ఆ తర్వాత వచ్చిన ఉమేష్‌ షరాఫ్ కూడా సురేంద్ర బాబు తరహాలోనే అరాచక శక్తుల్ని గడగడలాడించారు. 2004 సెప్టెంబర్ నుంచి 2006 నవంబర్‌ వరకు సీపీగా పనిచేసిన ఉమేష్ షరాఫ్ స్థానికుడు కాకపోవడంతో ఆయనపై పైరవీలు పనిచేసేవి కాదు. భాష రాకపోవడంతో ఆయన ఎవరి మాటలు వినాల్సిన అవసరం ఉండేది కాదు. విధి నిర్వహణలో నిక్కచ్చిగా వ్యవహరించారనే పేరు తెచ్చుకున్నారు.

ఉమేష్ షరాఫ్ తర్వాత బాధ్యతలు చేపట్టిన సివి.ఆనంద్‌ రెడ్డిని రాజకీయ సిఫార్సులతో విజయవాడలో నియమించారు. ఉమేష్ షరాఫ్ కాంగ్రెస్‌ నాయకుల మాటలు ఖాతరు చేయకపోవడం, ఎవరి పప్పులు ఉడక్కపోవడంతో అప్పట్లో నాయకులు ఏరికోరి ఆయన్ని విజయవాడ సీపీగా తెచ్చుకున్నారు. ఆయేషా మీరా హత్య కేసు వ్యవహ‍ారంతో ఆయన చిక్కుల్లో పడ్డారు. 2008 ఏప్రిల్‌లో విజయవాడ నుంచి నిష్క్రమించారు.

సీవీ ఆనంద్ తర్వాత విజయవాడ సీపీగా కసిరెడ్డి రాజేంద్రనాథ్ రెడ్డి బాధ్యతలు నిర్వహించారు. 2008 ఏప్రిల్ నుంచి 2010 ఏప్రిల్ వరకు విజయవాడ సీపీగా పనిచేశారు. ఆయన సీపీగా పనిచేసిన సమయంలో వివాదాలకు దూరంగా కాలం గడిపేశారు.

పిఎస్సార్‌ ఆంజనేయులు, అమిత్ గార్గ్‌ అదే స్థాయిలో

2010లో విజయవాడ సీపీగా బాధ్యతలు చేపట్టిన పిఎస్సార్ ఆంజనేయులు కూడా నేరాల్ని నియంత్రించడంలో కీలకంగా వ్యవహ‍రించారు. రాజకీయ నేతల ఆగడాలకు అడ్డుకట్ట వేశారు. సురేంద్ర బాబు తర్వాత అంత కఠినంగా వ్యవహరించిన ఐపీఎస్ అధికారిగా గుర్తింపు తెచ్చుకున్నారు. ఏడాదిలోపే అనూహ్య పరిణామాలతో ఆయన విజయవాడను విడిచి పెట్టాల్సి వచ్చింది.

2011 జనవరి నుంచి జులై వరకు పనిచేసిన అమిత్‌ గార్గ్ కూడా వ్యవస్థీకృత నేరాల నిరోధం విషయంలో కఠినంగా వ్యవహరించారు. పేకాట క్లబ్బులపై దాడులతో నగర ప్రముఖుల్ని హడలెత్తించారు. అమిత్ గార్గ్‌ను విజయవాడ నుంచి తప్పించడానికి విశ్వ ప్రయత్నాలు చేసి ఆర్నెల్లలోనే విజయవాడ నుంచి పంపేశారు. ఆ తర్వాత వచ్చిన మధుసూదన్ రెడ్డి తన పనేదో తాను చూసుకుని వెళ్లిపోయారు.దాదాపు రెండేళ్ల పాటు సీపీగా పనిచేశారు.

పదేళ్లుగా తిరోగమనం…

2013 మేలో బాధ్యతలు చేపట్టిన బత్తిన శ్రీనివాసులు, రాష్ట్ర విభజన తర్వాత విజయవాడ సీపీగా రెండోసారి వచ్చిన ఏబీ వెంకటేశ్వరరావు ఆ తర్వాత గౌతమ్ సవాంగ్‌,ద్వారకా తిరుమల రావులు సీపీలుగా పనిచేశారు. పిఎస్సార్ ఆంజనేయులు, అమిత్‌ గార్గ్ వంటి వారికి జరిగిన అనుభవాలతో ఆ తర్వాత పోలీస్ కమిషనర్లుగా వచ్చిన అధికారులు రాజకీయ నాయకులకు ఇబ్బంది కలగకుండా నడుచుకునే వారు.

గౌతమ్‌ సవాంగ్ హయంలో కాల్‌మనీ సెక్స్‌ రాకెట్ వ్యవహారం వెలుగు చూసినా నిందితుల్ని తప్పించారనే విమర్శలు తప్పలేదు. ఏబీ వెంకటేశ్వరావు రెండోసారి బాధ్యతలు చేపట్టిన తర్వాత తనదైన ముద్ర వేసేందుకు ప్రయత్నించినా రాజకీయ ఒత్తిళ్ల నేపథ్యంలో అది సాధ్యపడలేదు. బత్తిన శ్రీనివాసులు , కాంతిరాణాలు ఎవరిని నొప్పించకుండా నడుచుకున్నారనే అపప్రదను మూటగట్టుకున్నారు.

IPL_Entry_Point

సంబంధిత కథనం