ఐఐటీ బాంబే పూర్వ విద్యార్థి, గ్రే ల్యాబ్స్ ఏఐ సీఈఓ అయిన అమన్ గోయల్ సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ ఎక్స్ లో షేర్ చేసిన ఒక పోస్ట్ వైరల్ గా మారింది. అందరూ చెప్పే మంచి అలవాట్లేమీ లేకుండా కూడా తాను విజయవంతమయ్యానని అమన్ గోయల్ ఆ పోస్ట్ లో వ్యాఖ్యానించారు. చాలా మంది అనుసరిస్తున్న ఆదర్శవంతమైన అలవాట్లను పాటించకుండానే తన 20 లలోనే మల్టీ మిలియనీర్ అయ్యానని పేర్కొన్నారు.
ఎక్స్ లో షేర్ చేసిన ఒక పోస్ట్ లో, గోయల్ తాను ఉదయాన్నే లేవనని, తనకు పుస్తకాలు చదివే అలవాటు లేదని, ఉదయాన్నే లేచి చన్నీటి స్నానం చేయనని వివరించాడు. చాలామంది సక్సెస్ ఫుల్ పీపుల్, మిలయనీర్లు చెప్పే ఈ అలవాట్లు తనకు లేవన్నారు. ఇన్ఫ్లూయెన్సర్లు ప్రోత్సహించే మంచి' అలవాట్లను పాటించకుండానే తన 20 ల లోనే మల్టీ మిలియనీర్ అయ్యానని గోయల్ తన ఎక్స్ పోస్ట్ లో పేర్కొన్నారు. "నేను ఉదయం 5 గంటలకు లేవను. నేను చన్నీటితో తల స్నానం చేయను. నేను పుస్తకాలు చదవను. మిలియనీర్ కావడానికి గొప్పవారు అందరూ చెప్పుకునే 'ఆదర్శ అలవాట్లను' నేను పాటించను. అయినప్పటికీ, ఇక్కడ నేను నా 20 లలోనే మల్టీ మిలియనీర్ ను అయ్యాను" అని ఆయన రాశారు.
చాలా రోజులు తాను ఉదయం 8.30 గంటలకు, కొన్నిసార్లు ఉదయం 9 గంటలకు కూడా మేల్కొంటానని గోయల్ చెప్పారు. చివరిసారిగా ఒక పుస్తకాన్ని ఎప్పుడు చేతిలోకి తీసుకున్నానో కూడా తనకు గుర్తు లేదన్నారు. సోషల్ మీడియా, పాడ్ కాస్ట్ వంటి వేగవంతమైన పద్ధతుల ద్వారా జ్ఞానాన్ని పొందడానికి ఇష్టపడతానని వివరించాడు. అయితే, ఆదర్శవంతమైన జీవనశైలిని తాను తప్పుపట్టడంలేదని వివరించాడు. మంచి అలవాట్ల ప్రాముఖ్యతను తగ్గించడం తన ఉద్దేశం కాదని, వృత్తిపరమైన విజయానికి అవి తప్పనిసరి కాదని చెప్పడం మాత్రమే తన ఉద్దేశమని ఆయన చివర్లో ఒక డిస్క్లైమర్ జోడించారు.
గోయల్ ప్రకారం, ఈ 'ఆదర్శ అలవాట్లను' అనుసరించడానికి బదులుగా, కోటీశ్వరుడు కావాలనుకునే ఎవరైనా మూడు సరళమైన దశలను అనుసరించాలి. అవి "విలువైనదాన్ని నిర్మించండి. కస్టమర్ లకు విక్రయించండి. మీరు మీ లక్ష్యం నెరవేరే వరకు దానిని పునరావృతం చేయండి" అని వివరించాడు. 'మధ్యాహ్నం 12 గంటలకు నిద్రలేచినా ఫర్వాలేదు. మీరు ఎప్పుడూ పుస్తకాన్ని తీసుకోకపోయినా ఫర్వాలేదు. విజయం "ఆదర్శ" దినచర్యల నుండి రాదు. ఇది సరైన నిర్ణయం తీసుకోవడం, విలువను అందించడం నుండి వస్తుంది" అని ఆయన అభిప్రాయపడ్డారు.
ఎక్స్ లో ఆయన (Aman Goel) పెట్టిన పోస్ట్ కు 50 వేలకు పైగా వ్యూస్ వచ్చాయి. కామెంట్స్ సెక్షన్ లో కొందరు ఆయనతో విభేదించారు. 'మంచి అలవాట్లు మీ విజయావకాశాలను పెంచుతాయి. అందరు కాలేజ్ డ్రాపవుట్స్ సక్సెస్ ఫుల్ స్టార్టప్ లను తయారు చేయరు. కాలేజీ డ్రాపవుట్స్ కంటే ఏ, ఏ ప్లస్ గ్రేడ్లతో పాస్ అయినవారే విజయం సాధించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి' అని సంభవ్ దాగా రాశారు. 'జేఈఈ (jee) 33వ ర్యాంక్ తో ఐఐటీ బాంబే (IIT Bombay) లో చదివిన మీతో మామూలు, సాధారణ విద్యార్థులను పోల్చడం హాస్యాస్పదం’’ అని మరొకరు వ్యాఖ్యానించారు.
అమన్ గోయల్ (Aman Goel) లింక్డ్ఇన్ ప్రొఫైల్ ప్రకారం, అతను ఐఐటీ బాంబే (IIT Bombay) నుండి కంప్యూటర్ సైన్స్ మరియు ఇంజనీరింగ్ లో బ్యాచిలర్ డిగ్రీని పొందాడు. 2017లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన తర్వాత కాగ్నో ఏఐ (artificial intelligence) సహ వ్యవస్థాపకుడుగా, సీఈఓగా పనిచేశారు. ప్రస్తుతం ముంబైకి చెందిన గ్రేల్యాబ్స్ ఏఐ సహ వ్యవస్థాపకుడు, సీఈఓగా ఉన్నారు.