New Parliament Inauguration: 'మేం వెళ్తాం'... విపక్షాల నిర్ణయాన్ని తప్పుబట్టిన సీఎం జగన్-ap cm jagan questions opposition parties boycott of new parliament building inauguration ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  New Parliament Inauguration: 'మేం వెళ్తాం'... విపక్షాల నిర్ణయాన్ని తప్పుబట్టిన సీఎం జగన్

New Parliament Inauguration: 'మేం వెళ్తాం'... విపక్షాల నిర్ణయాన్ని తప్పుబట్టిన సీఎం జగన్

Maheshwaram Mahendra Chary HT Telugu
May 25, 2023 12:10 PM IST

CM Jagan On New Parliament Building Inauguration:నూతన పార్లమెంట్ భవనం ప్రారంభోత్సవంపై ఏపీ సీఎం జగన్ స్పందించారు. బహిష్కరించాలని విపక్ష పార్టీలు తీసుకున్న నిర్ణయం సరైంది కాదని ట్వీట్ చేశారు.

బహిష్కరించడం నిజమైన ప్రజాస్వామ్య స్ఫూర్తి కాదు - సీఎం జగన్
బహిష్కరించడం నిజమైన ప్రజాస్వామ్య స్ఫూర్తి కాదు - సీఎం జగన్

New Parliament Building Inauguration Updates: నూతన పార్లమెంట్ ప్రారంభోత్సవంపై రాజకీయ రగడ కొనసాగుతూనే ఉంది. కొత్త భవనాన్ని రాజ్యాంగ అధినేతగా రాష్ట్రపతిని కాకుండా ప్రధానమంత్రి ప్రారంభింస్తారనడంపై విపక్ష పార్టీలు తీవ్ర అభ్యంతరాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఈ నెల 28న జరగబోయే ప్రారంభోత్సవాన్ని బహిష్కరించాలని ఆప్‌, సీపీఐ, తృణమూల్‌ కాంగ్రెస్‌ తో పాటు పలు పార్టీలు నిర్ణయించాయి. ఈ కార్యక్రమాన్ని బహిష్కరించాలని మొత్తం 19 విపక్ష పార్టీలు నిర్ణయించగా.. బుధవారం ఒక సంయుక్త ప్రకటనను విడుదల చేశాయి. ఇక ఇదే అంశంపై వైఎస్ఆర్సీపీ అధినేత, సీఎం జగన్ స్పందించారు. పార్లమెంట్ అనేది ప్రజాస్వామ్య దేవాలయం అన్న ఆయన... అది మన దేశం యొక్క ఆత్మను ప్రతిబింబిస్తుందని ట్వీట్ చేశారు. ఈ సందర్భంగా విపక్ష పార్టీలకు హితవు పలికారు.

"నూతనంగా నిర్మించిన పార్లమెంట్ భవనాన్ని జాతికి అంకితం చేయబోతున్న ప్రధాని నరేంద్ర మోదీకి నా అభినందనలు. పార్లమెంట్ అనేది ప్రజాస్వామ్య దేవాలయం. ఇది మన దేశ ప్రజలకే కాదు... అన్ని రాజకీయ పార్టీలకు చెందినది. ఇలాంటి శుభకార్యక్రమాన్ని బహిష్కరించడం నిజమైన ప్రజాస్వామ్య స్ఫూర్తి కాదు. రాజకీయ విభేదాలన్నింటినీ పక్కనపెట్టి.. ఈ కార్యక్రమానికి అన్ని రాజకీయ పార్టీలు హాజరుకావాలని కోరుతున్నాను. నిజమైన ప్రజాస్వామ్య స్ఫూర్తితో ఈ చారిత్రాత్మక కార్యక్రమానికి వైసీపీ హాజరవుతుంది" అంటూ తన ట్వీట్ లో రాసుకొచ్చారు ముఖ్యమంత్రి జగన్.

ఇక మే 27వ తేదీన న్యూఢిల్లీలో జరగనున్న నీతి ఆయోగ్ పాలక మండలి సమావేశానికి సీఎం జగన్ హాజరవుతారని తెలుస్తోంది. ఇదే సమయంలో మరుసటి రోజే నూతన పార్లమెంట్ భవనాన్ని ప్రారంభించనున్న నేపథ్యంలో... స్వయంగా పాల్గొంటారని సమాచారం. జగన్ హాజరుకాకపోతే పార్టీ తరపున ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి, పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయిరెడ్డితో పాటు సహచర ఎంపీలు హాజరవుతారని తెలుస్తోంది.

పార్లమెంట్ భవన ప్రారంభోత్సవానికి హాజరు కాబోమని ప్రకటించిన పార్టీల్లో.. కాంగ్రెస్, టీఎంసీ, డీఎంకే, సీపీఎం, సీపీఐ, ఆప్, శివసేన (ఉద్ధవ్ వర్గం), సమాజ్ వాదీ పార్టీ, జేఎంఎం, కేరళ కాంగ్రెస్, రాష్ట్రీయ లోక్ దళ్, రాష్ట్రీయ జనతాదళ్, ఎన్సీపీ, ఐయూఎంఎల్, నేషనల్ కాన్ఫెరెన్స్, ఆరెస్పీ, ఎండీఎంకే.. మొదలైనవి ఉన్నాయి. అయితే బీఆర్ఎస్ పార్టీ నిర్ణయం తెలియాల్సి ఉంది. ఇక ఈ కార్యక్రమానికి ఎన్డీయే భాగస్వామ్య పక్షాలతో పాటు శిరోమణి అకాలీదళ్, వైఎస్సార్సీపీ, తెలుగుదేశం పార్టీ, శివసేన (షిండే వర్గం) తదితర పార్టీలు హాజరవుతున్నాయి. ఒకవేళ లోక్ సభ స్పీకర్ ఓం బిర్లా… పార్లమెంటు నూతన భవనాన్నిప్రారంభిస్తే.. ఆ కార్యక్రమానికి హాజరవుతామని ఎంఐఎం తెలిపింది.

Whats_app_banner

సంబంధిత కథనం