AP Volunteers : వాలంటీర్లు ఎవరు గెలవాలనుకుంటున్నారు? ఎవరు గెలిస్తే ఎవరికి లాభం?-amaravati ap volunteers system places key role who do the volunteers want to win ,ఎన్నికలు న్యూస్
తెలుగు న్యూస్  /  ఎన్నికలు  /  Ap Volunteers : వాలంటీర్లు ఎవరు గెలవాలనుకుంటున్నారు? ఎవరు గెలిస్తే ఎవరికి లాభం?

AP Volunteers : వాలంటీర్లు ఎవరు గెలవాలనుకుంటున్నారు? ఎవరు గెలిస్తే ఎవరికి లాభం?

HT Telugu Desk HT Telugu
Jun 03, 2024 07:28 PM IST

AP Volunteers : ఏపీ ఎన్నికల్లో వాలంటీర్ల గురించి పెద్ద రచ్చే జరిగింది. చివరికి వారిని ఈసీ ఎన్నికల విధుల్లోంచి తప్పిస్తే వైసీపీ రాజీనామాలు చేయించి ప్రచారం చేయించింది. అయితే ఈ ఎన్నికల్లో ఎవరు గెలవాలని వాలంటీర్లు భావిస్తున్నారంటే?

వాలంటీర్లు ఎవరు గెలవాలనుకుంటున్నారు? ఎవరు గెలిస్తే ఎవరికి లాభం?
వాలంటీర్లు ఎవరు గెలవాలనుకుంటున్నారు? ఎవరు గెలిస్తే ఎవరికి లాభం?

AP Volunteers : రాష్ట్రంలో వాలంటీర్ వ్యవస్థ దేశవ్యాప్తంగా మన్ననలు పొందింది. ఇరుగుపొరుగు రాష్ట్రాలు కూడా ఈ వ్యవస్థను అమలు చేయాలనుకుంటున్నాయి. తెలంగాణలో కొత్తగా ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఆ రకంగా ఆలోచనలు చేస్తుంది. ఇప్పటికే కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి వంటి సీనియర్ మంత్రులు సైతం తెలంగాణలో వాలంటీర్ వ్యవస్థ ఏర్పాటుపై మాట్లాడారు. తమ రాష్ట్రంలో ఇలాంటి వ్యవస్థను తీసుకొస్తామని అన్నారు.

ఇంత వరకు బాగానే ఉంది. అయితే ఇటీవలి రాష్ట్రంలో ఎన్నికల నేపథ్యంలో మాజీ ఐఎఎస్ అధికారి నిమ్మగ‌డ్డ ర‌మేష్ కుమార్ దాఖ‌లు చేసిన పిటిష‌న్‌తో హైకోర్టు, ఎన్నికల కమిషన్ వాలంటీర్లను ఎన్నిక‌ల విధుల‌కు, సాధార‌ణ విధుల‌కు దూరం చేశాయి. దీంతో రాష్ట్రంలో రాజ‌కీయ ర‌గ‌డ చోటుచేసుకుంది. పేదోడి, ముస‌లి వృద్ధుల‌కు, విక‌లాంగుల‌కు పెన్షన్ ఇవ్వకుండా టీడీపీ అడ్డకుంద‌ని వైసీపీ విమ‌ర్శలు చేసింది. దానికి టీడీపీ కూడా ప్రతి విమ‌ర్శల‌ను చేసింది. అయితే రాజ‌మండ్రి సిటీ ఎమ్మెల్యే అభ్యర్థిగా టీడీపీ త‌ర‌పున పోటీ చేసిన ఆదిరెడ్డి వాసు వాలంటీర్ వ్యవ‌స్థను ఆపాల‌ని తానే చంద్రబాబు, లోకేశ్ తో మాట్లాడాన‌ని, తాము ఫిర్యాదు చేస్తేనే ఎన్నిక‌ల సంఘం నిలిపివేసింద‌ని తెలిపారు. దీంతో పేద‌వాడి క‌డుపు కొట్టడంలో టీడీపీకి మ‌రెవ్వరూ సాటిరార‌ని వైసీపీ విమ‌ర్శించింది.

ఎన్నికల విధులకు దూరం

ఇదిలా ఉండ‌గా ఎన్నిక‌ల క‌మిష‌న్ ఆదేశాల‌తో వాలంటీర్లను సాధార‌ణ విధుల‌కు కూడా దూరంగా ఉంచారు. ఈ నేప‌థ్యంలో వేలాది మంది వాలంటీర్లు త‌మ బాధ్యత‌ల‌కు రాజీనామా చేసి వైసీపీ త‌రపున ఎన్నిక‌ల్లో ప‌నిచేశారు. ఇప్పుడు ఎన్నిక‌లు ముగిశాయి. రేపు (మంగ‌ళ‌వారం) ఫ‌లితాలు కూడా రాబోతున్నాయి. ఈ ఫ‌లితాలు ఎలా ఉండాల‌ని వాలంటీర్లు కోరుకుంటున్నారు? ఎవ‌రు గెల‌వాల‌ని కోరుకుంటున్నారు? జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి గెలిస్తే ఎవ‌రికి లాభం? చంద్రబాబు గెలిస్తే ఎవ‌రికీ లాభం? రాష్ట్రంలో 2019లో అధికారంలోకి వ‌చ్చిన వైఎస్ జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి 2019 అక్టోబ‌ర్ 2న జాతిపిత మ‌హాత్మ గాంధీ జయంతి రోజున వాలంటీర్ వ్యవ‌స్థ అమ‌లులోకి తీసుకొచ్చారు. వీరు ప్రజ‌ల‌కు ప్రభుత్వానికి మ‌ధ్య వార‌ధి అంటూ జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి ప్రక‌టించారు. 50 కుటుంబాల‌కు ఒక వాలంటీర్ చొప్పున మొత్తం రాష్ట్రంలో 2.66 లక్షల మంది వాలంటీర్లను నియ‌మించారు. వీరికి రూ.5000 భ‌త్యం ఇస్తున్నారు. ప్రతి వాలంటీర్ త‌న ప‌రిధిలో ఉన్న 50 కుటుంబాల‌కు అన్ని సంక్షేమ ప‌థ‌కాలు అందేట‌ట్లు చూడాలి.

రూ.10 వేల వేతనం

ఎన్నిక‌ల సంద‌ర్భంలో ఎన్నిక‌ల క‌మిష‌న్ ఆదేశాల మేర‌కు సాధార‌ణ విధులకు వాలంటీర్లను దూరం చేశారు. దీంతో చాలా మంది వాలంటీర్లు రాజీనామా చేసి వైసీపీ ప్రభుత్వం త‌ర‌పున ఎన్నిక‌ల్లో ప‌నిచేశారు. దాదాపు 65 వేల మంది వాలంటీర్లు రాజీనామా చేశారు. ఎన్నిక‌ల సమ‌యంలో వైసీపీ ప్రభుత్వం మళ్లీ అధికారంలోకి వస్తే వాలంటీర్ వ్యవస్థ పునరుద్ధరణపై మొదటి సంతకం పెడతానని సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రకటించగా, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే వాలంటీర్ వ్యవస్థను కొనసాగిస్తూ వాలంటీర్ భత్యం రూ.5 వేలు నుంచి రూ.పది వేలుకు పెంచుతానని ప్రకటించారు.

వాలంటీర్ల అభిప్రాయం

ఇప్పుడు ఈ ఎన్నిక‌ల్లో వైసీపీ గెలిస్తే, ఆ 65 వేల మంది వాలంటీర్లకు మంచి గుర్తింపు ఉంటుంది. అదే టీడీపీ కూట‌మి గెలిస్తే రాజీనామా చేయ‌ని మెజార్టీ వాలంటీర్లకు గుర్తింపు ఉంటుంది. అందుకే రాజీనామా చేసిన వాలంటీర్లు వైసీపీ గెల‌వాల‌ని కోరుకుంటున్నారు. రాజీనామా చేయ‌ని వలంటీర్లు టీడీపీ కూట‌మి గెల‌వాల‌ని అనుకుంటున్నారు. అయితే ఎవ‌రు గెలిచినా కొంత మంది వాలంటీర్లకు మాత్రం తిప్పలు త‌ప్పవంటున్నారు కొందరు. అయితే ఎవ‌రు అధికారంలోకి వ‌చ్చినా వాలంటీర్ వ్యవ‌స్థ మాత్రం ఉంటుందంటున్నారు. సీఎం జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి వాలంటీర్ వ్యవ‌స్థను అంత ప‌టిష్టం చేశారంటున్నారు.

రిపోర్టింగ్ : జ‌గ‌దీశ్వర‌రావు జ‌ర‌జాపు, హిందూస్థాన్ టైమ్స్ తెలుగు

Whats_app_banner

సంబంధిత కథనం