AP New Pensions : కొత్త పెన్షన్లపై ఏపీ సర్కార్ కసరత్తు- అక్టోబర్ నుంచి అర్హులు, అనర్హులు గుర్తింపు!-ap govt decided to grant new pension removed in ysrcp govt verification process in october ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Ap New Pensions : కొత్త పెన్షన్లపై ఏపీ సర్కార్ కసరత్తు- అక్టోబర్ నుంచి అర్హులు, అనర్హులు గుర్తింపు!

AP New Pensions : కొత్త పెన్షన్లపై ఏపీ సర్కార్ కసరత్తు- అక్టోబర్ నుంచి అర్హులు, అనర్హులు గుర్తింపు!

Bandaru Satyaprasad HT Telugu
Sep 23, 2024 02:36 PM IST

AP New Pensions : ఏపీ సర్కార్ కొత్త పెన్షన్లపై కీలక నిర్ణయం తీసుకుంది. అక్టోబర్ నుంచి కొత్త పెన్షన్ల ప్రక్రియ ప్రారంభించేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. గతంలో తొలగించిన పెన్షన్లపై గ్రామ సభల ద్వారా అర్హులు, అనర్హులను గుర్తించనున్నారు.కొత్త పింఛన్లపై కేబినెట్ సబ్ కమిటీ మార్గదర్శకాలు రూపొందించనుంది.

కొత్త పెన్షన్లపై ఏపీ సర్కార్ కసరత్తు- అక్టోబర్ నుంచి అర్హులు, అనర్హులు గుర్తింపు
కొత్త పెన్షన్లపై ఏపీ సర్కార్ కసరత్తు- అక్టోబర్ నుంచి అర్హులు, అనర్హులు గుర్తింపు

AP New Pensions : ఏపీ ప్రభుత్వం కొత్త పింఛన్లపై కీలక నిర్ణయం తీసుకుంది. అక్టోబర్ నుంచి కొత్త పెన్షన్లు అందించేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. గత ప్రభుత్వంలో తొలగించిన లక్షల మంది లబ్దిదారుల వివరాలను సేకరిస్తోంది. గ్రామ సభలు నిర్వహించి ఆరు అంచెల తనిఖీల తర్వాత వితంతువులు, ఒంటరి మహిళలు, దివ్యాంగుల్లో అర్హులు, అనర్హులను గుర్తించనున్నారు. లబ్దిదారుల జాబితాను సచివాలయాల్లో ప్రదర్శించి, అనర్హుల నుంచి వివరణ తీసుకుంటారు. కేబినెట్ సబ్ కమిటీ కొత్త పెన్షన్లపై త్వరలో విధివిధానాలు ప్రకటించనుంది.

కొత్త పెన్షన్లకు మంజూరుకు త్వరలో నూతన దరఖాస్తులు స్వీకరించేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తుంది. ఈ క్రమంలోనే అనర్హులను తొలగించేందుకు సిద్దమవుతుంది. అర్హత లేకపోయినా కొందరు పెన్షన్లు తీసుకుంటున్నారని వస్తున్న ఆరోపణల నేపథ్యంలో ఏపీ సర్కార్ ఈ నిర్ణయం తీసుకుంది. అనర్హుల ఏరివేతకు కసరత్తు చేపట్టింది. గత ప్రభుత్వ హయాంలో స్థానిక నేతలు సిఫార్సులతో చాలా మంది అనర్హులకు పింఛన్లు మంజూరు చేశారనే విమర్శలు వినిపించాయి. నిజమైన అర్హతలు ఉన్న వృద్ధులు, ఒంటరి మహిళలు, వితంతువులు, దివ్యాంగులకు వివిధ కారణాలతో పింఛన్లు ఇవ్వడంలేదని విమర్శలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో అర్హులు, అనర్హులను గుర్తించాలని ప్రభుత్వం నిర్ణయించింది.

కొత్త పింఛన్లపై కేబినెట్ సబ్ కమిటీ

వైసీపీ ప్రభుత్వం హయాలో 8 లక్షల మందికి పెన్షన్లు తొలగించారనే విమర్శలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో కూటమి సర్కార్ రంగంలోకి దిగింది. అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి పింఛన్ అందించాలని నిర్ణయించింది. కొత్త పింఛన్లపై విధివిధానాల రూపకల్పనకు ఐదుగురు మంత్రులతో కేబినెట్ సబ్ కమిటీ ఏర్పాటు చేయాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు. పెన్షన్లకు సంబంధించి ఒక యాప్ అందుబాటులో తీసుకొచ్చే యోచనలో ప్రభుత్వం ఉంది. ఇందులో రాష్ట్రవ్యాప్తంగా పింఛన్ దారులు సమాచారం అందుబాటులో ఉండనుంది.

ప్రస్తుత లబ్ధిదారుల్లో అర్హులు, అనర్హులను గుర్తించేందుకు అధికారులు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. ముఖ్యంగా వితంతువులు, ఒంటరి మహిళల్లో అనర్హులను గుర్తించేందుకు కోసం ప్రత్యేక విధానాన్ని రూపొందిస్తున్నారు. అర్హులు, అనర్హుల జాబితాను రూపొందించిన తర్వాత కేబినెట్ సబ్ కమిటీ పరిశీలించి సీఎంకు అందజేయనుంది.

50 ఏళ్లు దాటిన వారికి పింఛన్లు

పింఛన్ల విషయంలో నెలలోపు సమగ్ర నివేదికను అందించాలని అధికారులను సీఎం చంద్రబాబు ఇటీవల ఆదేశించారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో అర్హత ఉన్నా చాలా మందికి పింఛన్లు ఇవ్వలేదని, అర్హత ఉన్న ఏ ఒక్కరూ పెన్షన్ కు దూరం కాకుండా మార్గదర్శకాలు రూపొందించాలని సూచించారు. దీంతో ఎన్నికల మేనిఫెస్టో ప్రకారం 50 ఏళ్లు దాటిన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు పింఛన్ అందించే హామీ అమలుకు ఇప్పటికే కసరత్తు పూర్తి చేసినట్లు సమాచారం.

రాష్ట్రంలో 50-60 ఏళ్ల మధ్య ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు 15 లక్షల మంది ఉన్నట్లు అధికారులు గుర్తించారు. వీరికి పింఛన్లు మంజూరుపై కార్యాచరణ రూపొందించాలని సీఎం అధికారులను ఆదేశించారు. పింఛన్ దారుల అర్హతను నిర్ధారించే అంశంపై త్వరలోనే కేబినెట్ సబ్ కమిటీని ఏర్పాటు చేయనున్నట్లు మంత్రి కొండపల్లి శ్రీనివాస్‌ తెలిపారు.

Whats_app_banner

సంబంధిత కథనం