Vigilance Enquiry: ప్రాజెక్టులపై విజిలెన్స్ విచారణ, మిడ్ మానేర్, కొండపోచమ్మ, మల్కపేట రిజర్వాయర్ ల ఫైళ్ళు సీజ్-vigilance inquiry on projects files of mid maner kondapochamma malkapeta reservoir seized ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Vigilance Enquiry: ప్రాజెక్టులపై విజిలెన్స్ విచారణ, మిడ్ మానేర్, కొండపోచమ్మ, మల్కపేట రిజర్వాయర్ ల ఫైళ్ళు సీజ్

Vigilance Enquiry: ప్రాజెక్టులపై విజిలెన్స్ విచారణ, మిడ్ మానేర్, కొండపోచమ్మ, మల్కపేట రిజర్వాయర్ ల ఫైళ్ళు సీజ్

HT Telugu Desk HT Telugu
Sep 24, 2024 11:27 AM IST

Vigilance Enquiry: గత ప్రభుత్వం బిఆర్ఎస్ చేపట్టిన సాగునీటి ప్రాజెక్టులపై విజిలెన్స్ విచారణ సాగుతుంది.‌ ముఖ్యంగా ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని మిడ్ మానేర్, మల్కపేట కొండపోచమ్మ సాగర్ రిజర్వాయర్ ల రికార్డులను విజిలెన్స్ అధికారులు పరిశీలించారు. పలు ఫైళ్ళను సీజ్ చేసి హైదరాబాద్ కు తరలించారు.

మిడ్ మానేర్, కొండపోచమ్మ, మల్కపేట రిజర్వాయర్ ల ఫైళ్ళు సీజ్
మిడ్ మానేర్, కొండపోచమ్మ, మల్కపేట రిజర్వాయర్ ల ఫైళ్ళు సీజ్

Vigilance Enquiry: మిడ్ మానేర్, కొండపోచమ్మ, మల్కపేట రిజర్వాయర్ పనులపై విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు విచారణ వేగవంతం చేశారు. రెండు రోజులపాటు కరీంనగర్ జిల్లా ఎల్ఎండి కాలనీలోని ఇరిగేషన్ ఆఫీసుల్లో ఆయా ప్యాకేజీలకు సంబంధించిన ఫైళ్లను సీజ్ చేసి హైదరాబాద్ కు తరలించారు.

విజిలెన్స్ ఆఫీసర్ లు శశిధర్, శ్రీనివాస్ లు ఇరిగేషన్ సర్కిల్ కార్యాలయాల్లోని పలు రికార్డులను పరిశీలించారు. డిప్యూటీ ఎస్ఈలు వెంకటయ్య, మహమ్మద్ అస్మత్ అలీల నుంచి వివరాలను అడిగి తెలుసుకున్నారు. ప్రాజెక్టు అంచనాలు, అనుమతులు, కాంట్రాక్టర్ కు బిల్లుల చెల్లింపులు తదితర వివరాలపై ఆరాతీశారు. కాళేశ్వరం 9వ ప్యాకేజీలోని మల్కపేట జలాశయం వివరాలను సేకరించారు.

కాంగ్రెస్ నాయకుడు ఫిర్యాదుతో విచారణకు ఆదేశించిన ప్రభుత్వం

మిడ్ మానేరు ప్రాజెక్టులో లోపాలు ఉన్నాయని, ప్రజాధనం దుర్వినియోగం అయిందని మిడ్ మానేర్ నిర్వాసితుడు కాంగ్రెస్ నాయకులు కూస రవీందర్ ప్రభుత్వానికి ఫిర్యాదు చేయడంతో విచారణకు ప్రభుత్వం ఆదేశించింది. ప్యాకేజీ 14లోని కొండపోచమ్మ సాగర్ అప్రోచ్ చానల్, కెనాల్, పంప్ హౌస్ పనుల అంచనాను రూ.1332 కోట్ల నుంచి రూ. 2281 కోట్లకు పెంచడం ద్వారా నాటి ఈఎన్సీ మురళీధర్ రావు ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశారనే ఆరోపణలు ఉన్నాయి.

ప్యాకేజీ 9లో చేపట్టిన మల్కపేట రిజర్వాయర్ పనుల్లో రూ.79 కోట్లు అదనంగా చెల్లింపులు చేశారని ఆధారాలతో రాష్ట్ర ప్రభుత్వానికి ఇటీవల రవీందర్ ఫిర్యాదు చేశారు. మిడ్ మానేరు పనుల్లోనూ కాంట్రాక్ట్ సంస్థకు సహకరించి, అగ్రిమెంట్,పై ప్రొసీజర్ పాటించకపోవడం వల్ల ఖజానాకు రూ. 224.70 కోట్ల నష్టం వాటిల్లిందని తెలిపారు. దీంతో వాటిపై రాష్ట్ర ప్రభుత్వం విజిలెన్స్ విచారణకు ఆదేశించడంతో రెండు రోజులపాటు ఎల్ఎండి కాలనీలో రికార్డులను పరిశీలించి పలు ఫైళ్ళను సీజ్ చేసి తీసుకెళ్లారు.

అనుమతులు లేకుండా టెండర్లు…

2016 సెప్టెంబర్ 25న మిడ్ మానేర్ కు 22 వేల క్యూసెక్కుల వరద రావడంతో స్పిల్ వే గేటు పక్కన ఉన్న మట్టికట్ట కొట్టుకుపోయింది. అగ్రిమెంట్ ప్రకారం...పనులు పురోగతిలో ఉండగా ఏదైనా నష్టం జరిగితే.. ఆ నష్టాన్ని సంబంధిత కాంట్రాక్టరే భరించాలి. కానీ కాంట్రాక్ట్ ఏజెన్సీ రాజరాజేశ్వరి కన్స్ట్రక్షన్పై ఎలాంటి చర్యలు తీసుకోకుండా.. బండ్, స్పిల్ వే పునరుద్ధరణకు పరిపాలన అనుమతుల్లేకుండానే మరో రూ.224 కోట్లు కేటాయించి.. టెండర్లు పిలిచారు.

ఆ పనులను కూడా అదే కన్స్ట్రక్షన్స్ కంపెనీకి అప్పగించారు. అంతేకాకుండా స్పిల్ వే రైట్ సైడ్ పార్టు పాత రేట్ల ప్రకారం పనులు అప్పగించి.. లెఫ్ట్ సైడ్ పనులకు రేట్లు పెంచి అప్పగించారు. అగ్రిమెంట్ ను పక్కనపెట్టడం, ప్రొసీజర్ పాటించకుండా కాంట్రాక్టర్ ఏజెన్సీకి అనుకూలంగా వ్యవహరించడం వల్ల ప్రభుత్వ ఖజానాకు రూ.224 కోట్ల నష్టం వాటిల్లినట్లు కాంగ్రెస్ లీడర్ కూస రవీందర్ తన ఫిర్యాదులో పేర్కొన్నారు.

కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా ప్యాకేజీ 14లో నిర్మించిన కొండపోచమ్మ సాగర్ లోకి నీళ్లు ఎత్తిపోసేందుకు చేపట్టిన కన్వేయర్ సిస్టమ్ (అప్రోచ్ చానల్, టన్నెల్, సర్జ్ పూల్, పంప్ హౌస్)ను మార్చడంతో అంచనాలు పెరిగిపోయాయి. ఈఎన్సీ మురళీధర్ రావు తొలుత రూ.1,332 కోట్లు అంచనా వేయగా.. మళ్లీ రూ.2,281 కోట్లకు పెంచారు. తర్వాత టన్నెల్ సిస్టం రద్దు చేసి ఓపెన్ కెనాల్, పంపులు, మోటార్లతో రెండు దశల్లో పంపింగ్ విధానం తీసుకొచ్చి మళ్లీ అంచనా వ్యయాన్ని సవరించి రూ.2,895.40 కోట్లకు పెంచారు.

పంపులు, మోటార్ల రేట్లను అసాధారణ రీతిలో పెంచడం, ప్రాజెక్ట్ రీడిజైన్తో అంచనాలు భారీగా పెరిగి రాష్ట్ర ఖజానాకు సుమారు రూ.1,600 కోట్ల నష్టం వాటిల్లింది. మల్కపేట రిజ ర్వాయర్ పనుల్లో కాంట్రాక్టర్లకు రూ.79.13 కోట్లు అదనంగా చెల్లించినట్లు తెలిసింది. దీంతో ప్రభుత్వం విజిలెన్స్ విచారణకు ఆదేశించి వాస్తవాలను తెలుసుకొని చర్యలు చేపట్టే పనిలో నిమగ్నమైంది.

(రిపోర్టింగ్ కె వి రెడ్డి ఉమ్మడి కరీంనగర్ జిల్లా కరస్పాండెంట్ హిందుస్థాన్ టైమ్స్ తెలుగు)