AP Exit Polls : ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ కూటమిదే హవా-పీపుల్స్ పల్స్ ఎగ్జిట్ పోల్స్-amaravati ap exit polls 2024 peoples pulse survey predicts tdp jsp bjp alliance comes to power in ap ,ఎన్నికలు న్యూస్
తెలుగు న్యూస్  /  ఎన్నికలు  /  Ap Exit Polls : ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ కూటమిదే హవా-పీపుల్స్ పల్స్ ఎగ్జిట్ పోల్స్

AP Exit Polls : ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ కూటమిదే హవా-పీపుల్స్ పల్స్ ఎగ్జిట్ పోల్స్

HT Telugu Desk HT Telugu
Jun 01, 2024 08:56 PM IST

AP Exit Polls : ఏపీ ఎగ్జిట్ పోల్స్ ను పీపుల్స్ పల్స్ రీసర్చ్ సంస్థ ప్రకటించింది. ఈసారి ఏపీలో కూటమి అధికారంలోకి వస్తుందని ఈ సంస్థ అంచనా వేస్తుంది.

ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ కూటమిదే హవా-పీపుల్స్ పల్స్ ఎగ్జిట్ పోల్స్
ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ కూటమిదే హవా-పీపుల్స్ పల్స్ ఎగ్జిట్ పోల్స్

AP Exit Polls : తెలుగుదేశం నేతృత్వంలోని టీడీపీ-జనసేన-బీజేపీ కూటమి ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో విజయకేతనం ఎగురవేయనుంది. పాలక వైఎస్సార్సీపీని ఓడించి కూటమి గెలవనుండటంతో టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు నాలుగోసారి ముఖ్యమంత్రి కావడం ఖాయంగా కనిపిస్తోంది. 175 అసెంబ్లీ నియోజకవర్గాలున్న ఏపీలో టీడీపీ సొంతంగానే 95 నుంచి 110 స్థానాలు గెలిచే అవకాశం ఉన్నట్టు పీపుల్స్‌ పల్స్‌ రీసర్చ్ సంస్థ జరిపిన పోస్ట్‌పోల్‌ సర్వేలో వెల్లడయింది. అధికారం నిలబెట్టుకోవాలని తీవ్రంగా ప్రయత్నిస్తున్న వైఎస్సార్సీపీ 45 నుంచి 60 స్థానాల మధ్య గెలిచే అవకాశం ఉన్నట్టు సర్వే గణాంకాలు చెబుతున్నాయి. కూటమికి మొత్తంగా 111 నుంచి 135 స్థానాలు రావొచ్చన్నది సర్వే గణాంకాల సారాంశం. కూటమి భాగస్వాములుగా బరిలో నిలిచిన జనసేన 14 నుంచి 20 స్థానాలు, బీజేపీ 2 నుంచి 5 స్థానాలు గెలిచే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. కూటమి పక్షాల మధ్య స్వల్ప కాలంలోనే సయోధ్య కుదిరి, ఆయా పార్టీల మద్దతుదారుల నుంచి పరస్పర ఓటు బదిలీ సజావుగా జరగటమే ఇందుకు కారణంగా కనిపిస్తోంది. వైఎస్సార్సీపీ మొత్తం 175 అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేయగా పొత్తుల్లో తెలుగుదేశం 144, జనసేన 21, బీజేపీ 10 స్థానాల్లో పోటీ చేశాయి.

yearly horoscope entry point

కూటమికి 50-54 శాతం ఓటింగ్

ఆంధ్రప్రదేశ్‌లోని మొత్తం 25 లోక్‌సభ స్థానాలకు తెలుగుదేశం 13-15 (పోటీ చేసింది 17), జనసేన 2 (2), బీజేపీ 2-4 (6) చోట్ల గెలిచే అవకాశాలున్నాయి. అంటే, కూటమి ఉమ్మడిగా 17 నుంచి 21 స్థానాల్లో గెలవొచ్చు. గత ఎన్నికల్లో 22 స్థానాల్లో గెలిచిన వైఎస్సార్సీపీ ఈసారి 3 నుంచి 5 చోట్ల నెగ్గే ఆస్కారం కనిపిస్తోంది. పోస్ట్‌ పోల్‌ సర్వే ప్రకారం టీడీపీ-జనసేన-బీజేపీ కూటమి 50 నుంచి 54 శాతం ఓటు వాటాతో స్పష్టమైన ఆధిక్యత ప్రదర్శించే అవకాశముంది. పాలక వైసీపీ ఓటువాటా 42-45 శాతం ఉండొచ్చు. కాంగ్రెస్‌ ఓటువాటా 1-2 శాతానికి మించకపోవచ్చు. నోటాతో కలుపుకొని ఇతరులకు 3-4 శాతం ఓటు వాటా లభించవచ్చు. అభివృద్ధి, సమాజపరమైన సేవా సామర్థ్యం, పార్టీ పనితీరు, పాలనా సామర్థ్యం, ఎవరు ముఖ్యమంత్రి కావాలనుకుంటున్నారు.... ఇలా అన్ని అంశాల్లోనూ కూటమి పాలక వైసీపీపై స్పష్టమైన ఆధిక్యతతో ఉన్నట్టు సర్వే ఫలితాల్లో వెల్లడయింది. ఇది యువత, వృద్ధులు, మహిళలు... ఇలా అన్ని వర్గాల్లోనూ ప్రతిబింబించింది. ఒక్క రాయలసీమలో తప్ప ఇతర అన్ని ప్రాంతోల్లోనూ ఈ ఆధిక్యత కనిపిస్తోంది.

ఎవరు ముఖ్యమంత్రి?

ముఖ్యమంత్రిగా ఎవరిని కోరుకుంటున్నారన్నపుడు అత్యధికులు, 40 శాతం మంది మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వైపు మొగ్గారు. తర్వాత ఆదరణ ప్రస్తుత ముఖ్యమంత్రి వై.ఎస్‌.జగన్మోహన్‌రెడ్డి ( 38 శాతం మంది). పవన్‌ కల్యాణ్‌ ( 12 శాతం మంది) లకు లభించింది. ఎవరి వల్ల ఏపీ అభివృద్ధి సాధ్యమన్న ప్రశ్నకు 52 శాతం మంది టీడీపీ-జేఎస్‌పీ-బీజేపీ కూటమిపై విశ్వాసం చూపారు. ప్రస్తుత పాలకపక్షానికి 41 శాతం మంది మద్దతిచ్చారు. వైసీపీ మళ్లీ అధికారంలోకి వస్తుందా? అంటే, వస్తుందని 42 శాతం మంది, రాదని 51 శాతం మంది స్పందించారు. ఎవరు అధికారంలోకి వస్తారని మీరనుకుంటున్నారు? అని నిర్దిష్టంగా అడిగిన ప్రశ్నకు వైసీపీ అని 44 శాతం అంటే, టీడీపీ కూటమి అని 54 శాతం మంది పేర్కొన్నారు. అయిదేళ్ల వైసీపీ పాలన గురించి అడిగితే, 32 శాతం మంది బాగుందని, 12 శాతం మంది పర్వాలేదని, 48 శాతం మంది మాత్రం బాగోలేదని స్పందించారు. టీడీపీ కూటమి ఎలా ఉందంటే, బాగుందని 49 శాతం మంది, బాగోలేదని 42 శాతం పేర్కొనగా చెప్పలేమని 9 శాతం మంది తటస్థంగా ఉన్నారు. ప్రధానిగా ఎవరుండాలనే అభిప్రాయంలో ఏపీ వరకు ప్రస్తుత ప్రధాని మోదీ, విపక్షపార్టీ నాయకుడు రాహుల్‌ గాంధీ మధ్య 10 శాతం వ్యత్యాసం నమోదైంది. ప్రధానిగా మోదీని కోరుకున్న వారు 48 శాతం అయితే రాహుల్‌ గాంధీని కోరుకున్నది 38 శాతం మంది మాత్రమే!

వైసీపీపై షర్మిల ఎఫెక్ట్

దివంగత ముఖ్యమంత్రి డా.వైఎస్‌ రాజశేఖరరెడ్డి కుమార్తె వై.ఎస్‌.షర్మిలారెడ్డి ఏపీసీసీ బాధ్యతలు చేపట్టి బరిలోకి దిగడంతో తమ పార్టీ పరిస్థితి మెరుగవుతుందనుకున్న కాంగ్రెస్‌ ఆశలు నీరుగారినట్టే జనాదరణ కనిపించింది. ప్రభుత్వాన్ని విమర్శిస్తూ, ముఖ్యమంత్రిని తప్పుబడుతూ ఆమె చేసిన ప్రచారం వైఎస్సార్‌సీపీకి ఏ మేర నష్టం కలిగించిందో, అంతమేర లబ్ది ప్రధాన ప్రతిపక్ష కూటమి ఖాతాలోకి వెళ్లినట్టే అని సర్వే ఫలితాలను బట్టి తెలుస్తోంది. కాంగ్రెస్‌కు ఏం కలిసివచ్చినట్టు లేదు. ఇతర ప్రధాన పోటీపక్షాల నాయకుల స్థాయిలో షర్మిల ప్రచారం చేసినప్పటికీ, దశాబ్దం కిందట రాష్ట్రాన్ని విభజించిన పార్టీగా కాంగ్రెస్‌పై కోపం ఇంకా ఏపీ ప్రజలకు తగ్గినట్టు లేదు, కాంగ్రెస్‌తో పాటు ‘ఇండియా కూటమి’ భాగస్వాములైన వామ‌ప‌క్ష పార్టీలది ఏపీలో ప్రేక్షక పాత్రే! ఓటర్ల మొగ్గుపరంగా ఆలోచించినపుడు, రాజకీయ సమీకరణాల్లో 2014 వాతావరణం పునరావృతమైనట్టు కనిపిస్తోంది. అప్పుడు జనసేన పోటీ చేయకపోయినా... టీడీపీ-బీజేపీ కూటమికి బహిరంగ మద్దతు ప్రకటించింది. నాటి ఫలితాల్లో టీడీపీ 102, బీజేపీ 4 స్థానాలు గెలుచుకోగా వైఎస్సార్సీపీ 67 స్థానాలకు పరిమితమైంది. ఆ ముగ్గురు, అప్పుడు-ఇప్పుడు ఎన్డీయే భాగస్వాములే!

గతంలోనే సంకేతాలు

తాజా సర్వే ఫలితాలను క్షుణ్ణంగా పరిశీలిస్తే, టీడీపీ-జేఎస్‌పీ-బీజేపీ కూటమి బలాన్ని సరిగా అంచనా వేయడంలో సీఎం జగన్మోహన్‌రెడ్డి, ఆయన పార్టీ విఫలమైనట్టు స్పష్టమౌతోంది. 2014 లో వారి సయోధ్యా ప్రజాదరణను పరిగణనలోకి తీసుకోలేదేమో అనడానికి స్పష్టమైన ఉదాహరణ. ఇప్పుడు జనసేన పోటీ చేస్తున్న 21 స్థానాల్లో 19 స్థానాలను 2014లో కూటమి గెలుచుకుంది. గతాన్ని పరిగణనలోకి తీసుకోని తెంపరితనానికి వైసీపీ మూల్యం చెల్లించుకుంటున్నట్టున్నాయి ప్రస్తుత సంకేతాలు.

ప్రస్తుతం కూటమిలోని పార్టీలు విడిగా పోటీ చేసిన 2019 అసెంబ్లీ ఎన్నికల్లో, స్పష్టమైన 10 శాతం ఓటు వాటా ఆధిక్యతతో 151 స్థానాల్లో గెలిచి వైసీపీ రికార్డు సృష్టించింది. తెలుగుదేశం పార్టీ చరిత్రలోనే అత్యల్ప సంఖ్య 23 కు పరిమితమైంది. ఏమాటకామాట... ఈ అయిదేళ్ల కాలంలో వైసీపీ ప్రభుత్వం, ఇచ్చిన హామీల్లో 85 శాతం వరకు నెరవేర్చింది. ఏపీ శాసనమండలికి 2023 లో జరిగిన పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో వచ్చిన సంకేతాలు గ్రహించాల్సింది. 2019 నాటికన్నా 17 శాతం ఓటువాటా తగ్గి, ఎదురైన ఘోరపరాజయం నుంచి పాఠాలు నేర్చుకోకపోవడమే వైసీపీ తప్పిదంగా కనిపిస్తోంది. ఆత్మశోధన చేసుకోకపోగా ‘వారు మా ఓటర్లు కారు’ అంటూ నిర్హేతుకంగా దాటవేత దోరణి కనబరిచారు.

సంక్షేమ పథకాలే సర్వస్వం

సర్వే ఫలితాల్లో వెల్లడయిందాన్ని బట్టి, వాస్తవాలను అంగీకరించడానికి సిద్దంగా లేని సీఎం జగన్మోహన్‌రెడ్డి కఠినచిత్తమే వారి పార్టీ జనాదరణ స్థితికి కారణమేమో అనిపిస్తుంది. సంక్షేమ పథకాలే సర్వం అనే భావన పనిచేసినట్టు లేదు. సంక్షేమ పథకాలు, ప్రయోజనాలను లబ్దిదారుల ఇంటికి తీసుకువెళ్లేందుకు తాను రూపొందించిన గ్రామ-వార్డు వాలెంటరీ వ్యవస్థపైనే పూర్తిగా ఆధారపడటం వికటించి ఉండవచ్చు. పార్టీలోనూ ప్రతికూల పరిస్థితికి అదే కారణం కావచ్చు. పాలనా వైఫల్యాలెలా ఉన్నా... నిత్యావసరాల ధరల నియంత్రణ అంశాన్ని తేలిగ్గా తీసుకోవడం ప్రతికూలించి ఉంటుంది. పీపుల్స్‌పల్స్‌ సర్వేయర్లతో జనం, ‘ఆ ఏముంది, ఓ చేత్తో పది రూపాయలిచ్చి, ఇంకో చేత్తో వంద లాగుతున్నాడుగా’ అనడం దీనికి నిదర్శనం. స్వతంత్ర భారతంలో కొత్తగా ఏ రాష్ట్రం ఏర్పడ్డా, మిగిలిపోయిన రాష్ట్రం నూతనంగా రాజధాని ఏర్పాటు చేసుకోవాల్సి రావడం ఏపీ లోనే ఎదురైన తొలి అనుభవం. రాజధానికి భూసమీకరణ విషయంలో 2014-19 మధ్య చంద్రబాబు తాను గందరగోళ పడితే, జగన్మోహన్‌రెడ్డి మూడు రాజధానులని జనం అందరినీ సంకటంలో పెట్టారు.

సిట్టింగ్ ఎమ్మెల్యేలపై అసంతృప్తి

వైసీపీ పరిస్థితి కారణాలేమున్నా, ప్రధానంగా సిట్టింగ్‌ ఎమ్మెల్యేలపై ప్రజలకున్న కోపం, ప్రభుత్వం వాలెంటీర్ల మీదే ఆధారపడటంతో పార్టీ వ్యవస్థ పూర్తిగా నిర్వీర్యం కావడం సర్వేలో కొట్టచ్చినట్టు కనిపించాయి. సంక్షేమం తప్ప మరోకటి చేపట్టకపోవడం, రోడ్లు బాగుచేయడం వంటి కనీస మౌలిక సదుపాయాలూ పట్టని పరిస్థితి సంక్షేమం వల్ల వచ్చిన సానుకూలతను కూడా దెబ్బతీసింది. అధికారుల బదిలీల లాగా పార్టీ ఎమ్మెల్యేలను ఒక నియోజకవర్గం నుంచి మరో చోటికి, కొన్ని మార్లు జిల్లా బయటకీ పంపడం జనాలకు వింతగా అనిపించింది. దళితులు, క్రిస్టియన్లు, రెడ్డీ వర్గాల్లో గత ఎన్నికలనాటి ఆదరణ వైసీపీకి ఇప్పుడూ లభించింది.చదువుకున్న వారు, టీచర్లతో సహా ఉద్యోగుల్లో ఆదరణ తగ్గింది. బీజేపీతో జట్టుకట్టి కూటమి ఏర్పాటు చేసినా.....గత అయిదేళ్లూ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానికి జగన్మోహన్‌రెడ్డి మద్దతిచ్చినందుకేమో, ముస్లీంలు ఆయన వెంట ఏకీకృతం కాలేదు. కిందటి సారి ఎన్నికల్లో కన్నా రెట్టింపు సంఖ్యలో ఈ సారి ఉద్యోగులు, ముఖ్యంగా టీచర్లు పోస్టల్‌ ఓటు వేసేందుకు కనబరచిన ఆసక్తి పరిస్థితికి అద్దం పడుతోంది.

సర్వే పద్ధతి

రాష్ట్రంలో ఓటింగ్‌ మే 13న ముగిసిన తర్వాత, మే 16-20 తేదీల మధ్య ఈ సర్వే జరిగింది. మొత్తం 25 లోక్‌సభ నియోజకవర్గాల్లో, సంభావ్యతా నిష్పత్తి పద్దతి (పీపీఎస్‌)న, ఎంపిక చేసిన మూడేసి అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి నమూనా (శాంపిల్‌) సేకరించాము. ఇందుకోసం ఒక్కో అసెంబ్లీ నియోజకవర్గంలో 4 పోలింగ్‌ స్టేషన్లు, ఒక్కో స్టేషన్‌ పరిధి నుంచి 20-25 మంది ఓటర్లతో ఈ సర్వే జరిపించాము. మతం, సామాజికవర్గాలు, వయసులు, ఆర్థికస్థితి తదితర ప్రాతిపదికల్లో ‘జనాభా దామాషా’ ప్రచారం నమూనాల ఎంపిక శాస్త్రీయ పద్దతిన జరిగింది. స్త్రీ-పురుష సమాన ప్రాతినిధ్యం కల్పించడమైంది. సర్వే విధానం మూడు భాగాలుగా.... ముఖాముఖి ఇంటర్వ్యూలు, నిర్దిష్ట ప్రశ్నలతో ప్రశ్న పత్రం, రహస్య బ్యాలెట్‌ ద్వారా జరిగింది. క్షేత్ర స్థాయి నుంచి సేకరించిన సమాచారం ఆధారంగా సర్వే నివేదికను పీపుల్స్‌పల్స్‌ డైరెక్టర్‌ ఆర్‌.దిలీప్‌రెడ్డి, సీనియర్‌ రిసెర్చర్‌ జి.మురళీకృష్ణ రూపొందించారు. పోస్ట్‌పోల్‌ సర్వేతో పాటు, అంతకు ముందే రీసెర్చర్లు మే 1-13 తేదీల మధ్య, రాష్ట్రంలోని 175 నియోజకవర్గాల్లో తిరిగి పోలింగ్‌కు ముందర జనం ఆలోచనా సరళిని గమనించి, వారితో మాట్లాడి ప్రధాన పార్టీల పట్ల వారి అభిప్రాయాలు పరిగణనలోకి తీసుకొని ఈ నివేదిక రూపొందించడంలో సహకరించారు.

(గమనిక : ఈ వార్తలోని అంశాలు, ఎగ్జిట్ పోల్స్ వివరాలతో హెచ్.టి.తెలుగుకు ప్రత్యక్షంగా, పరోక్షంగా ఎలాంటి సంబంధం లేదు. ఈ వార్తను మీ అవగాహన కోసం మాత్రమే అందిస్తున్నాము)

Whats_app_banner

సంబంధిత కథనం