Dil Raju: ఈగల్ కోసం.. ఆ మూవీ వాయిదా: కన్ఫర్మ్ చేసిన దిల్‍రాజు.. ఫ్యామిలీ స్టార్ రిలీజ్‍పై హింట్
Ooru peru Bhairavakona Postponed - Dil Raju: ఊరు పేరు భైరవకోన సినిమా రిలీజ్ వాయిదా పడడం ఖాయమైంది. రిలీజ్‍ను ఆలస్యం చేసేందుకు మూవీ టీమ్ అంగీకరించిందని ప్రముఖ నిర్మాత దిల్‍రాజు ప్రకటించారు. అలాగే, ఫ్యామిలీ స్టార్ రిలీజ్ గురించి కూడా హింట్ ఇచ్చారు.
Dil Raju: మాస్ మహారాజ్ రవితేజ హీరోగా నటించిన ఈగల్ సినిమా సంక్రాంతి సందర్భంగా జనవరి 13న రిలీజ్ కావాల్సింది. అయితే, సంక్రాంతికి విపరీతమైన పోటీ ఉండటంతో.. తెలుగు ఫిల్మ్స్ చాంబర్ కోరడటంతో ఆ మూవీని మేకర్స్ వాయిదా వేశారు. ఈగల్‍కు సోలో రిలీజ్ ఉండేలా ప్రయత్నిస్తామని ఫిల్మ్ చాంబర్ అధ్యక్షుడు, ప్రముఖ నిర్మాత దిల్‍రాజు అప్పట్లో చెప్పారు. దీంతో ఫిబ్రవరి 9వ తేదీన ఈగల్ రిలీజ్ చేయనున్నట్టు మేకర్స్ ప్రకటించారు. అయితే, ‘యాత్ర 2’ ఫిబ్రవరి 8న, సందీప్ కిషన్ హీరోగా నటించిన ‘ఊరు పేరు భైరవకోన’ 9న రిలీజ్ డేట్‍ను ప్రకటించాయి. దీంతో ఈగల్‍కు పోటీ ఏర్పడింది. దీంతో ఈ విషయంపై చర్చించేందుకు నేడు (జనవరి 29) ఫిల్మ్స్ చాంబర్ ప్రతినిధులు సమావేశమయ్యారు.
సంక్రాంతి రేసు నుంచి తప్పుకొని ఫిబ్రవరి 9న విడుదల కానున్న ఈగల్ చిత్రానికి పోటీని తగ్గించేందుకు తెలుగు ఫిల్మ్ చాంబర్ ప్రయత్నాలు చేసింది. ఈ విషయంపై నేడు మీడియా సమావేశంలో మాట్లాడారు దిల్‍రాజు. ‘ఊరు పేరు భైరవకోన’ సినిమాను వాయిదా వేసేందుకు మూవీ టీమ్ అంగీకరించిందని దిల్‍రాజు నేడు చెప్పారు. ఓ వారం రోజులు ఆలస్యంగా చిత్రాన్ని తీసుకొచ్చేందుకు ఓకే చెప్పారని తెలిపారు. దీంతో ‘ఊరు పేరు భైరవకోన’ సినిమా ఫిబ్రవరి 16వ తేదీకి వాయిదా పడింది.
రవితేజ హీరోగా నటించిన ఈగల్ సినిమా మాస్ యాక్షన్ డ్రామాగా రూపొందింది. ఈ చిత్రానికి కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వం వహించారు. ట్రైలర్ తర్వాత ఈ చిత్రంపై అంచనాలు భారీగా పెరిగాయి. రవితేజ గెటప్, యాక్షన్ సీన్లు ట్రైలర్‌లో అదిరిపోయాయి. ఎట్టకేలకు ఫిబ్రవరి 9న రిలీజ్ కానుంది ఈగల్.
సూపర్ నేచురలర్ ఫ్యాంటసీ థ్రిల్లర్ మూవీగా ఊరు పేరు భైరవకోన తెరకెక్కింది. వీ ఆనంద్ దర్శకత్వంలో సందీప్ కిషన్ ఈ చిత్రంలో హీరోగా నటించారు. ట్రైలర్ ఆసక్తికరంగా ఉండటంతో ఈ మూవీపై మంచి బజ్ ఏర్పడింది. అయితే, ఫిల్మ్స్ చాంబర్ సూచనతో ఈ సినిమాను ఫిబ్రవరి 16కు వాయిదా వేసేందుకు మూవీ టీమ్ అంగీకరించింది.
యాత్ర 2 టీమ్ అంగీకరించలేదు
ఫిబ్రవరి 8 నుంచి రిలీజ్‍ను వాయిదా వేసుకునేందుకు ‘యాత్ర 2’ మూవీ టీమ్ అంగీకరించలేదని దిల్‍రాజు చెప్పారు. ఆంధ్రప్రదేశ్ ప్రస్తుత ముఖ్యమంత్రి వైఎస్ జగన్‍మోహన్ రెడ్డి.. 2019 ఎన్నికలకు ముందు చేసిన సుదీర్ఘ పాదయాత్ర ఆధారంగా ఈ చిత్రాన్ని దర్శకుడు మహీ వీ రాఘవ్ తెరకెక్కించారు. ఈ చిత్రంలో జగన్ పాత్రలో తమిళ నటుడు జీవా నటించారు.
తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ ప్రధాన పాత్ర పోషించిన లాల్ సలాం చిత్రం ఫిబ్రవరి 9న రిలీజ్ కానుంది. తెలుగునూ ఈ చిత్రం విడుదల కానుంది. అయితే, తెలుగు రిలీజ్ వాయిదా వేసేందుకు లాల్ సలాం టీమ్ అంగీకరించలేదని దిల్‍రాజు తెలిపారు.
దీంతో.. ఈగల్ సినిమాకు యాత్ర 2, లాల్ సలాం పోటీగా ఉండనున్నాయి. అయితే, ఈగల్ చిత్రానికి ఎక్కువ థియేటర్లు కేటాయిస్తామని దిల్‍రాజు చెప్పారు. ఈగల్ మూవీని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ నిర్మించింది.
దేవర స్థానంలో ఫ్యామిలీ స్టార్!
విజయ్ దేవరకొండ, మృణాల్ ఠాకూర్ హీరోహీరోయిన్లుగా నటిస్తున్న ‘ఫ్యామిలీ స్టార్’ చిత్రాన్ని శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై దిల్‍రాజు ప్రస్తుతం నిర్మిస్తున్నారు. అయితే, ఈ మూవీ రిలీజ్ ఎప్పుడని ఈ మీడియా సమావేశంలో దిల్‍రాజుకు ప్రశ్న ఎదురైంది. అయితే, దేవర పార్ట్-1 సినిమా ఏప్రిల్ 5వ తేదీ నుంచి వాయిదా పడితే.. ఆరోజు ఫ్యామిలీ స్టార్ రిలీజ్ చేసేలా ప్లాన్ చేస్తున్నామని దిల్‍రాజు అన్నారు. ఎన్టీఆర్ హీరోగా నటించిన దేవర మూవీ ఏప్రిల్ 5న రిలీజ్ కావాల్సి ఉండగా.. వాయిదా పడడం ఖాయమని తెలుస్తోంది.