Mla Nimmala Arrest : పాలకొల్లులో ఉద్రిక్తత, టీడీపీ ఎమ్మెల్యే నిమ్మల అరెస్ట్
Mla Nimmala Arrest : టిడ్కో గృహాల వద్ద నిరసన కార్యక్రమానికి పిలుపునిచ్చిన టీడీపీ ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడిని పోలీసులు అరెస్టు చేశారు. దీంతో పాలకొల్లులో ఉద్రిక్తత నెలకొంది.
Mla Nimmala Arrest : పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లులో ఉద్రిక్తత నెలకొంది. టిడ్కో ఇళ్ల వద్ద పాలకొల్లు చూడు నిరసన కార్యక్రమానికి టీడీపీ ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు పిలుపునిచ్చారు. దీంతో ఆయనను పోలీసులు బుధవారం అరెస్ట్ చేశారు. పెంకిళ్లపాడు టిడ్కో గృహాల వద్ద వంటా వార్పు కార్యక్రమానికి ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు వెళ్లకుండా పోలీసులు అడ్డుకున్నారు. అయితే టీడీపీ పోటీగా వైసీపీ పాలకొల్లు నియోజకవర్గ ఇన్‌ఛార్జ్ గొడాల గోపి కూడా నిజం చెబుతాం అంటూ నిరసన కార్యక్రమం చేపట్టారు. దీంతో నియోజకవర్గంలో ఉద్రిక్తత నెలకొంది. ఇరు పార్టీల నిరసన కార్యక్రమాలకు అనుమతి లేదంటూ పోలీసులు అడ్డుకున్నారు.

నిమ్మల అరెస్ట్
అయితే ఎలాగైనా నిరసన కార్యక్రమం చేపడతామని టీడీపీ నేతలు, కార్యకర్తలు ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు ఇంటికి పెద్ద సంఖ్యలో చేరుకున్నారు. దీంతో పోలీసులు ఎమ్మెల్యే నిమ్మలను హౌస్ అరెస్టు చేశారు. ఈ క్రమంలో పోలీసులు, టీడీపీ కార్యకర్తల మధ్య తీవ్రస్థాయిలో వాగ్వాదం చోటుచేసుకుంది. పోలీసుల కళ్లుగప్పిన నిమ్మల రామానాయుడు ఇంటి నుంచి బయటకు వచ్చారు. పాలకొల్లులోని అంబేడ్కర్ విగ్రహం వద్దకు చేరుకుని జాతీయ జెండాలు పంచుతూ నిరసన తెలిపారు. అక్కడకు టీడీపీ, జనసేన కార్యకర్తలు భారీగా చేరుకున్నారు. పోలీసులు ఇరుపార్టీల కార్యకర్తలను అడ్డుకున్నారు. పోలీసుల తీరుపై ఎమ్మెల్యే నిమ్మల అసహనం వ్యక్తం చేశారు. అనంతరం పోలీసులు నిమ్మల రామానాయుడుని అరెస్టు చేసి భీమవరం వైపు తీసుకెళ్లారు. పేదలు మహిళల సొంత ఇంటి కల కోసం ఉద్యమించిన తనను బలవంతంగా పెద్ద సంఖ్యలో పోలీసులు మొహరించి అరెస్ట్ చేశారని టీడీపీ ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు అన్నారు.
నారా లోకేశ్ ఫైర్
కడప జిల్లాలో పులివెందుల టీడీపీ ఇన్ ఛార్జ్ బీటెక్ రవి, ప్రొద్దుటూరు టీడీపీ నేత ప్రవీణ్ కుమార్ ను పోలీసులు అరెస్టు చేశారు. టీడీపీ నేతల అరెస్టులపై ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ స్పందించారు. సీఎం జగన్ కు ఓటమి భయం పట్టుకుందని, అందుకే టీడీపీ నేతలను అరెస్టు చేయిస్తున్నారని ఆరోపించారు. చివరికి సీఎం సొంత నియోజకవర్గం పులివెందులలో కూడా ప్రజలు అసంతృప్తితో ఉన్నారన్నారు. పులివెందులలో వైసీపీ పునాదులు కదులుతున్నాయన్న ఆయన అందుకే టీడీపీ నేతలపై అక్రమ కేసులు పెట్టి అరెస్టు చేయిస్తున్నారని ధ్వజమెత్తారు. అక్రమ కేసులు, బెదిరింపు రాజకీయాలు వైసీపీని బతికించలేవన్నారు. వైసీపీ నేతలకు అక్రమ పద్ధతుల్లో సహకరిస్తున్న పోలీసులు లేకపోతే... రాష్ట్రంలో వైసీపీ ఉండదన్నారు. సీఎం జగన్ టీడీపీ నేతలపై పెట్టే ప్రతి కేసు ప్రజల్లో ప్రజా వ్యతిరేకతను పెంచుతుందన్నారు.