Mrunal Thakur: అడివి శేష్ ‘డెకాయిట్’ నుంచి శ్రుతి హాసన్ అవుట్.. ఛాన్స్ కొట్టేసిన మృణాల్ ఠాకూర్
Mrunal Thakur: అడివి శేష్ నటిస్తున్న యాక్షన్ డ్రామా డెకాయిట్ నుంచి ఎట్టకేలకి అప్‌డేట్ వచ్చింది. ఈరోజు అడివి శేష్ పుట్టిన రోజు సందర్భంగా విడుదల చేసిన రెండు పోస్టర్స్‌తో హీరోయిన్‌పై కూడా క్లారిటీ వచ్చేసింది.
అడివి శేష్ లేటెస్ట్ మూవీ డెకాయిట్ నుంచి ఇంట్రస్టింగ్ అప్‌డేట్ వచ్చింది. షానీల్ డియో దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో తొలుత హీరోయిన్‌గా శ్రుతి హాసన్‌ను అనుకున్నారు. ఆ మేరకు కొన్ని సీన్స్ కూడా షూట్ చేసి గ్లింప్స్ కూడా వదలగా మంచి రెస్పాన్స్ వచ్చింది. కానీ.. తెరవెనుక ఏం జరిగిందో ఏమీ సడన్‌గా ఈ మూవీ నుంచి శ్రుతి హాసన్ తప్పుకోగా.. క్రేజీ హీరోయిన్ మృణాల్ ఠాకూర్ ఎంట్రీ ఇచ్చింది.
శ్రుతిహాసన్ తప్పుకోవడంపై క్లారిటీ
సీతారామం సినిమాతో సౌత్‌లో మంచి క్రేజ్ తెచ్చుకున్న మృణాల్ ఠాకూర్.. బాలీవుడ్‌తో పాటు సౌత్‌లో వరుస సినిమాలు చేస్తోంది. ఈరోజు అడివి శేష్ పుట్టినరోజు కావడంతో.. డెకాయిట్ నుంచి రెండు పోస్టర్‌లను వదలగా.. అందులో మృణాల్ ఠాకూర్ కనిపించింది. దాంతో శ్రుతి హాసన్ అధికారికంగా మూవీ నుంచి తప్పుకున్నట్లు తేలిపోయింది. డెకాయిట్ సినిమాను అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్‌పై సుప్రియ యార్లగడ్డ నిర్మిస్తోంది.
ఫెయిల్యూర్ లవ్ స్టోరీ
డెకాయిట్ మూవీపై ఈరోజు అడివి శేష్ పోస్టర్ ద్వారా అప్‌డేట్ ఇస్తూ ‘‘అవును.. ప్రేమించావు. కానీ.. మోసం చేశావు. విడిచిపెట్టను తేల్చాల్సిందే’’ అని మృణాల్ ఠాకూర్ క్యారెక్టర్‌ను ఉద్దేశిస్తూ రాసుకొచ్చాడు. దానికి మృణాల్ ఠాకూర్ కూడా రిప్లై ఇచ్చింది. ‘‘అవును వదిలేశాను. కానీ.. మనస్ఫూర్తిగా ప్రేమించాను’’ హ్యాపీ బర్త్‌డే అడివి శేష్ అని రాసుకొచ్చింది. డెకాయిట్ ఒక ప్రేమ కథ అని రెండు పోస్టర్లలోనూ కామన్‌గా కనిపించింది.
హిట్-2 తర్వాత రెండేళ్లు గ్యాప్
వాస్తవానికి అడివి శేష్ నుంచి మేజర్, హిట్-2 తర్వాత ఎలాంటి సినిమా రాలేదు. 2023లోనే గూఢచారి -2 సెట్స్‌పైకి వెళ్లినా.. దానికి సంబంధించిన అప్‌డేట్ లేదు. ఆ తర్వాత ఈ డెకాయిట్‌పై గత కొంతకాలంగా అప్‌డేట్ ఇవ్వలేదు. దాంతో వచ్చే ఏడాది ఈ రెండు సినిమాల్ని విడుదల చేసేందుకు అడివి శేష్ ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది.
మృణాల్ ఎదురుచూపులు
మరోవైపు మృణాల్ ఠాకూర్ కూడా గత రెండేళ్లుగా సీతారామం రేంజ్ హిట్ కోసం ఎదురుచూస్తోంది. తెలుగులో ఆమె నటించిన హాయ్ నాన్న, ది ఫ్యామిలీ స్టార్ బాక్సాఫీస్ వద్ద ఊహించినంత వసూళ్లని రాబట్టలేకపోయాయి. దాంతో ఈ డెకాయిట్‌పై ఈ ముద్దుగుమ్మ గంపెడాశలు పెట్టుకున్నట్లు కనిపిస్తోంది.