AP Volunteers : మళ్లీ విధుల్లోకి తీసుకోండి, సీఎం చంద్రబాబుకు వాలంటీర్లు వినతి- మంత్రుల రియాక్షన్ ఇదీ!-ap volunteers requests cm chandrababu reappoint ministers reactions ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Ap Volunteers : మళ్లీ విధుల్లోకి తీసుకోండి, సీఎం చంద్రబాబుకు వాలంటీర్లు వినతి- మంత్రుల రియాక్షన్ ఇదీ!

AP Volunteers : మళ్లీ విధుల్లోకి తీసుకోండి, సీఎం చంద్రబాబుకు వాలంటీర్లు వినతి- మంత్రుల రియాక్షన్ ఇదీ!

Bandaru Satyaprasad HT Telugu
Jun 19, 2024 04:54 PM IST

AP Volunteers : రాజీనామా చేసిన వాలంటీర్ల పరిస్థితి అగమ్యగోచరంగా తయారైంది. వైసీపీ నేతల ఒత్తిడితో రాజీనామాలు చేసిన వారంతా ఇప్పుడు మంత్రులు చుట్టూ తిరుగుతున్నారు. తమ ఉద్యోగాలు తిరిగి ఇప్పించాలని వేడుకుంటున్నారు.

మళ్లీ విధుల్లోకి తీసుకోండి, సీఎం చంద్రబాబుకు వాలంటీర్లు వినతి
మళ్లీ విధుల్లోకి తీసుకోండి, సీఎం చంద్రబాబుకు వాలంటీర్లు వినతి

AP Volunteers : మళ్లీ తమను విధుల్లోకి తీసుకోవాలని సీఎం చంద్రబాబుకు వాలంటీర్లు విజ్ఞప్తి చేశారు. వైసీపీ ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరించిన వాలంటీర్లు...ఎన్నికల సమయంలో మూకుమ్మడిగా రాజీనామాలు చేశారు. జిల్లాల వారీగా పోటీ పడి రాజీనామా చేసిన వారంతా ఇప్పుడు...తమను తిరిగి విధుల్లోకి తీసుకోవాలని టీడీపీ నేతలు, మంత్రులు చుట్టూ తిరుగుతున్నారు. వైసీపీ నేతల ఒత్తిళ్ల మేరకు రాజీనామాలు చేయాల్సి వచ్చిందని, తమ పరిస్థితి అర్థం చేసుకోవాలని కోరుతున్నారు. మళ్లీ వైసీపీ ప్రభుత్వం వస్తుందని తమను బెదిరించి ఉద్యోగాలకు రాజీనామాలు చేయించారని వాపోతున్నారు. తమను మళ్లీ విధుల్లోకి తీసుకోవాలని సీఎం చంద్రబాబును వేడుకుంటున్నారు. తాము ఏ పార్టీకి సంబంధించిన వాళ్లం కాదని అంటున్నారు.

మంత్రులు ఏమన్నారంటే?

రాజీనామా చేసిన వాలంటీర్లు ఇప్పుడు మంత్రులు చుట్టూ తిరుగుతున్నారు. తమను తిరిగి విధుల్లోకి తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాయి. రాజీనామా చేసిన వాలంటీర్లను తిరిగి విధుల్లోకి తీసుకోమని మంత్రి డోలా బాల వీరాంజనేయస్వామి తెలిపారు. ప్రస్తుతం ఉన్న వారితోనే సంక్షేమ పథకాలు అమలు చేస్తామన్నారు. మంత్రి అచ్చెన్నాయుడు స్పందిస్తూ...వాలంటీర్లకు రాజీనామా చేయొద్దని చెప్పామని, వారు వినలేదన్నారు. వైసీపీ నేతలు బలవంతంగా రాజీనామాలు చేయించారని చెబుతున్నారని, ముందుగా వారిపై కేసులు పెట్టి రండి అప్పుడు చూద్దాం అన్నారు. ఎన్నికలకు ముందు వాలంటీర్ వ్యవస్థను కొనసాగిస్తామని టీడీపీ అధినేత చంద్రబాబు ప్రకటించారు. వాలంటీర్లకు నెలకు రూ.10 వేలు అందిస్తామని, నైపుణ్య శిక్షణ అందిస్తామన్నారు.

దండం పెట్టి చెప్పా- మంత్రి నిమ్మల రామానాయుడు

మంత్రి నిమ్మల రామానాయుడును వాలంటీర్లు కలిశారు. తమ ఉద్యోగాలు తిరిగి ఇప్పించాలని వేడుకున్నారు. రాజీనామా చేయొద్దని తాను దండం పెట్టి చెప్పానని మంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు. తమ ప్రభుత్వం వచ్చాక వాలంటీర్ల వ్యవస్థ కొనసాగిస్తామని, జీతాలు కూడా పెంచుతామని చెప్పామన్నారు. కానీ వైసీపీ నేతలు మాయలో పడి రాజీనామాలు చేశారన్నారు. వాలంటీర్ వ్యవస్థ ఇప్పుడు ప్రభుత్వ పాలసీ అని, దీనిపై ముఖ్యమంత్రి చంద్రబాబు నిర్ణయం తీసుకుంటారని మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు.

జగనన్న సైన్యం

2019 ఎన్నికల్లో విజయంతో అధికారం చేపట్టిన వైఎస్ జగన్... గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థ, దానికి అనుబంధంగా గ్రామ, వార్డు వాలంటీర్ వ్యవస్థను తీసుకోచ్చారు. సుమారు రెండున్నర లక్షల మంది వాలంటీర్లను నియమించారు. వాలంటీర్ల తన సైన్యమని జగన్ పదే పదే చెప్పారు. సంక్షేమ పథకాలను ఇంటింటికీ చేర్చేందుకు వాలంటీర్లు పనిచేశారు. దీంతో పాటు ఎన్నికల సమయంలో వైసీపీకి అనుకూలంగా పనిచేశారు. దీంతో అప్పటి ప్రతిపక్షాలు ఈసీకి ఫిర్యాదులు చేయడంతో వాలంటీర్లను ఎన్నికలకు దూరంపెట్టింది. దీంతో వాలంటీర్లతో రాజీనామాలు చేయించిన వైసీపీ నేతలు...వారితో తమ మద్దతుగా ప్రచారం చేయించారు. అయినా ఫలితంలేకపోయింది. ఇటీవల ఎన్నికల్లో వైసీపీ ఘోర ఓటమి చవిచూసింది. కేవలం 11 సీట్లకే పరిమితం అయ్యింది. ఇప్పుడు వాలంటీర్లు లబోదిబో మంటున్నారు. వైసీపీ నేతలు ఒత్తిడితో రాజీనామాలు చేశామని, తమను తిరిగి విధుల్లోకి తీసుకోవాలని వేడుకుంటున్నారు. ఏపీలో కొత్తగా ఏర్పడిన కూటమి ప్రభుత్వం వాలంటీర్ వ్యవస్థను కొనసాగిస్తుందా? లేదా? అనే సందిగ్ధం ఏర్పడింది. కొత్త వారిని వాలంటీర్లుగా తీసుకుంటారా? లేక పాత వారిలో కొంత మందికి అవకాశం కల్పిస్తారా? తెలియాల్సి ఉంది.

Whats_app_banner

సంబంధిత కథనం