CM CBN in Tirumala : తిరుమలలో వీఐపీ సంస్కృతి తగ్గాలి - సీఎం చంద్రబాబు-chief minister nara chandrababu naidu review with ttd officials in tirumala ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Cm Cbn In Tirumala : తిరుమలలో వీఐపీ సంస్కృతి తగ్గాలి - సీఎం చంద్రబాబు

CM CBN in Tirumala : తిరుమలలో వీఐపీ సంస్కృతి తగ్గాలి - సీఎం చంద్రబాబు

Maheshwaram Mahendra Chary HT Telugu
Oct 05, 2024 10:41 AM IST

టీటీడీ అధికారులతో పద్మావతి అతిథి గృహంలో ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్షించారు. తిరుమల పవిత్రత, నమ్మకం కాపాడేలా ప్రతి ఒక్కరూ పనిచేయాలని స్పష్టం చేశారు. కొండపై గోవింద నామస్మరణ తప్ప మరో మాట వినిపించకూడదన్నారు. భక్తుల సూచనలు, సలహాల ఆధారంగా సేవలపై టీటీడీ పనిచేయాలని దిశానిర్దేశం చేశారు.

టీటీడీ అధికారులతో సీఎం చంద్రబాబు సమీక్ష
టీటీడీ అధికారులతో సీఎం చంద్రబాబు సమీక్ష

తిరుమల పవిత్రత, నమ్మకం కాపాడేలా  ప్రతి ఒక్కరూ పనిచేయాలని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. శనివారం ఉదయం టీటీడీ అధికారులతో పద్మావతి అతిథి గృహంలో సమీక్ష చేశారు. ఇందుకు దేవదాయశాఖ మంత్రి ఆనం రాంనారాయణ రెడ్డి, టీటీడీ ఈవో, అదనపు ఈవోతో పాటు వివిధ విభాగాల అధికారులు హాజరయ్యారు.

తిరుమల కొండపై గోవింద నామస్మరణ తప్ప మరో మాట వినిపించకూడదని సీఎం చంద్రబాబు చెప్పారు.  ప్రశాతంతకు ఎక్కడా భంగం కలగకూడదని...ఏ విషయంలోనూ రాజీ పడొద్దని తెలిపారు.  భవిష్యత్ నీటి అవసరాలకు తగ్గట్లు నీటి లభ్యత ఉండేలా చూసుకోవాలని...ముందస్తు ప్రణాళిక చాలా అవసరమని దిశానిర్దేశం చేశారు.

అటవీ ప్రాంతాన్ని 72 నుంచి 80 శాతంపైగా పెంచాలని అధికారులకు ముఖ్యమంత్రి చంద్రబాబు సూచించారు.  అటవీ సంరక్షణతో పాటు అడవుల విస్తరణ కోసం వచ్చే 5 ఏళ్లకు ప్రణాళికతో పనిచేయాలన్నారు. బయోడైవర్సీటీ పరిరక్షణకు తీసుకుంటున్న చర్యలపై వివరాలను అడిగి తెలుసుకున్నారు. టీటీడీ సేవలపై భక్తుల నుంచి స్పందన తీసుకునే విధానంపై ఆరా తీశారు.

వీఐపీ సంస్కృతి తగ్గాలి - సీఎం చంద్రబాబు

వచ్చిన ప్రతి భక్తుడు తమ అనుభవాలపై అభిప్రాయాలు చెప్పే అవకాశం కల్పించాలని చంద్రబాబు పేర్కొన్నారు.  భక్తుల సూచనలు, సలహాల ఆధారంగా సేవలపై టీటీడీ పనిచేయాలన్నారు.  ఒక్క టీటీడీలోనే కాకుండా అన్ని దేవాలయాల్లో భక్తుల అభిప్రాయాలు తీసుకునే విధానం తీసుకురావాలని మంత్రి ఆనం రాంనారాయణ రెడ్డికి సూచించారు.

“లడ్డూ ప్రసాదం, అన్న ప్రసాదం నాణ్యత పెరిగింది అని భక్తులు చెపుతున్నారు. ఇది ఎల్లప్పుడూ, పూర్తిగా కొనసాగాలి...మరింత మెరుగుపడాలి. ప్రసాదాల తయారీలో వాడే పదార్థాల నాణ్యత బాగుండేలా చూడండి....అత్యుత్తమ పదార్థాలు మాత్రమే వాడాలి.  తిరుమలలో విఐపీ సంస్కృతి తగ్గాలి...ప్రముఖులు వచ్చినప్పుడు హడావుడి కనిపించకూడదు. సింపుల్ గా, ఆధ్యాత్మిక ఉట్టిపడేలా అలంకరణ ఉండాలి....ఆర్భాటం, అనవసర వ్యయం వద్దు” అని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు.

 టీటీడీ సిబ్బంది భక్తుల పట్ల గౌరవంగా వ్యవహరించాలని సీఎం సూచించారు.  దేశ విదేశాల నుంచి వచ్చేవారిని గౌరవించుకోవాలన్నారు. దురుసు ప్రవర్తన అనేది ఎక్కడా ఉండకూడదని స్పష్టం చేశారు. భక్తులు సంతృప్తితో, అనుభూతితో కొండ నుంచి తిరిగి వెళ్లాలని పేర్కొన్నారు.

“తిరుమల పేరు తలిస్తే....ఏడుకొండల వాడి వైభవం, ఆధ్యాత్మిక మాత్రమే చర్చకు రావాలి.  స్విమ్స్ సేవలు కూడా మెరుగుపరచాలి. ఇదొక ప్రత్యేకమైన క్షేత్రం. తిరుమల పవిత్రత కాపాడడం, ఆధ్యాత్మిక విషయంలో ప్రతి ఒక్కరు బాధ్యతగా వ్యవహరించాలి” అని ముఖ్యమంత్రి చంద్రబాబు సూచించారు.

ప్రముఖ ఆధ్యాత్మిక సంస్థల సహకారంతో శ్రీవారి సేవ (స్వచ్చంద సేవను )మరింత బలోపేతం చేయాలన్నారు. తద్వారా భక్తులకు సేవకుల ద్వారా చక్కటి సేవలు అందించాలని టీటీడీ అధికారులకు దిశానిర్దేశం చేశారు.

Whats_app_banner