YCP MP Daughter: చెన్నైలో మద్యం మత్తులో ఫుట్‌పాత్‌పైకి కారు నడిపిన వైసీపీ ఎంపీ కుమార్తె, ఒకరి మృతి-ycp mps daughter who drove her car on the footpath under the influence of alcohol in chennai ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Ycp Mp Daughter: చెన్నైలో మద్యం మత్తులో ఫుట్‌పాత్‌పైకి కారు నడిపిన వైసీపీ ఎంపీ కుమార్తె, ఒకరి మృతి

YCP MP Daughter: చెన్నైలో మద్యం మత్తులో ఫుట్‌పాత్‌పైకి కారు నడిపిన వైసీపీ ఎంపీ కుమార్తె, ఒకరి మృతి

Sarath chandra.B HT Telugu

YCP MP Daughter: వైసీపీ రాజ్యసభ సభ్యుడు బీద మస్తాన్‌రావు కుమార్తె మద్యం మత్తులో ఫుట్‌పాత్‌పై కారు నడపడంతో అక్కడ పడుకున్న యువకుడు మృతి చెందాడు. ఈ ఘటనలో ఎంపీ కుమార్తెను పోలీసులు అరెస్ట్ చేసి పూచీకత్తుపై విడుదల చేశారు.

ఫుట్‌పాత్‌పై నిద్రిస్తున్న యువకుడిపైకి కారు నడిపిన ఎంపీ కుమార్తె

YCP MP Daughter: మద్యం మత్తులో నిర్లక్ష్యంగా కారును నడపడంతో ఒకరు ప్రాణాలు కోల్పోయారు. చెన్నైలో సోమవారం రాత్రి జరిగిన ఘటనలో వైసీపీ ఎంపీ కుమార్తె కారు నడుపుతూ ఫుట్‌పాత్‌పై నిద్రిస్తున్న యువకుడి మీదకు దూసుకెళ్ళింది. ఈ ఘటనలో యువకుడు అక్కడికక్కడిడే మృతి చెందాడు.

చెన్నై బెసంట్‌నగర్‌కు ఓడకుప్పానికి చెందిన సూర్య పెయింటింగ్ పనులు చేస్తుంటాడు. సోమవారం బెసంట్‌నగర్‌ కళాక్షేత్రకాలనీలోని వరదరాజసాలై ప్రాంతంలోని ఫుట్‌పాత్‌పై నిద్రపోయాడు. ఆ సమయంలో అటుగా వచ్చిన కారు ఫుట్‌పాత్‌పై నిద్రిస్తున్న సూర్యమీదుగా దూసుకుపోయింది. ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన సూర్యను స్థానికులు ఆసుపత్రికి తరలించారు.

అప్పటికే అతను మృతి చెందినట్టు వైద్యులు ధృవీకరించారు. ప్రమాదానికి కారణమైన కారులో ఇద్దరు మహిళలు ఉన్నారని స్థానికులు పోలీసులకు తెలిపారు.ప్రమాదం జరిగిన వెంటనే వాహనం నడిపిన మహిళ కారుతో సహా పరారైంది. మరో మహిళ ప్రమాదం స్థానిక ప్రజలతో వాగ్వాదానికి దిగారని మృతుడి బంధువులు ఆరోపించారు.

ప్రమాద సమయంలో ఇద్దరు మహిళలు మద్యం మత్తులో ఉన్నారని చనిపోయిన వ్యక్తి బంధువులు ఆరోపించారు. ప్రమాదానికి సంబంధించి సీసీ కెమెరా దృశ్యాలు, కారు రిజిస్ట్రేషన్‌ నెంబరు, పారిపోయిన మహిళల ఫొటోలు అందుబాటులో ఉన్నాపోలీసులు వారిని అరెస్టు చేయలేదని ఆరోపిస్తూ బాధితులు మంగళవారం బెసంట్‌నగర్‌ పోలీసుస్టేషన్‌ను ముట్టడించారు.

ప్రమాదానికి కారును ఆ సమయంలో ఆంధ్రప్రదేశ్‌ వైసీపీ రాజ్యసభ సభ్యుడు బీద మస్తాన్‌రావు కుమార్తె బీద మాధురిగా బెసెంట్‌నగర్‌ పోలీసులు గుర్తించారు. సీసీటీవీ దృశ్యాలు పరిశీలించి కారు రిజిస్ట్రేషన్ నంబరు ఆధారంగా ప్రమాదానికి కారకురాలు మాధురిగా నిర్ధారించుకున్నారు. స్థానికుల ఆందోళనల నేపథ్యంలో మంగళవారం ఉదయం మాధురి పోలీస్టేషన్‌లో న్యాయవాదులతో కలిసి లొంగిపోయారు. ఆపై సొంత పూచీకత్తుతో బెయిలుపై విడుదలయ్యారు. మాధురితో పాటు కారులో ప్రయాణించిన మరో మహిళ కోసం పోలీసులు గాలిస్తున్నారు.