Botcha Heart Problem: మంత్రి బొత్సకు గుండెలో ఆరోగ్య సమస్యలు-ap minister botsa satyanarayana has heart problems ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Botcha Heart Problem: మంత్రి బొత్సకు గుండెలో ఆరోగ్య సమస్యలు

Botcha Heart Problem: మంత్రి బొత్సకు గుండెలో ఆరోగ్య సమస్యలు

Sarath chandra.B HT Telugu

Botcha Heart Problem: ఏపీ విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణకు ఆరోగ్య సమస్యలు తలెత్తాయి. హృదయ సంబంధిత సమస్యలతో వైద్య పరీక్షలకు హైదరాబాద్ వెళ్లారు.

మంత్రి బొత్స సత్యనారాయణకు హృదయ సంబంధిత సమస్యలు

Botcha Heart Problem: ఆంధ్రప్రదేశ్‌ విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణకు గుండె కవాటాల్లో సమస్యలు తలెత్తినట్టు తెలుస్తోంది. హృదయ సంబంధిత సమస్యలతో బొత్స ఇబ్బంది పడుతున్నారు. ప్రాథమిక పరీక్షల్లో హృదయ స్పందనల్లో మార్పులు గుర్తించడంతో మెరుగైన వైద్య పరీక్షల కోసం హైదరాబాద్‌ వెళ్లారు. స్థానిక వైద్యుల సూచనలతో గురువారం ఉదయం వైద్య పరీక్షల నిమిత్తం కుమారుడు సందీప్‌తో కలిసి హైదరాబాద్‌ వెళ్లారు.

హైదరాబాద్‌లో జరిగిన వైద్య పరీక్షల్లో చికిత్స అవసరమని నిర్ధారించినట్లు తెలుస్తోంది. యాంజియోగ్రామ్‌ పరీక్షల ఆధారంగా బోత్సకు చేయాల్సిన చికిత్సను వైద్యులు నిర్ణ‍యించనున్నారు. వైద్య నిపుణుల సూచనల మేరకు బొత్స గుండెకు స్టెంట్లు వేయాలా, శస్త్రచికిత్స చేయాలా అనేది వైద్యులు నిర్ణయించనున్నారు.

బొత్స సత్యనారాయణ ప్రస్తుతం ఆరోగ్యంగానే ఉన్నారని కుటుంబ సభ్యులు తెలిపారు. జ్వరంతో బాధపడుతూనే ఈ నెల 4న ఎస్‌.కోటలో జరిగిన సామాజిక సాధికార యాత్రలో పాల్గొన్నారు. 5వ తేదీన శ్రీకాకుళం జిల్లా పలాస వెళ్లారు.

6వ తేదీన విశాఖలోని ప్రైవేటు ఆసుపత్రిలో ఆరోగ్య పరీక్షలు చేయించుకున్నారు. ఈసీజీ , 2డి ఎకో పరీక్షల్లో ప్రాథమికంగా సమస్యలు గుర్తించడంతో వైద్యులు మరిన్ని వైద్య పరీక్షలు అవసరమని సూచించారు. విశాఖలో చేసిన పరీక్షల్లో హృదయ సంబంధ సమస్యలు ఉన్నాయని, మెరుగైన చికిత్స అవసరమని నిపుణులు సూచించడంతో కుటుంబ సభ్యులు హైదరాబాద్ తీసుకువెళ్లారు.

గురువారం విజయనగరంలో జరిగిన మేనకోడలు వివాహానికి హాజరు కావాలని భావించినా కుటుంబ సభ్యుల ఒత్తిడితో కుమారుడితో కలిసి ముందే హైదరాబాద్‌ వెళ్లినట్టు తెలిపారు.