AP Pensions Cancellation: ఏపీలో అనర్హుల పెన్షన్ల రద్దు షురూ.. సచివాలయ సిబ్బందికి సెర్ప్‌ సీఈఓ ఆదేశాలు-cancellation of pensions of ineligible persons begins in ap serp ceos instructions to secretariat staff ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Ap Pensions Cancellation: ఏపీలో అనర్హుల పెన్షన్ల రద్దు షురూ.. సచివాలయ సిబ్బందికి సెర్ప్‌ సీఈఓ ఆదేశాలు

AP Pensions Cancellation: ఏపీలో అనర్హుల పెన్షన్ల రద్దు షురూ.. సచివాలయ సిబ్బందికి సెర్ప్‌ సీఈఓ ఆదేశాలు

Bolleddu Sarath Chandra HT Telugu
Dec 17, 2024 03:35 PM IST

AP Pensions Cancellation: ఏపీలో అనర్హులకు పెన్షన్ల రద్దు ప్రక్రియ ప్రారంభమైంది.ఈ మేరకు సెర్ప్‌ సీఈఓ వీరపాండియన్‌ ఉత్తర్వులు జారీ చేశారు. ఇటీవల రాష్ట్ర వ్యాప్తంగా పైలట్‌ ప్రాజెక్టులో చేపట్టిన తనిఖీల్లో మొత్తం 10వేల పెన్షన్లలో 563మంది అనర్హులను గుర్తించారు. ఆ పెన్షన్లను రద్దు చేయాలని ఆదేశించారు.

ఏపీలో నకిలీ పెన్షన్ల ఏరివేత ప్రారంభం
ఏపీలో నకిలీ పెన్షన్ల ఏరివేత ప్రారంభం

AP Pensions Cancellation: ఆంధ్రప్రదేశ్‌లో అనర్హుల పెన్షన్ల ఏరివేత ప్రక్రియను ప్రభుత్వం ప్రారంభించింది. ఈ మేరకు గ్రామ, వార్డు సచివాలయ సిబ్బందితో చర్యలు చేపట్టాలని సెర్ప్‌ సీఈఓ వీరపాండియన్‌ ఉత్తర్వులు జారీ చేశారు. అర్హులకు మాత్రమే పెన్షన్లు అందాలనే ప్రభుత్వ విధానపరమైన నిర్ణయంలో భాగంగా డిసెంబర్ 9,10 తేదీల్లో రాష్ట్ర వ్యాప్తంగా సామాజిక పెన్షన్ల తనిఖీ చేపట్టారు. ఈ తనిఖీల్లో పెద్ద సంఖ్యలో అనర్హులను గుర్తించారు. దాదాపు 11వేల పెన్షన్లను తనిఖీ చేస్తే అందులో 563మంది అర్హత లేకున్నా పెన్షన్లు అందుకుంటున్నట్టు తనిఖీ బృందాలు గుర్తించాయి.

yearly horoscope entry point

అనర్హుల పెన్షన్లను తక్షణం నిలిపివేయాలని కలెక్టర్ల సదస్సుల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు. రాష్ట్రంలో దాదాపు 6లక్షల మంది అనర్హులు పెన్షన్లు అందుకుంటున్నట్టు పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల ముఖ్యమంత్రికి వివరించారు.

ఈ నేపథ్యంలో మంగళవారం గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ ఉత్తర్వులు జారీ చేసింది. వృద్ధులు, వికలాంగులు, వితంతువులకు గౌరవప్రదమైన జీవితాన్ని గడిపేందుకు పెన్షన్లను జారీ చేస్తున్నట్టు, అర్హులకు మాత్రమే వాటిని అందించాలని ప్రభుత్వం భావిస్తోంది. ఈ క్రమంలో అనర్హులుగా గుర్తించిన వారి పెన్షన్లను రద్దు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.

పెన్షన్లను పొందడానికి ప్రభుత్వం స్పష్టమైన మార్గదర్శకాలు రూపొందించిన నేపథ్యంలో అనర్హులను తొలగించాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. అనర్హుల జాబితాలను ఎంపిడిఓ, మునిసిపల్ కమిషనర్ల లాగిన్‌లలో అందుబాటులో ఉంచారు. గ్రామ వార్డు సచివాలయ సిబ్బంది ద్వారా అనర్హులకు నోటీసులు జారీ చేయాలని, నిర్దిష్ట గడువులోగా వారి నుంచి సమాధానాలు తీసుకోవాలని పేర్కొన్నారు. నోటీసులు అందుకోని వారి పెన్షన్లను చెల్లించకుండా నిలిపివేయాలని సూచించారు.

మూడు నెలల్లో పెన్షన్ల ప్రక్షాళన..

ఆంధ్రప్రదేశ్‌లో అనర్హులకు పెన్షన్ల చెల్లింపు వ్యవహారంపై ముఖ్యమంత్రి చంద్రబాబు కలెక్టర్ల సమావేశంలో స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. పెన్షన్లను గుర్తించడంపై రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టిన పైలట్ సర్వేలో నకిలీ పెన్షన్లను గుర్తించారని, రాష్ట్ర వ్యాప్తంగా 6లక్షల మంది అనర్హులకు పెన్షన్లు చెల్లిస్తుండొచ్చని పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్‌ ముఖ్యమంత్రికి వివరించారు. పెన్షన్ల జారీ చేసే సమయంలో ఉద్దేశపూర్వకంగా అనర్హులను చేర్చేశారని వివరించారు.

దీంతో ముఖ్యమంత్రి మూడునెలల్లో అనర్హులను గుర్తించే ప్రక్రియ పూర్తి చేయాలని కలెక్టర్లను ఆదేశించారు. పెన్షన్ల తనికీ పూర్తైన తర్వాత తాను మరోసారి కనీసం 5శాతం పెన్షన్లను ర్యాండమ్‌ తనిఖీ చేయిస్తానని హెచ్చరించారు. అందులో కూడా అనర్హులు బయటపడితే కలెక్టర్లు బాధ్యత వహించాల్సి ఉంటుందని, మూడు నెలల్లో ఈ ప్రక్రియ పూర్తి కావాలని ఆదేవించారు.

ఎన్టీఆర్ భరోసా కింద రాష్ట్ర ప్రభుత్వం దాదాపు 64లక్షల మందికి ప్రతి నెల పెన్షన్లు చెల్లిస్తోంది. సామాజిక పెన్షన్లలో వృద్ధులకు రూ.4వేలు చెల్లిస్తుండగా ఇతర క్యాటగిరీల్లో వివిధ మొత్తాలను చెల్లిస్తున్నారు. ఈ క్రమంలో నకిలీ పెన్షన్లపై ఫిర్యాదులు రావడంతో పైలట్ ప్రాజెక్టు కింద రెండు రోజుల క్రితం రాష్ట్ర వ్యాప్తంగా ఒక్కో క్లస్టర్‌లో తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో దాదాపు 500మంది అనర్హులుగా కమిటీలు గుర్తించాయి.

వికలాంగుల క్యాటగిరీలోనే ఎక్కువ..

రాష్ట్ర వ్యాప్తంగా వికలాంగుల కేటగిరీలో పెద్ద సంఖ్యలో అనర్హులు పింఛన్లు పొందుతున్నట్టు సెర్ప్‌ అధికారులు భావిస్తున్నారు. వికలాంగులకు రూ.15వేల వరకు పెన్షన్ చెల్లస్తున్నారు. వితంతువుల విభాగంలో కూడా బోగస్ పెన్షన్లు ఉన్నట్టు పేదరిక నిర్మూలన సంస్థ సిబ్బంది క్షేత్ర స్థాయి తనిఖ‌ీల్లో గుర్తించారు. ప్రతి సచివాలయం పరిధిలోనూ దివ్యాంగుల కోటాలో అనర్హులు పింఛన్లు పొందుతున్నట్టు గుర్తించారు.

బధిరులు సర్టిఫికెట్లతో వికలాంగుల పెన్షన్లు పొందుతున్నారు. లబ్దిదారుల కుటుంబంలో ఎవరికైనా కారు ఉన్నా, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, ప్రభుత్వం నిర్దేశించిన దాని కంటే పొలం ఎక్కువగా ఉండటం వంటి అంశాలను గుర్తించారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం మూడునెలల్లో అనర్హులను గుర్తించాలని, విచారణ జరిపి వాటిని రద్దు చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు.

Whats_app_banner