AP Government : ఉద్యోగుల‌పై కేసులు పెట్టేవారికి ర‌క్ష‌ణ‌.. ఏపీ ప్ర‌భుత్వం కీల‌క నిర్ణ‌యం-ap government takes key decision to provide protection to those filing cases against employees ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Ap Government : ఉద్యోగుల‌పై కేసులు పెట్టేవారికి ర‌క్ష‌ణ‌.. ఏపీ ప్ర‌భుత్వం కీల‌క నిర్ణ‌యం

AP Government : ఉద్యోగుల‌పై కేసులు పెట్టేవారికి ర‌క్ష‌ణ‌.. ఏపీ ప్ర‌భుత్వం కీల‌క నిర్ణ‌యం

HT Telugu Desk HT Telugu
Nov 03, 2024 09:40 AM IST

AP Government : ఏపీ సర్కారు కీలక నిర్ణయం తీసుకుంది. ప్ర‌భుత్వ ఉద్యోగుల‌పై కేసులు పెట్టే వారికి ర‌క్ష‌ణ క‌ల్పిస్తూ ఆదేశాలు జారీ చేసింది. ఏడీజీపీ స్థాయి అధికారికి బాధ్య‌త‌లు అప్ప‌గించింది. ఉద్యోగులపై ఆరోపణలు, ఫిర్యాదులు చేసేవారి వివరాలు బహిర్గతం చేయొద్దని ఉత్తర్వు జారీ చేసింది.

ఏపీ ప్ర‌భుత్వం
ఏపీ ప్ర‌భుత్వం

రాష్ట్రంలోని ఉద్యోగుల విష‌యంలో ఆంధ్రప్ర‌దేశ్ ప్ర‌భుత్వం కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. ప్ర‌భుత్వ ఉద్యోగుల‌పై ఆరోప‌ణ‌లు, కేసులు పెట్టే వారికి ర‌క్ష‌ణ క‌ల్పించేలా కూట‌మి ప్ర‌భుత్వం చ‌ర్య‌లు చేప‌ట్టింది. లంచ‌గొండి అధికారుల‌పై ఫిర్యాదులు చేసేవారికి ర‌క్ష‌ణ కోసం.. ఏడీజీపీ స్థాయి అధికారికి బాధ్య‌త‌లు అప్ప‌గించింది. నోడల్‌ అధికారిగా అదనపు డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (ఇంటెలిజెన్స్) మహేష్‌ చంద్ర లడ్డా నియమించింది. ఈ మేర‌కు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరభ్ కుమార్ ప్రసాద్ ఉత్త‌ర్వులు జారీ చేశారు.

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ విజిలెన్స్ కమిషన్.. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులపై ఫిర్యాదులు చేసే వారికి సెక్యూరిటీ కవర్ చేసేందుకు నిర్ణ‌యం తీసుకుంది. అదనపు డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్, ఇంటెలిజెన్స్ డిపార్ట్‌మెంట్ నోడల్ ఆఫీసర్‌గా నామినేట్ చేస్తూ ఉత్త‌ర్వుల్లో పేర్కొన్నారు. ఏ ఉద్యోగి అయినా అవినీతి లేదా, త‌న అధికారాన్ని దుర్వినియోగం చేసినట్లు ఫిర్యాదులు, బహిర్గ‌తం చేసే వారికి భద్రత కల్పించడానికి సంబంధించిన సమస్యలను నోడ‌ల్ అధికారి చూస్తారని అర్డ‌ర్‌లో స్ప‌ష్టం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం, కార్పొరేషన్, ప్రభుత్వ కంపెనీలు, సొసైటీలు లేదా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం యాజమాన్యం లేదా నియంత్రణలో ఉన్న స్థానిక అధికారులపై ఫిర్యాదుల‌ను చేసేవారికి ర‌క్ష‌ణ ఉంటుంది.

పెన్షన్ డబ్బులతో పరార్..

సామాజిక పింఛన్ల పంపిణీకి సంబంధించిన రూ.2.30 ల‌క్ష‌ల‌ నగదుతో.. ప‌ల్నాడు జిల్లా గురజాల మండలం తేలుకుట్ల గ్రామ సచివాలయ అగ్రికల్చర్ అసిస్టెంట్ బత్తుల వెంకట నారాయణ ప‌రార్ అయ్యాడు. దీనిపై తక్షణమే స్పందించిన జిల్లా కలెక్టర్ పి.అరుణ్ బాబు.. అగ్రికల్చర్ అసిస్టెంట్ వెంక‌ట నారాయ‌ణ‌ను విధులు నుండి సస్పెండ్ చేస్తూ ఆదేశాలు జారీ చేశారు. న‌వంబ‌ర్ 1 తేదీన సామాజిక పింఛ‌న్లు పంపిణీ చేయ‌కుండా ఆయ‌న రూ.2.30 ల‌క్ష‌ల న‌గ‌దుతో ప‌రారు అయ్యాడ‌ని పేర్కొన్నారు.

పెన్ష‌న్ డ‌బ్బులతో ప‌రార్ కావ‌డంతో ఆయ‌న‌పై క్ర‌మ శిక్ష‌ణ చ‌ర్య‌లు తీసుకున్నామ‌ని, స‌స్పెన్ష‌న్ వ్య‌వ‌ధిలో జిల్లా వ్య‌వ‌సాయ అధికారి ముందుస్తు అనుమ‌తి తీసుకోకుండా జిల్లా కేంద్రాన్ని విడిచి వెళ్ల కూడ‌ద‌ని ఆదేశాల్లో పేర్కొన్నారు. ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ సివిల్ సర్వీసెస్ (వర్గీకరణ, నియంత్రణ అండ్‌ అప్పీల్) రూల్స్- 1991లోని 8వ నిబంధనలోని సబ్ రూల్ 3.7.8 ప్రకారం.. దుర్వినియోగానికి పాల్ప‌డినందున తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు సస్పెన్షన్ అమ‌లు అవుతుంద‌ని స్పష్టం చేశారు.

(రిపోర్టింగ్- జ‌గ‌దీశ్వ‌ర‌రావు జర‌జాపు, హిందుస్తాన్ టైమ్స్ తెలుగు)

Whats_app_banner