CM VZRM Visit: రైలు ప్రమాద బాధితుల్ని పరామర్శించనున్న సిఎం జగన్
CM VZRM Visit: విజయనగరం జిల్లాలో జరిగిన ఘోర రైలు ప్రమాద స్థలాన్ని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పరిశీలించనున్నారు. తాడేపల్లి నుంచి విజయనగరం పర్యటనకు సిఎం జగన్మోహన్ రెడ్డి బయల్దేరారు. ఘటనా స్థలాన్ని పరిశీలించిన తర్వాత క్షతగాత్రుల్ని సిఎం పరామర్శిస్తారు.
CM VZRM Visit: ఏపీ సిఎం జగన్మోహన్ రెడ్డి విజయనగరం జిల్లా పర్యటనకు బయల్దేరారు. ఆదివారం రాత్రి విజయనగరం జిల్లాలో కంటాకపల్లి వద్ద రైలు ప్రమాద ఘటనా స్థలానికి ముఖ్యమంత్రి వైయస్ జగన్ పరిశీలించనున్నారు. అనంతరం విజయనగరం, విశాఖ ఆస్పత్రులలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను ముఖ్యమంత్రి పరామర్శించనున్నారు. ముఖ్యమంత్రి పర్యటనకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.
ముఖ్యమంత్రి విజయనగరం పర్యటన ఖరారు కావడం చర్చనీయాంశంగా మారింది. గతంలో ఎల్టీ పాలిమర్స్ గ్యాస్ లీకేజీ దుర్ఘటన, కచ్చలూరు బోటు ప్రమాదం మినహా మిగిలిన సందర్భాల్లో పర్యవేక్షణ బాధ్యతలు అధికారులకే సిఎం అప్పగించే వారు. ప్రమాదాలు, ప్రకృతి విపత్తులు, వరదలు, తుఫాన్ల వంటి వాటి విషయంలో మొదటి బాధ్యత అధికారులు, ప్రభుత్వ ఉద్యోగులకే ఉంటుందని సిఎం పలుమార్లు చెప్పారు.
తాను పర్యటించడం వల్ల సహాయ చర్యలకు అటంకం కలగడం తప్ప ఉపయోగం ఉండదని వివరించే వారు. కోవిడ్ సమయంలో సైతం ముఖ్యమంత్రి ఈ వైఖరికే కట్టుబడి ఉన్నారు. ఆ తర్వాత కాలంలో గోదావరి వరదల్లో నష్టాన్ని అంచనా వేయడానికి స్వయంగా క్షేత్ర స్థాయి పర్యటనలకు వచ్చారు. వరద సహాయ చర్యలకు అటంకం ఉండకూడదని తెరిపి ఇచ్చిన తర్వాత పర్యటించే వారు. వరుసగా రెండేళ్లుగా గోదావరి వరదలు వచ్చిన సమయంలో ఇలాగే చేశారు.
పరిహారం పంపిణీ పూర్తైన తర్వాత వరద ప్రభావిత ప్రాంతాల్లో సిఎం పర్యటన జరిగేది. తాజాగా విజయనగరం జిల్లా రైలు ప్రమాదం జరిగిన వెంటనే ఉత్తరాంధ్ర పర్యటనకు రెడీ కావడం మారుతున్న వైఖరికి అద్దం పడుతోంది. ముఖ్యమంత్రి త్వరలో ఉత్తరాంద్ర కేంద్రంగా పాలన సాగించాలని భావిస్తున్నారు. దీంతో పాటు ఎన్నికలు సమీపిస్తుండటంతో విపక్షాలకు ఏమాత్రం అవకాశం ఇవ్వకూడదనే ఉద్దేశంతోనే సిఎం విజయనగరం పర్యటనకు రెడీ అయినట్టు తెలుస్తోంది.
సిఎం పర్యటనలో మార్పులు…
సీఎం జగన్ విజయనగరం జిల్లా పర్యటనలో స్వల్ప మార్పులు చేశారు. రైల్వే అధికారుల విజ్ఞప్తి మేరకు రైలు ప్రమాద ఘటనా స్థల పరిశీలన కార్యక్రమం రద్దు చేశారు. ఘటనా స్థలంలో ప్రమాదానికి గురైన బోగీలను తొలగించి యుద్ధ ప్రాతిపదికన ట్రాక్ పునరుద్ధరణ పనులు చేపడుతున్నట్లు అధికారులు సిఎం దృష్టికి తీసుకువచ్చారు. సీఎం ఘటనా స్థలానికి వస్తే ట్రాక్ పునరుద్ధరణ పనులు ఆలస్యమయ్యే అవకాశం ఉందని రైల్వే అధికారులు విజ్ఞప్తి చేయడంతో సిఎం పర్యటన రద్దు చేసుకున్నారు. రైల్వే అధికారుల విజ్ఞప్తితో ప్రమాద ఘటనా స్థల పరిశీలన కార్యక్రమం రద్దు చేసుకుని నేరుగా విజయనగరం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను పరామర్శించనున్నారు.