CBN Arrest Case : చంద్రబాబు కేసులో మా వాదనలు వినండి... సుప్రీంలో ఏపీ సర్కార్ కేవియట్ పిటిషన్!
Chandrababu Arrest Case Updates: చంద్రబాబు అరెస్ట్ కేసులో మరో పరిణామం చోటు చేసుకుంది. సుప్రీంకోర్టులో చంద్రబాబు తరపు న్యాయవాదులు పిటిషన్ దాఖలు చేసిన నేపథ్యంలో… ఏపీ సర్కార్ కేవియట్ పిటిషన్ ఫైల్ చేసింది.
Chandrababu Arrest Case: స్కిల్ స్కామ్ లో టీటీడీ అధినేత చంద్రబాబు అరెస్ట్ కేసులో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఇప్పటికే హైకోర్టులో ఊరట లభించకపోవటంతో… సుుప్రీంకోర్టును ఆశ్రయించారు చంద్రబాబు. అయితే ఇక్కడ కూడా వాయిదా పడింది. చంద్రబాబు దాఖలు చేసుకున్న క్వాష్ పిటిషన్‌పై విచారణను అక్టోబరు 3వ తేదీకి వాయిదా వేసూ ఆదేశాలు ఇచ్చింది అత్యున్నత న్యాయస్థానం. అవినీతి నిరోధక చట్టంలోని సెక్షన్ 17ఎ కింద గవర్నర్ నుంచి ముందస్తు అనుమతి తీసుకోకుండా స్కిల్ డెవలప్‌మెంట్ వ్యవహారంలో తనపై నమోదు చేసిన కేసును కొట్టేయాలని చంద్రబాబు ఎస్‌ఎల్‌పీ దాఖలు చేశారు. క్వాష్ పిటిషన్‌ను తిరస్కరిస్తూ ఏపీ హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ చంద్రబాబు శనివారం సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే.
త్వరలో చంద్రబాబు పిటిషన్ మరోసారి విచారణకు వచ్చే అవకాశం ఉండగా ఏపీ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. గురువారం సుప్రీంకోర్టులో కేవియట్ పిటిషన్ దాఖలు చేసింది. చంద్రబాబు పిటిషన్‌పై తీర్పు ఇచ్చే ముందు తమ తరపు వాదనలు కూడా వినాలని పిటిషన్ లో ప్రస్తావించింది. స్కిల్ స్కామ్ కేసులో చంద్రబాబు పాత్రపై ఎన్నో ఆధారాలున్నాయని తెలిపింది. విద్యార్థులకు శిక్షణ ఇస్తామని కోట్ల కుంభకోణం చేశారని… నిధులను షెల్ కంపెనీల ద్వారా రూటు మళ్లించి ఎన్‌క్యాష్ చేసుకున్నారని పేర్కొంది. కేంద్ర దర్యాప్తు సంస్థలు ఇప్పటికే ఈ అంశాన్ని దర్యాప్తు చేస్తున్నాయని… ఈ కేసులో మొదట సమాచారం ఇచ్చింది కేంద్ర పరిధిలోని జీఎస్టీనే అని చెప్పింది. ఈ కేసులో తమ తరపున వాదనలను వినిపిస్తామని కేవియట్ పిటిషన్ లో సుప్రీంకోర్టును కోరింది.
అక్టోబర్ 3వ తేదీన విచారణ
స్కిల్ డెవలప్మెంట్ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు దాఖలు చేసిన ఎస్ఎల్పీ పిటిషన్ బుధవారం సుప్రీంకోర్టు ధర్మాసనం ముందు విచారణకు వచ్చింది. అయితే ఈ బెంచ్‌లో తెలుగు న్యాయమూర్తి జస్టిస్ ఎస్వీఎన్ భట్టి కేసు విచారణకు విముఖత వ్యక్తం చేశారు.ఈ విషయాన్ని చంద్రబాబు లాయర్ సిద్ధార్థ లూథ్రా సీజేఐ ధర్మాసనం ముందుకు తీసుకెళ్లారు. మరో ధర్మాసనం లేదా సీజేఐ ధర్మాసనం విచారించాలని ఆయన కోరడంతో... ఈ పిటిషన్ పై విచారణకు సీజేఐ అంగీకరించారు. విచారణను మరో బెంచ్‌కు బదిలీ చేస్తామని సీజేఐ తెలిపారు. ఈ పిటిషన్ పై తదుపరి విచారణను అక్టోబర్ 3వ తేదీకి వాయిదా వేశారు.
అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో హైకోర్టులో చంద్రబాబు ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ పై హైకోర్టులో బుధవారం వాదనలు కొనసాగాయి. మంగళవారం చంద్రబాబు తరఫు న్యాయవాది సిద్ధార్థ లూథ్రా వర్చువల్‌గా వాదనలు వినిపించగా.... బుధవారం సీఐడీ తరఫున ఏజీ శ్రీరామ్ వాదనలు వినిపించారు. అమరావతి రాజధానికి సంబంధించిన మాస్టర్ ప్లాన్, ఇన్నర్ రింగ్‌రోడ్డు అలైన్‌మెంట్‌లో అక్రమాలు జరిగాయని వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి గత ఏడాది ఏప్రిల్ 27న ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు ఆధారంగా సీఐడీ కేసు నమోదుచేసింది. ఈ కేసులో చంద్రబాబును ఏ1గా పేర్కొంది. ఈ కేసులో తనకు బెయిల్ మంజూరు చేయాలని చంద్రబాబు పిటిషన్ దాఖలు చేశారు. ఈ కేసులో తదుపరి విచారణను హైకోర్టు ఈ నెల 29కు వాయిదా వేసింది. ఇదే కేసులో ఏ14గా ఉన్న నారా లోకేశ్ ముందస్తు బెయిల్ కోసం హైకోర్టును ఆశ్రయించారు.
చంద్రబాబు బెయిల్, సీఐడీ కస్టడీ పిటిషన్లపై ఏసీబీ కోర్టులో బుధవారం విచారణ జరిగింది. చంద్రబాబు తరఫున సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది ప్రమోద్ దూబే, సీఐడీ తరఫున స్పెషల్ పీపీ వివేకానంద తమ వాదనలు వినిపించారు. స్కిల్ కేసులో బెయిల్ కోరుతూ చంద్రబాబు పిటిషన్ దాఖలు చేశారు. అయితే ఈ కేసులో చంద్రబాబును మరో ఐదు రోజులు కస్టడీకి ఇవ్వాలని సీఐడీ పిటిషన్ దాఖలు చేసింది. ఈ కేసులో తదుపరి విచారణను ఏసీబీ కోర్టు అక్టోబర్ 5కు వాయిదా వేసింది.
మొత్తంగా ఆయా కోర్టులో చంద్రబాబు కేసులపై రాబోయే రోజుల్లో విచారణ జరనుంది. అయితే వీటిల్లో ఎలాంటి తీర్పు వస్తుందనేది ఉత్కంఠగా మారింది. ఈ నేపథ్యంలో సుప్రీంలో ఏపీ సర్కార్ కేవియట్ వేయటంతో… ఏం జరగబోతుందనేది ఆసక్తికరంగా మారింది.